1, ఏప్రిల్ 2021, గురువారం

ఏకలవ్వే

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

            *ఏకలవ్వే*  

      (ప్రభాకర్ పెదపూడి)

              🌷🌷🌷

 “ఒరే! గోపాలం, ఎక్కడికి అలా పరిగెడుతున్నట్లుగా వెడుతున్నావు” అరుగుమీద కూర్చున్న బామ్మ అడిగింది. “ఆ! ఏముంది బామ్మగారూ, బాధలండీ బాధలు మనిషన్నవాడికి కాకుండా పశువులకి వస్తాయా, నా తోడల్లుడు కాకినాడ భానుగుడి దగ్గర చెడా మడా ఆడపిల్లలవైపు చూస్తూ నడుస్తూ పక్కనేఉన్న మురికి కాలవలోపడి కాలూ చేయి పుటుక్కున విరక్కొట్టుకున్నాట్ట. చూడక చస్తానా వెడుతున్నాను, వచ్చేటప్పుడు ఏమైనా తెమ్మంటారా ద్రాక్షపళ్లూ, దానిమ్మకాయల్లాంటివి “ ముక్కుపొడెం డబ్బా బయటకు తీస్తూ అన్నాడు గోపాలం.

 “గోపాలం నాకు ఏమీ పెద్దగా తేనవసరం లేదుకానీ, సర్పవరం సెంటర్లో మామిడి తాండ్ర అమ్ముతారు, రెండు కేజీలు పట్టుకొచ్చి పడై  అప్పుడప్పుడూ ఇంటికొచ్చే పిల్ల వెధవలు చప్పరించడానికి బావుంటుంది. తెచ్చాక డబ్బులు ఇస్తానులే బెంగపెట్టుకోకు, ఐనా మొన్నామద్యన నా దగ్గర  రెండువేలు తీసుకున్నావు అందులో విరగకోసుకో, ఏమిటి అలా ఏడుపు మొహం పెట్టావు వెళ్ళు అంది బామ్మ”.  గబగబా వెళ్లిపోయాడు గోపాలం.

 “ఇదిగో పార్వతీ ఎటు వెడుతున్నావు, మొహం అటు తిప్పుకు పోతున్నావు, పనులేమీ చెప్పనులే పిచ్చి మొహమా!  మీ చంటాడికి కొబ్బరుండలు  అంటే ఇస్టమన్నావు కదా ఓనాలుగు ఉండలు ఇస్తాను తీసుకెళ్లి తినిపించు. పిచ్చి వెధవ  ముద్దుగా బొద్దుగా ఉంటాడు “ లోపలికి వెళ్ళి చిన్న పొట్లం పార్వతి చేతిలో పెట్టింది.  పార్వతి నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

 “ఇదిగో రంగమ్మా పరుగు పరుగున ఎక్కడికి వెడుతున్నావు సినిమాక్కానీ వెడుతున్నావా కొంపతీసి “ అడిగింది బామ్మ చిక్కుడుకాయలు బాగుచేసుకుంటూ.  “అవును బామ్మా “ఏకలవ్య” భక్తి సినిమా , ఎంతబాగుంటుందో” ఆగి చెప్పింది రంగమ్మ. “ ఓసినీ మొహం మండా, వెనకా ముందూ చూసుకోకుండా అలా వెళ్లిపోవడమేనా ఆ సినిమా పేరు “ ఏకలవ్య’’ కాదు “ఏకలవ్వే” నేనూ పొరబడి దెబ్బతిన్నాను. పేర్లు పడ్డాక కానీ తెలియలేదు. నిమిషాల్లో ఇంటికొచ్చి పడ్డాను” బామ్మ చెప్పింది. రంగమ్మ నాలిక కరుచుకుని ఇంటిదారి పట్టింది.

కామెంట్‌లు లేవు: