**దశిక రాము**
**మహాభారతము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
భీష్మపర్వం.153
శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు.
తృతీయాధ్యాయం కర్మయోగం
శ్రీ భగవానువాచ :
లోకే>స్మిన్ ద్వివిధా నిష్టా పురాప్రోక్తా మయా>నఘ
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. // ( 3 .3 )
శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు :
ఓ పాపరహితుడవైనా పార్ధా ! అనాదినుండీ, జనుల అర్హతలను బట్టి రెండురకములైన నియమాలు చెప్పబడి వున్నవి. ఆత్మానాత్మ వివేకము కలిగిన ఆత్మజ్ఞాన వాసనలున్న వారికి, వివేకవంతులైన తత్వవేత్తలకు, జ్ఞానయోగము, మిగిలిన యోగాచారణ చేసే కర్మిష్ఠులకు కర్మయోగము చెప్పబడినది.
' కృష్ణా ! కర్మకంటే జ్ఞానముత్తమమైనదని చెప్పి, నన్నెలా ఘోరమగు యీ కర్మలు చేయమందువు ? పరస్పర విరుద్ధములైన యీ రెండింటిలో నామార్గమేదో, నాకేది శ్రేయస్కరమో నీవే నిర్ణయించి చెప్పు. ' అని అడిగాడు అర్జునుడు.
నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య కర్మణః
శరీర యాత్రాపిచ తే న ప్రసిద్ధ్యే ద కర్మణః // ( 3 . 8 )
ఓ అర్జునా ! నీవు ఫలాపేక్షరహితుడవై, కర్మల నాచరింపుము. అట్టికర్మలు బంధ హేతువులుకాదు. శరీరయాత్ర గడపడానికి స్వధర్మ కర్మాచరణ ఉత్కృ ష్టమైనది.
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా ఛాస్యంతే యజ్ఞభావితా : /
తైర్దత్తా న ప్రదాయై భ్యో యో భు0క్తే స్తే న ఏ వస : .// ( 3 . 12 )
యజ్ఞములతో దేవతలను సంతోషపెట్టినచో, దేవతలు మీకు కావలసిన కోరికలు తీర్చెదరు. వారిచ్చిన సంపదలనే, యజ్ఞరూపమున మరల వారికిచ్చి సంతృప్తి పరచనిచో, అట్టి మానవులు దొంగలుగా పరిగణింప బడతారు.
నమే పార్దాస్తి కర్తవ్యమ్ త్రిషు లోకేషు కించన
నా నవాప్త మవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. // ( 3 . 22 )
పార్ధా ! నాకు మూడులోకములందు, చేయవలసిన, చేయదగిన కార్యమేదియును లేదు. నేను పొందవలసిన కర్మఫలములు కూడా యేమియూ లేవు. అయిననూ, నేను కర్మల నాచరించుచునే వున్నాను. అనగా, జ్ఞాని అయినవాడు కర్మలనాచరించినా దోషమేదీ అంటదని భావము.
ప్రకృతే: క్రియమాణాని గుణై : కర్మాణి సర్వశ :
అహంకార విమూఢాత్మా కర్తా హమితి మన్యతే // ( 3 . 27 )
సత్వ, రజ స్తమో గుణములచేతనే, సర్వ కర్మలు చేయబడుతున్నవి. అట్టి గుణములు కర్మ చేయుటకు హేతువులు కాగా, ఆత్మజ్ఞానము లేనివాడు, ఆ కర్మలన్నీ, తానే కర్తగా చేశానని అహంకరిస్తూ వుంటాడు.
తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో :
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే // (3 . 28 )
దీర్ఘ బాహువులు గల ఓ అర్జునా ! జ్ఞాని తాను చేసే కర్మలు గుణ త్రయముల ద్వారా జరుగుతున్నవని తెలుసుకుని, తనకు ఆపాదించుకోకుండా, కర్త్రుత్వాభిమాన వర్జితుడై తన వ్యాపకములు జరుపుతూ వుంటాడు.
చతుర్దాధ్యాయము జ్ఞాన కర్మ స0న్యాస యోగము.
శ్రీ భగవానువాచ :
యదా యదాహి ధర్మశ్య గ్లానిర్భభవతి భారత
అభ్యుద్దాన మధర్మశ్య తదాత్మానం సృజామ్యహమ్. // ( 4 . 7 )
ఓ భరతవంశ శ్రేష్టా ! ఎప్పుడెప్పుడు ధర్మానికి సంకటం కలుగుతుందో, అప్పుడు నాకు నేనే అవతరించి ధర్మ సంస్తాపన చేస్తాను.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్తాపనార్ధాయ సంభవామి యుగే యుగే // ( 4 . 8 )
సాధు పుంగవులను, అనగా తమను తాము రక్షించుకోలేని వారి రక్షణకొరకు, వినాశకులను దునుమాడి, ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించడానికి, ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. గోబ్రాహ్మణేభ్యశ్చ శుభం భవతు. లోకా స్సమస్తా సుఖినో భవంతు.
చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ :
తస్య కర్తారమపి మాం విద్ధ్య కర్తారమవ్యయం. // ( 4 .13 )
త్రిగుణాల ప్రేరితులై, వారు వారు చేసే కర్మలను బట్టి, జీవులందరనూ నేనే నాలుగు వర్ణములకు చెందిన వారిగా సృష్టించితిని. వారి సృష్టికి నేను కారణమైనంత మాత్రాన, వారు చేసే కర్మలకు నేను కారణం కాదు. నాకు ఏ కర్త్రుత్వమూ అంటదు. ' జన్మనా జాయతే శూద్ర : కర్మణా జాయతే ద్విజ : వేదపారాయణే విప్ర : బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ : అనగా చేయు కర్మలను బట్టే, వర్ణ విభాగముండును.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నవ్ బ్రహ్మణా హుతం
బ్రహ్మయివ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధినా // ( 4 . 24 )
యజ్ణపాత్రలూ బ్రహ్మమే. హోమద్రవ్యమూ బ్రహ్మమే. సమిధల ద్వారా వచ్చిన అగ్నియు బ్రహ్మమే. హోమము చేయువాడూ బ్రహ్మమే. హోమమునకు ఏర్పాట్లు చేసినవాడూ బ్రహ్మమే. అట్టి బ్రహ్మ కర్మల ద్వారా వచ్చు ఫలం కూడా బ్రహ్మమే అని జ్ఞాని సమాధి స్థితిలో ఆనందముననుభవించును.
పంచమాధ్యాయము స0న్యాస యోగము.
సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత :
యోగ ముక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధి గచ్ఛతి // ( 5 . 6 )
అర్హత రాకుండా కర్మ సన్యాసం చేసిన వాడు అటు సన్యాస జీవితమూ గడపలేక, యిటు సంసార జీవితమూ లోనికి రాలేక దుఃఖితుడవుతాడు. అలాకాక, యుక్తమైన యోగాభ్యాసము చేసి, కర్మలను సన్యసించినవాడు, త్వరలోనే, ఆత్మజ్ఞానం పొందినవాడై, బ్రహ్మపదము పొందుతాడు.
సమ్యక్ న్యాస : - సంన్యాస : అనగా బుద్ధిని ఆత్మయందు స్థిరముగా నుంచుట. రజోగుణము వున్నవాడు, సన్యాసమునకు అర్హుడు కాదు. సన్యాసి, ముక్కుమూసుకుని కూర్చోకూడదు, సమాజానికి వుపయోగపడే కార్యాలు చెయ్యాలి అనేమాటలు, లౌకికమైనవి. రజోగుణం ఉన్నవాళ్లే, సమాజసేవ చేయగలరు. రజోగుణ నాశమే మనస్సును ఆత్మలో నిశ్చలంగా ఉంచుతుంది. రజోగుణమునకు, సన్యాసమునకు వైరి భావము.
నకర్త్రుత్వం నకర్మాణి లోకశ్య సృజతి ప్రభు :
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే // ( 5 . 14 )
లోకాలను సృష్టించిన భగవానునికి ఏ కర్త్రుత్వము, కర్మ ఫలాపేక్ష యేమీలేవు. కర్మఫలం కారణమగు కర్మ పరమాత్మ చే చేయబడుటలేదు. ఈ లోక వ్యవహారమంతా ప్రకృతి అనే మాయవలన జరుగుతున్నది.
కర్త్రుత్వాభిమానం కర్మఫలానుభవమునకు హేతువగును. రజోగుణము వలననే కర్త్రుత్వాభిమానము కలుగును. అందువలన సన్యాసి అవవలెనని కోరిక వున్నవాడు, యోగము ద్వారా రజోగుణ నాశమునకు మొదటగా ప్రయత్నించవలెను .
విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితా : సమదర్శిన : // ( 5 .18 )
విద్యా వినయములు కలిగిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసము తిను చండాలుని పండితులు, అనగా ఆత్మజ్ఞానంలో రమించుచూ, సమాధి స్థితికి చేరువలో వుండేవారు, ఉపాధి లక్షణములను చూసి కాకుండా, జీవుని దృష్టితో సమభావంతో వుందురు. జీవమున్న శివము, జీవం లేకున్న శవము. జీవం వున్నదంటే, ఆ జీవిలో పరమాత్మ వున్నట్లే. ఆజీవి లక్షణం యేమైనాగానీ,
కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్. // ( 5 . 26 )
కామక్రోధ రహితులు, అరిషడ్వార్గాలను జయించినవారు, యతులు, యెల్లప్పుడూ సంయక్దర్శనంతో, బ్రహ్మానందాన్ని పొందుతూ వుంటారు. వారే జీవన్ముక్తులు.
కాషాయము ఓర్పుకూ, త్యాగానికి ప్రతీక. కాషాయాంబరధారి ఆత్మజ్ఞాన సముపార్జనలో వున్నవాడు, ఆత్మజ్ఞానం పొందినవాడు అయివుంటాడు. అట్టివానిని బలహీనుడుగా భావించి, వారిని అన్యులు హింసించకుండా, సమాజము వారిని కాపాడవలె. గోవు, సన్యాసి, వారినివారు కాపాడుకునే దశలో వుండరు గనుక, వారిని కాపాడుట సమాజ బాధ్యత.
స్వస.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి