*మామిడికాయ పచ్చడి*
( *కాశీ*)
🌷🌷🌷
పదకొండేళ్ళ క్రితం, పేరుకి హైదరాబాద్ అయిన ఒక మారుమూల ప్రదేశం లో నా కాస్తార్జితం (కష్టార్జితం) పోసి కట్టాను ఇల్లు.
"చచ్చిపోతున్నాను, ఈ ఎండుటాకులు, చెత్త వూడవలేక రోజూ. మీకే మీ పాటికి చెట్లు పాతేసి చక్కా కూర్చున్నారు. " వూడ్చుకుంటూ విసుక్కుంది మా ఆవిడ.
" పనిమనిషిని పెట్టుకోవే బైట పనికి ఆని వెయ్యిసార్లు చెప్పాను." భయం భయం గానే అన్నాను నేను.
" అవును , ఉన్న ఇద్దరికీ పనిమనిషి కూడా తోడైతే ఇంకా పోత్రాల్లా ఊరి పోతాం" ఉరిమింది.
"ఏవేవ్ ! ఇందాక పైన వాకింగ్ చేస్తూ చూసా, జామకాయలు ఓ నాలుగు పండాయి." అన్నా, టాపిక్ మారుద్దామని ప్రయత్నిస్తూ.
"సరే నిచ్చెన తెండి! కోస్తాను" అంది మా ఆవిడ.
ఏమన్నా బాలా కుమారి అనుకుంటున్నారేమో మా ఆవిడ నాకంటే ఏడాదిన్నర చిన్న. ఇంకో మూడేళ్ళల్లో 50 యో పడిలో పడుతుంది.
సరే నేను ముందు సపోటాలు కోస్తాను తరువాత కిందకి వస్తా అని చెప్పి సపోటాలు కొయ్యడం మొదలెట్టాను.
"ఇప్పుడే వెనకంతా ఊడ్చాను, మళ్ళీ సపోటా ఆకులు పోశారు వెనకంతా" నీలిగింది మా ఆవిడ.
"ఉండవేవ్ ! మావిడి కాయలు రెండు తగ్గాయి. ఎవడో కోసేసి నట్టున్నాడు చూడు. "
"అవునండి. అక్కడ రెండు కాయలు ఉండాలి. లేవు. కింద పడ్డాయేమో చూడండి" అంటూ చెట్టు గట్టెక్కింది మా ఆవిడ కూడా గొడవతల చూస్తూ.
"అందుకే చెప్పాను కోసేద్దామని, విన్నావు కాదు. పెద్దవవుతాయ్ అంటూ కూర్చున్నావ్." అంటూ విజృంభించాను నేను. మా ఆవిడ మీదకి కాదు లెండి చెట్టుమీదకి.
ఇంతలో మా ఆవిడ స్నానానికి వెళ్లింది.
అదే అదనుగా ఒక పాతికకాయ చిన్నవి, పెద్దవి కోసేశాను. అన్నీ జాగ్రత్తగా సద్ది మామిడికాయలు, జామకాయలు, సపోటాలూ అన్నీ ఫోటోలు తీసి కూర్చున్నాను.
కోసినంతసేపు పట్టలేదు మా ఆవిడకి పంచెయ్యడానికి. దానికి, మా అమ్మకి ఇంట్లో సరుకు ఉంటే కంగారూ వచ్చేస్తుంది. అసలే మా కాలనీ లో మన పేరు "ఆవిడ గారి ఆయన". ఆ చివర ఆకువడల వాళ్ళ దగ్గరనుండి మొదలు పెట్టి ఈ చివర ఆరటి కాయల వాళ్లవరకు అన్నీ మా ఆవిడకి ఇచ్చి పుచ్చు కోవడాలే. ఏవిటో నాకు వాళ్లిచ్చే పదార్ధాల పేర్లే కానీ వాళ్ళ పేర్లు గుర్తుంది చావవు.
ఒకసారి అదే కొంప ముంచింది. వచ్చినావిడని చూసి అలవాట్లో పొరపాటుగా " ఏవేవ్ ఆ ములక్కాడలావిడ వచ్చింది " అన్నాను చిన్నగా. అంతే ఆవిడ వెళ్ళాక మా ఆవిడ సహస్రనామం అందుకుంది, "ఇంటికి ఎవ్వరిని రానివ్వరా" అంటూ.
నిజానికి ఒక వయసు వచ్చేసరికి పిల్లలకి రెక్కలు వచ్చేస్తాయి. అప్పుడు అందరి ఇళ్ళల్లోనూ " మిథునం" సినిమానే నడుస్తుంది.
వయసులో ఉన్నప్పుడూ పెద్దగా నిండుగా అనిపించిన ఇల్లు, వయసైపోయాక ఖళీగా, మరీ పెద్దగా కనిపిస్తుంది. ఇంకా ఈ చెట్లు, ఆ కాయలు, మా తీర్థ యాత్రలు దీనితోనే గడిపెయ్యలి. ఎదురుచూస్తూ.
నాన్నగారు ఎప్పుడు త్వరగా వెళ్ళి పోవాలని, లేక అలాంటి మాటలు కానీ అనేవారు కాదు. ఎప్పుడు ఆయన ఆలోచన భవిష్యత్తు లో మేము ఏంచేయాలో అనే ఉండేది. ఆయన ఆలోచనలని మా మీద ప్రేమ కప్పెసింది. అమ్మ అంటువుండేది, త్వరగా వెళ్ళి పోవాలని, అది పోయేముందు ఒక రెండు మూడు సంవత్సరాలనుండి.
ఇంతవరకు శంకరాచార్యుడి లా తన నిర్యాణం ని ఒక ప్రణాళికతో అమలు పరిచిన వాళ్ళని చూడలేదు, కానీ కాశీ లో ఉండాలని ఉంది.
ఇలా అన్నానంటే, వెంటనే మా ఆవిడ అంటుంది "ఇంతకంటే కాశీ ఎందుకండి, రెండు కిలో మీటర్లు నడిచి వేడితే కానీ మనిషి కనపడని చోటులో కట్టారు మన ఇల్లు" అని.
ప్రస్తుతానికి మావిడికాయ పప్పు, కొబ్బరికాయ (ఇవి మా ఇంట్లోవే నండోయ్ కాకపోతే మా వూళ్ళో ఇల్లు ఉంది, అక్కడవి). మామిడికాయి పచ్చడి, పొన్నగంటి కూర (ఇది ఇంట్లోడే నండోయ్, ఒక నెల క్రితం సంత లో కొన్న కూర కాడలు పాతితే వచ్చింది.) తో భోజనం తిని. అల్పాహారంగా ఓ జామకాయ ముక్క కడుపులో పారేసి నడుం వాలుద్దామా అన్నంతలో, మా ఆవిడ అంది "మరి కాశీ అన్నారు" అని.
"వెడదాం, వెడదాం , రాత్రికి మావిడికాయ పచ్చడి వుంచావా" అని ఆరా తీస్తూ నిద్రలోకి జారుకున్నా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి