విశాఖ పట్నం నుంచి లక్ష్మి గాయత్రి గారు వ్రాసిన ఈ కథనం అద్భుతః 🙏
బఫె భోజనాలు, బిర్యానీ మసాలాలతో విసిగి వేసారిన జనానికి, ఒక్కసారి పాతకాలపు పెళ్లి రుచి చూపించారు.
కథావల్లరి - 3
పాకవేదం
"బాపన్నగారమ్మాయికి పెళ్లి కుదిరిందిటా...విశేషాలేమిటి పంతులు గారూ..?!"
"పెళ్లి ఎక్కడ చేస్తున్నారు పంతులు గారూ... దసపల్లా లోనా.. డాల్ఫిన్ లోనా"
"మనందరికీ బస్సు వేయిస్తారా లేదా బాపన్న గారు... ముందది చెప్పండి పంతులు గారూ.. "
విశాఖపట్నానికి అత్యంత సమీపంలో ఉన్న పల్లెటూరది. బాపన్న గారు ఆ ఊళ్లో పేరు మోసిన భూస్వామి. ఆయనకి ఉన్న సంతానమల్లా కూతురు జానకి ఒక్కర్తే. జానకి పేరే పాత పేరు. అందరూ లాస్య, షర్మిల లాంటి పేర్లు పెట్టుకుంటున్న రోజుల్లో బాపన్న గారు కూతురికి 'జానకి' అని తన తల్లి పేరు పెట్టుకున్నారు. పిల్లని పద్ధతిగా పెచుకొచ్చారు. జానకి కూడా తండ్రికి తగ్గ కూతురే. చదువులో సరస్వతే గాని ఫ్యాషన్ల రాణి మాత్రం కాదు. అన్ని రకాల ఆధునిక దుస్తులూ వేసుకుంటుంది.. కాని ఎక్కడా అసభ్యత కనబడనివ్వదు. నల్లని, ఒత్తైన నిడుపాటి కురుల్ని చక్కగా జడ వేసుకుని మల్లెలూ, మొల్లలూ, కనకాంబరాలూ పెట్టుకుంటుంది. పండుగలకి చక్కగా పట్టుచీర కట్టుకుని, నగలు పెట్టుకుని రుక్మిణీదేవిలా అమ్మవారి గుడికి వెళుతూ ఉంటుంది.
ఆంధ్రా యూనివర్సిటీ కాలేజీలో సీటు తెచ్చుకుని, ఇంజనీరింగ్ టాప్ ర్యాంక్ లో పాసైన జానకికి ఉద్యోగం కూడా వచ్చేసింది. అందులో జాయిన్ అవకముందే సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఆ ముందు రోజునే పెళ్లి చూపులయాయి. ముహూర్తాలు పెట్టే పండితులు వేరే ఉన్నా, అమ్మాయి భక్తిగా కొలిచే అమ్మవారి గుడి పూజారి గదా అని రామయ్య పంతుల్ని కూడా చూపులకి ఆహ్వానించారు బాపన్న. మొత్తం తతంగం అంతా పూర్తి అయి, రామయ్య పంతులు ఇల్లు చేరే సరికి రాత్రి తొమ్మిదైంది. తెల్లారి ఆయన గుడికి వచ్చిన దగ్గర నుంచీ జనం వస్తూనే ఉన్నారు... బాపన్న గారమ్మాయి పెళ్లి గురించి తలో ప్రశ్నా వేస్తూనే ఉన్నారు. వాళ్లని కాస్త ఆగమని, అమ్మవారి పూజాదికాలు గబగబా కానిచ్చేశాడు పంతులు. తీరిగ్గా మంటపంలోకి వచ్చి కూచుని, "చెప్పుకోవాలే గాని పెద్ద కథర్రా. మహా పసందైన కథ" అన్నాడు.
"చెప్పండి.. చెప్పండి" జనం ఆయన చుట్టూ చతికిలబడ్డారు
"బాపన్నగారు ఎంత పద్ధతి మనిషో మనకి తెలిసిందే కదా. ఆయనకి కాబోయే వియ్యంకుడు మరో నాలుగాకులు ఎక్కువ. పెళ్లి ఏ దసపల్లా లోనూ కాదు. ఇక్కడే.. మనందరి మధ్యనే... "
శ్రోతల ఆశ్చర్యానికి మేర లేదు.
"అవునర్రా... నిన్న బాపన్న గారూ, ఆయన వియ్యంకుడూ మాట్లాడుకున్న మాటలు వింటుంటే నాకు ఒళ్లు గరిపొడిచిందనుకోండి. పెళ్లి వైశాఖ మాసంలో.. ఇక్కడే. తాటాకు పందిరేసి ఇంటి ముంగిట్లోనే. అచ్చంగా ఒకప్పటి పెళ్లిళ్లు ఎలా జరిగేవో అలాగే. ఒక్క స్వీటు ముక్క కూడా బజార్లో కొనరు. పెళ్లికి పదిహేను రోజుల ముందే వియ్యంకుడు గారు రంగాజమ్మ గారి బృందాన్ని ఇక్కడికి పంపిస్తారుట. రంగాజమ్మ గారంటే వంటావిడ. జానకి అత్తవారి ఊళ్లోనే ఆవిడా ఉంటుందిట. రంగాజమ్మ, ఆవిడ తమ్ముడు, కొడుకు, కోడలు, ఇంకా మరో ఇద్దరు కుర్రాళ్లు.. వీళ్లంతా కలిసి ఒక బృందం. మర కత్తిపీటలు, మామూలువి పెద్ద పెద్ద కత్తిపీటలు,పనసకాయ కత్తులు, బూందీ చట్రాలు ఇలాంటి సామగ్రి అంతా వాళ్ల దగ్గర ఉంటుందిట. ఐదారువందల మంది జనానికి అవలీలగా వండి వారుస్తారుట. లడ్డూలు, అరిసెలు, బూరెలు వగైరా వంటలు అద్భుతంగా చేస్తారుట. పనసపొట్టు కూర, కందా బచ్చలి, వాక్కాయ పప్పు, ఆవ పెట్టిన పులిహోర ఇలాంటి పాతకాలం వంటలు వీళ్లు చేసినట్టు ఎవ్వరూ చెయ్యలేరుట.
పెళ్లికి పదేను రోజుల ముందొచ్చి వాళ్లు ఆవకాయ, మాగాయ, తొక్కుపచ్చడి వగైరాలు పెడతారుట. అప్పడాలు, వడియాలు కూడా ఇంట్లోనే తయారు చేస్తారుట. పెళ్లి దగ్గర పడనిచ్చి లడ్డూ, సున్ని, మైసూర్ పాక్, చక్కిలాలు, కారం బూందీ చేస్తారుట. పెళ్లి కార్యక్రమాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఆ రెండ్రోజులూ మన ఊరు ఊరంతటికీ బాపన్న గారింట్లోనే భోజనాలు. "మనిద్దరికీ డబ్బుకి లోటు లేదు. మన అభిరుచి మేరకు ఇలా చేద్దాం" అని వియ్యంకులిద్దరూ మాట్లాడుకున్నారు. "మీక్కావలిస్తే సిటీలో మళ్లీ రిసెప్షన్ ఇద్దాం" అని పెళ్లి కొడుకుతో వాళ్ల నాన్న అంటే ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా... వాళ్ల ఫ్రెండ్స్ కూడా హొటళ్లూ, బిర్యానీలతో విసిగెత్తిపోయి ఉన్నారుట... "వాళ్లకి కూడా ఇవే నచ్చుతాయిలే నాన్నా" అన్నాడు.
అథారిటీ సంగతి"
రామయ్య పంతులు చెప్పడం పూర్తి చేసిన మరుక్షణం నుంచే జనం రంగాజమ్మ బృందం కోసం ఎదురు చూపులు ప్రారంభించారు.
అనుకున్న రోజు రానే వచ్చింది. తెల్లని మల్లుచీర కట్టుకుని, వేలిముడి వేసుకున్న రంగాజమ్మా, పెద్ద కత్తిపీట పుచ్చుకుని అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ ఆవిడ కోడలూ, నామం దిద్దుకుని ఓ భుజం మీద కండువా, ఇంకో భుజం మీద పనసకాయ కత్తీ పట్టుకుని ఆవిడ తమ్ముడూ, మర కత్తిపీటలు పట్టుకుని కుర్రాళ్లూ దిగారు.
బాపన్నగారూ, ఆయన వియ్యంకుడూ ఏర్పాటు చేసిన ప్రకారం అప్పటికే మాడుగుల నుంచి ఆవాలు, బందరు నుంచి మిరపకాయలు, అనకాపల్లి నుంచి బెల్లం దిమ్మలు, సామర్లకోట నుంచి పప్పునూనె, నూజివీడు నుంచి రసాలు, బంగినపల్లి కాయలు ఇంకా ఇతర సామగ్రి వచ్చేశాయి.
"అత్త లేని కోడలుత్తమురాలూ ఓయమ్మా.. "అంటూ ఆవాలు, మిరపకాయలు దంపి, ఆవకాయ పని ముగించారు. ఊరంతా తలా కాస్తా రుచి చూసి "హా" అంటూ లొట్టలేశారు.
రంగాజమ్మ బృందాన్ని చూస్తూనే ప్రేమలో పడిపోయిన ఊరి జనం, వాళ్ల చేతి ఆవకాయ రుచి చూశాక దాసోహం అంటూ తలో పనీ అందుకుని సాయం చెయ్యడం ప్రారంభించారు.
ఆవకాయలతో బాటే కారం అప్పడాలు, పెసర అప్పడాలు రంగాజమ్మా, కోడలూ వత్తి ఇస్తూ ఉంటే మిగిలిన వాళ్లు ఆరబెట్టి, బొత్తులు పెట్టారు. మినపప్పు నానబోసి రుబ్బి గుమ్మడి వడియాలు, పులుసులూ కూరల్లోకి చిట్టొడియాలూ పెట్టారు. సగ్గుబియ్యం ఉడికించి పల్చగా అప్పడాలంతేసి సగ్గుబియ్యం వడియాలు పెట్టారు.
ఆవకాయలు, అప్పడాలు, వడియాల పని అయాక, బాపన్న గారి పెరట్లోనే దగ్గరుండి గాడిపొయ్యి తవ్వించింది రంగాజమ్మ. వేసవి ఎండకి ఎండిన కట్టెల్ని పొయిలో పెట్టి, శుభ ముహూర్తం చూసి ఇంత కర్పూరం వేసి వెలిగించగానే, హోమాగ్నిలా ఝామ్మంటూ మంటలు లేచాయి. గాడిపొయ్యి దగ్గర వంతుల వారీగా పిండివంటలు చేసే పని రంగాజమ్మ, ఆవిడ తమ్ముడిదే. మిగిలిన వాళ్లు పిండి కలపడం, ఉండలు చుట్టడం వగైరా పనులు చేసేవారు.
బాపన్నగారి కోరిక మేరకు పంచదార లడ్డూ, బెల్లం లడ్డూ రెండూ చేశారు రంగాజమ్మ అండ్ పార్టీ. పచ్చకర్పూరం ఘుమఘుమలకు స్వచ్ఛమైన నేతి గుబాళింపు జోడై, లడ్డూ నోట పెట్టిన వారికి స్వర్గం అరడుగు దూరంలో కనిపించింది. నేతి తడితో మెరుస్తూ తయారైన మైసూర్ పాక్ దాని రుచి ముందు మైసూరు రాజ్యం కూడా దిగదుడుపే అనిపించేసింది. బెల్లంతో చేసిన మినపసున్ని, ఒక్కటైనా తినకపోతే జన్మ ఎందుకు అనిపించింది అందరికీ. చక్కిలాల కరకర, బూందీలో జీడిపప్పు మిసమిస జీవితం పసందుగా ఉందనిపించాయి.
ఇలా ముందస్తు ఏర్పాట్లు పూర్తయి, పెళ్లివారు తరలి వచ్చారు. ఊరు ఊరంతా వాళ్లకి స్వాగతం పలికి, తమ ఇళ్లన్నీ విడిదిగృహాలే అనుకోమన్నారు. సింహాచలం నుంచి వచ్చిన మరో నలుగురు పండితులతో బాటు రామయ్య పంతులు కూడా పెళ్లి పౌరోహిత్యం స్వీకరించాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు తలో పనీ అందుకున్నారు. మొదటిరోజు కత్తెర స్నాతకం - తోట సంబరం సంబరంగా ముగిశాయి. తమ ఆడపడుచు పెళ్లి జరుగుతున్నంత ఆనందంగా ఊరి జనం పెళ్లి పనుల్లోనూ, కార్యక్రమాల్లోనూ పాలు పంచుకున్నారు. వాక్కాయ పప్పు, పనసపొట్టు కూర, గుత్తి వంకాయ, గోంగూర పచ్చడి, ముక్కల పులుసు, ఆవడలు, బొబ్బట్లు, పాయసంతో తొలిరోజు విందు జరిగింది.
మర్నాడు పెళ్లికొడుకు శ్రీరామ్ జానకి మెడలో తాళి కట్టిన తరువాత అందరికీ కొబ్బరి బొండాలు కొట్టి ఇచ్చారు. కందా బచ్చలి కూర, అరటికాయ బెల్లం వేసిన కూర, మావిడికాయ పప్పు, కొబ్బరి, మావిడి కలిపి పచ్చడి, పులుసు, ఆవ పెట్టిన పులిహోర, బూరెలు, చక్రపొంగలి, లడ్డూ, బంగినపల్లి మామిడి పండు ముక్కలు, కమ్మని పెరుగు.. వీటితో పెళ్లి భోజనం చేసి ఊరంతా భుక్తాయాసంతో బ్రేవ్ మంటూ త్రేన్చింది.
పెళ్లి జరిగిన మర్నాడు కొత్త కోడల్ని తీసుకుని పెళ్లివారు బయల్దేరారు. ఊళ్లో ముఖ్యమైన వాళ్లు కొందరు కార్ల దగ్గరకి వచ్చి జానకికి వీడ్కోలు పలికారు. మిగిలిన వాళ్లంతా ఇంకా పెళ్లి భోజనపు మత్తు వదలనట్టు ఇళ్లల్లో పడుకున్నారు.
మరో రెండు రోజుల్లో బాపన్న గారి ఇంట్లో అన్నీ సర్ది పెట్టి, మంచిరోజు చూసి గాడిపొయ్యి కూడా మూసి పెట్టి రంగాజమ్మ బృందం తిరుగు ప్రయాణమైంది. వాళ్లు సొంత కష్టంతో కొనుక్కున్న మెటడార్ వ్యాన్ లో కత్తులూ కత్తిపీటలూ అన్నీ సర్దుకోబోయేసరికి ఊరు ఊరంతా అక్కడ హాజరైంది. రంగాజమ్మ బృందాన్ని కూర్చోబెట్టి సామానంతా ఊరిజనమే సర్దారు.
"ఈ మర కత్తిపీటతో ఆయన అంతలేసి మావిడికాయల్ని ఎంత చులాగ్గా టకటకా తరిగేశారో.. మళ్లీ అన్ని ముక్కలూ ఒక్కలాగే వచ్చాయ్"
"దీని పేరే పనసకాయ కత్తి ట. ఆ పెద్దమ్మ గారు దీంతో పనసకాయని ఎంత చిన్న ముక్కలుగా కొట్టారో... అసలు కత్తి కదులుతున్నట్టే అనిపించేది కాదు. పెద్దయ్యగారు నేర్పారంట ఆమెకి అలా తరగడం"
"ఈ చట్రంతో పెద్దమ్మ గారు మిఠాయి బూందీ కొట్టి పెట్టేస్తే కోడలు గారు ఎంత చకచకా ఉండలు కట్టేదో... ఆవిడ చేతులు మంట పెట్టవా అని నేను అనుకునేదాన్ని గానీ ఆవిడ నవ్వుతూనే ఉండేది"
ఊరివాళ్ల మాటలు వింటూ ఆనందంతో కంటనీరు పెట్టుకున్నారు రంగాజమ్మ బృందం.
బాపన్నగారు కూడా వాళ్లకి వీడ్కోలు పలుకుతూ, "ఒకప్పటి పాక వైభవాన్ని మళ్లీ మా కళ్లకూ నోటికీ చూపించారమ్మా. మిమ్మల్ని పంపినందుకు మా వియ్యంకుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను. మీకు మా అందరి తరఫునా ధన్యవాదాలు" అంటూ చేతులు జోడించారు.
రంగాజమ్మ బృందం ఆనందబాష్పాలతో తిరిగి నమస్కారాలు చేస్తూ సాగిపోయింది.
******************
లక్ష్మీ గాయత్రి
విశాఖపట్నం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి