1, ఏప్రిల్ 2021, గురువారం

*15. వేదాంగములు : శిక్ష*

 *ఓం నమః శివాయ*:

*42-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*



*15. వేదాంగములు : శిక్ష*


((((((((((🕉))))))))))


*తూర్పుతీరాన్నీ, దానిని ఆనికొని ఉన్న ఆంధ్ర ప్రాంతాన్నీ తీసికొంటే 98% యజుర్వేదాన్ని పాటిస్తారు. మిగిలిన 2% వారు ఋగ్వేదాన్ని. ఆంధ్రలో ''సామవేదం'' వారు లేరనే చెప్పవచ్చు. యజుర్వేదమే ఇక్కడ ప్రమాణమవటం వల్ల ఋగ్వేదంలోని ''ళ'' సహజంగానే ''ద''గా మారంది. తెలుగులో కూడ ఇతర భాషలలోని ''ళ'' 'ద'గా మారింది. ఆంధ్రలో వలె కాకపోయినా తమిళనాడులో కూడ తర్వాతి కాలంలో యజుశ్శాఖాద్యయులు అధిక సంఖ్యా కులైనారు. తమిళనాడులో 80% యజుశ్శాఖేయులు, 15% సామవేదం వారు మిగిలిన 5%  ఋగ్వేదులుగా అనుకోవచ్చు. ఇది ఇప్పటి పరిస్థితే అయినా పూర్వం సామవేదమను సరించే వారే అత్యధికులు తమిళనాడులో సామవేదంలోని 1000 శాఖలను అనుసరించే వారు తమిళనాడులో ఉండే వారనటం తప్పుకాదు.*



*ప్రస్తుతపు కేరళలో వాడుకలో నున్న భాష మళయాళం, తెలుగు, కన్నడములతో బాటు ఈ భాషని  పేర్కొనక బోవటానికి కారణం, పల్లవుల వలె ఇది కూడ ఈ సమీప కాలానికే చెందటం. వెయ్యి సంవత్సరాల క్రితం వరకూ కూడ కేరళ తమిళనాడులోనే ఉండేది - అక్కడ తమిళాన్నే వాడేవారు. ఆ తరువాత మళయాళం తమిళం నుండి జనించింది. తమిళంలోని 'ళ' (zha) తెలుగులో 'ద'గాను, కన్నడంలో 'ళ' గాను మారినా, మళయాళంలో మాత్రం ఆ రూపంతోనే ఉంది. ఇంతకూ చెప్పేదేమిటంటే ఆయా ప్రాంతాలలో వేదాల ఉచ్చారణల ననుసరించి, ప్రాంతీయ భాషలు తమకి ప్రత్యేక లక్షణాలైన అక్షరాలను ఏర్పర్చుకున్నాయి. ఇప్పటి వరకూ  చెప్పినదంతా ద్రావిడులనబడే వారి భూమికి సంబంధించింది. ఇక అఖిలభారత, అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా పరిశీలన.*



*ఉత్తర భారతంలో ''య'' బదులు ''జ''ని, 'వ'కి బదులు ''బ''ని వాడటం పరిపాటి. వాడుక భాషలోనే కాక కావ్య భాషలో కూడ ఇట్లాగే జరుగుతుంది. 'వ', 'బ'గా మారటం బెంగాలులో బాగా కనబడుతుంది. ''య'' 'జ'గా మారటం ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఇంకా ఉత్తర ప్రాంతాలలో కనబడుతుంది. పాణిని సూత్రమైన ''వ బయోరభేదం'' ('వ', 'బ'లను ఒక దాని స్థానంలో మరొకటి వాడవచ్చు) బాగా ఆచరణలో ఉన్నట్టు బెంగాలులో తెలుస్తుంది. బెంగాలులో 'వ' ప్రతిచోటా 'బ'గా మారుతుంది. అసలు 'వంగ' అన్నదే 'బెంగాలు'గా మారింది. ''వంగవాసి'', ''బంగవాసి''గా మారింది. ఈ తప్పుని వారే గుర్తించారు. ఈ తప్పుని దిద్దటానికి బెంగాలులో ఒక పరీక్షని కూడ పెట్టారు. దాని పేరు ''వంగ పరిషత్‌'' అన్ని ప్రచురణలలోనూ ''బ'' కి బదులు ''వ''ని వాడాలని వారి సంకల్పం. ఆ సంకల్పంలో అప్రయత్నంగా, అనవసరమైన చోట్ల కూడా ''బ''ని ''వ''గా మార్చారు.'బంధు' (అంటే చుట్టం)ని 'వంధు'గా మార్చారు. 'వంగబంధు' సరియైన మాట. అది ''బంగబంధు''గా మారితే దానిని తప్పుగా ఇప్పుడు 'వంగు వంధు''గా మార్చారు. ఉత్తర భారతంలోనూ, మరికొన్ని ప్రాంతాలలోనూ ''వ''కి బదులు 'బ'ని వాడుతారు. బిహార్‌, నిజానికి విహార్‌. ఈ ప్రాంతంలో బౌద్ధ విహారాలు పుష్కలంగా ఉండేవి. ''రాష్‌ బిహారి'' నిజానికి ''రసవిహారి'' ''వ''ని ''బ''గా పలుకటానికి కారణమేమిటి? ఒక శాఖకి చెందిన ఆ ప్రాంతీయులట్లా పలకాలని ప్రాతిశాఖ్య నిర్దేశిస్తుంది. ఈ నియమం వేద మంత్ర పఠనానికి సంబంధించినది - కాని అదే వాడుక భాషకీ, సాహిత్య భాషకీ విస్తరింప బడింది. అంటే, ఆ ప్రాంతంలో ఒకప్పుడు 'శిక్ష' నియమాలను ఎంతో నిష్ఠతో పాటించే వారనమాట.*



*దేశం మొత్తమ్మీద యజుశ్శాఖవారు అత్యధికులు ఉన్నారు. ఈ వేదానికి రెండు పాఠాలు - అంటే కృష్ణ యజుర్వేదం, శుక్లయజుర్వేదం ఉన్నాయని కూడ. దక్షిణ భారతంలో కృష్ణయజుర్వేదం బహుళ ప్రచారంలో ఉంటే, ఉత్తర భారతంలో శుక్ల యజుర్వేద ముంది. శుక్లయజుర్వేదానికి గల అనేక శాఖలలో ఒకటి మాధ్యన్దిన శాఖ. దీనిని ఉత్తర భారతంలో నిష్ఠగా అనుసరిస్తారు. తత్సంబంధమైన ప్రాతిశాఖ్య ప్రకారం ''య'' స్థానంలో ''జ''ని వాడవచ్చు. అట్లాగే ''ష'' స్థానంలో ''క''ని వాడవచ్చు. అందువల్లే దాక్షిణాత్యులు ''యత్‌ పురుషేణ హనిషా'' అంటే ఉత్తర దేశీయులు ''జత్‌'' ''పురుషేణ హవికా'' అంటారు. కాలక్రమేణా ఉత్తరదేశంలో ఈ మార్పు చాలా మాటలకి వ్యాపించింది. ''యమున'', ''జమున''గాను, 'యోగి', 'జోగి'గాను 'యుగ', 'జుగ'గాను, 'యాత్ర', 'జాత్ర'గాను మారాయి. 'ష' 'క'గా మారినప్పుడు 'ఋషి' 'ఋకి'గా మారింది. 'క్ష', 'ష' సన్నిహిత బంధువులు కదా. అందువల్లనే ఉత్తరదేశంలో 'క్ష', 'క' అవుతుంది. 'క్షీరం' 'కీర్‌' అవుతుంది. ఇట్లాంటివే ఎన్నో ఉదాహరణలివ్వ వచ్చు.*



*ఇక అంతర్జాతీయ స్థాయిలో పరిశీలన. క్రైస్తవం, బైబిల్‌ జన్మించిన పాలస్తీనాకూ, ఇజ్రెయిల్‌, సెమిటిక్‌ దేశాలకూ వెళ్దాము. క్రైస్తవుల ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ - ముస్లిం కొరాన్‌కి మూలం. మొదటి దాంట్లో ఉన్నవి రెండవ దాంట్లో ప్రత్యక్షమవు తూంటాయి. కాని అరేబియాలో ఉచ్ఛారణ మారుతూంటుంది. 'జోసెఫ్‌' 'యూసఫ్‌'గాను, 'జెహొవ' 'యహొవ'గాను మారుతాయి. క్రైస్తవం, ఇస్లాంలకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవ దేశాలలో కూడ కొన్ని భాషలలోనే 'య' శబ్దం ప్రముఖంగా ఉంటుంది. కొన్నిటిలో 'జ' శబ్దం ఎక్కువౌతుంది. గ్రీస్‌ వెళ్లితే 'జ' శబ్దం స్పష్టమవుతుంది. దీనంతటికీ మూలం వేదాలలో కనిపిస్తుంది.*



 *వేదాలలోని ''యహ్వన్‌'' అన్న దేవత జహోవ (యహోవ), దేపిత - జూపిటర్‌, సంస్కృతంలో అసంపూర్ణమైన హల్లులు మొదట్లో వస్తే మరొక భాషలో చెప్పేప్పుడు దానిని వదిలివేస్తారు ''దౌపతిర్‌'', ''¸°పితర్‌''గాను జూపిటర్‌గాను మారుతుంది. ''యహ్వన్‌'', ''ద్యౌపితర్‌'' లలోని 'య' 'జ'గా మారటం వల్ల 'జెహోవ' జూపిటర్‌ ఏర్పడ్డాయి - దీని అర్థమేమిటి ?ప్రపంచమంతా వేదవిహితమైన విధులు వ్యాప్తమై యున్న రోజులలో, గ్రీస్‌ ప్రాంతంలో ''మాధ్యన్దిన శాఖ'' (యజుర్వేదం) బాగా ప్రాచుర్యంలో ఉండేదని తెలియటం లేదా? వేదపద ఉచ్చారణ ప్రాంతీయ భాషను ప్రభావితం చేసిందా లేక ప్రాంతీయ భాష వేదపద ఉచ్చారణనా?ఒక్కొక్క ప్రాంతంలో వేదాలలోని పదాలే ఆ ప్రాంతపు వాడుక భాషలో, కావ్య భాషలో వాడబడేవి. దీని బట్టి వేదాలన్ని దేశాలలోనూ వ్యాప్తి చెందాయని తెలుస్తుంది.*



*వేదాల శిక్షానియమాలు ప్రాంతీయభాషలకు ప్రధాన ఉచ్ఛారణ లయ్యాయి. దీనికి కారణం ప్రాతిశాఖ్య నియమాలు ఏ ఒక్క ప్రాంతానికీ చెందినవి కాకపోవటం. వేదశాఖ ప్రచారంలో ఉన్న ప్రాంతాలన్నిటి కొరకూ ఏర్పడింది. కాశ్మీరులోనైనా కామరూపం (అస్సాం)లోనైనా జైమిని సామని పఠించేవారు ''ష'' అని పలికితే ఇతరులు ''ద'' అనో ''ళ'' అనో పలుకుతారు.గుజరాతీయైనా, మరాఠీ అయినా, మరేదైనా మాతృభాష కావచ్చు శుక్లయజుర్వేదాన్ని పఠించేవాడు ''ద''నే పలుకుతాడు. ప్రాతిశాఖ్య ఏ ప్రాంతానికీ పరిమితం కాదు, ఉచ్చారణ నియమాలను నిర్దేశిస్తుంది. కాలక్రమేణా ఏ శాఖ ఏ ప్రాంతంలో వాడుకలో ఉంటే, ఆ అక్షరానికి గల ప్రత్యేక లక్షణం ప్రాంతీయ భాషకి కూడ ప్రాకింది.శిక్షా శాస్త్రం గురించి గమనింపదగ్గ మరికొన్ని అంశాలు: వేద శబ్దాలను, ఉచ్చారణ పద్దతులను మార్చరాదన్నాను. శాఖా భేదాల వల్ల చిన్న చిన్న మార్పులను శిక్షాశాస్త్రం అనుమతిస్తుంది. ఆ విధంగానే స్వరస్థాయికి సంబంధించిన మార్పులూ ఆమోద యోగ్యాలే.*



*వేదాలను వల్లించటంలో సంహిత, పద, క్రమ పద్ధతులున్నాయని చెప్పాను. ఆయా భిన్న రీతులని ప్రాతిశాఖ్య అనుమతిస్తుంది. ఇవి శిక్షాశాస్త్ర భాగాలు. ఇదేదో శబ్దాలకి సంబంధించిన చర్చ అని తేలికగా చూడకూడదు. సంస్థితమైనది శబ్దమే. అందువల్లనే వేదపురుషుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిపే నాసిక, శిక్షాశాస్త్రం. సంస్కృతంలోని 50 అక్షరాలు (శబ్దాలు) వేదాలనుండి వచ్చినవే. ''జ్ఞ'' అన్న అక్షరాన్ని విడిగా తీసుకుంటే 51 అవుతాయి. వీటిని ''మాతృక'' అంటారు. ఈ మాటకి చాలా అర్థాలున్నాయి. మాతృ అంటే మాత - దీని అర్థం విశ్వమాత. ఆ పరాశక్తి ప్రతిబింబాలే ఈ 51 అక్షరాలూను. జగత్‌సృష్టి పరాశక్తి వల్లనే జరిగితే, సృష్టికి శబ్దమే మాధ్యమమైతే 51 అక్షరాలూ పరాశక్తి స్వరూపాలే అవుతాయి కదా!*



*శిక్షాశాస్త్రం ప్రకారం ఈ 51 శబ్దాలూ పరాశక్తి శరీరభాగాలే - అంతే కాదు, ఏ అక్షరం ఏ శరీర భాగానికి ప్రతీకో కూడ ఆ శాస్త్రం చెప్తుంది. మన దేశంలో కల శాక్తేయుల 51 స్థావరాలకూ, ఆ విశ్వ దేహపు 51 భాగాలకు సంబంధముంది. శిక్షాశాస్త్రం వేదపురుషుని నాసికగా భావింప బడటమే కాక అక్షరాలన్నీ కలిసి పరాశక్తి - విశ్వమాత - రూపంగా భావింప బడటం ఆ శాస్త్ర ప్రాధాన్యతని మరీ ఎక్కువ చేస్తుంది!*


🕉🌷🕉🌷🕉🕉

కామెంట్‌లు లేవు: