1, ఏప్రిల్ 2021, గురువారం

వయసుకు తగ్గ వ్యాపకం..*

 *వయసుకు తగ్గ వ్యాపకం..*


"ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పల్లకీసేవ నిర్వహించబడును..పల్లకీసేవ లో పాల్గొనదలచిన భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవలసినదిగా కోరుతున్నాము.." అంటూ మా సిబ్బంది ఆ శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయం లో మైక్ లో చెపుతున్నారు..ఆ ప్రకటన విన్న కొంతమంది తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు.."ఏమండీ..ఇప్పుడే మైక్ లో పల్లకీసేవ గురించి చెపుతున్నారు..పల్లకీసేవ లో పాల్గొనలేని వాళ్లకు ఇబ్బందేమీ లేదు కదా?.." అని ఆ పెద్దాయన నన్ను అడిగారు.."అదేమీ లేదండీ..పల్లకీసేవ లో అర్చన చేయించుకొని..కొద్దిదూరం ఆ పల్లకీని భుజాన మోసుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే తమకు మంచి జరుగుతుందని ఒక ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ప్రజల్లో పాతుకుపోయింది..మీరు వయసులో పెద్దవారు కనుక..ఒక పని చేయండి..శ్రీ స్వామివారి పల్లకీ మందిరం చుట్టూరా మూడు ప్రదక్షిణాలు పూర్తిచేసుకున్న తరువాత..ఆ ప్రధాన ద్వారం వద్ద పల్లకీని పైకెత్తి పట్టుకుంటారు..మీరు ఆ పల్లకీ క్రింద వైపు నుండి నడచి రండి..అంటే పల్లకీ లో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తి పాదాల క్రింద మీ శిరస్సు ఆనించి నట్టుగా వుంటుంది..అలా చేస్తే కూడా స్వామివారి అనుగ్రహం ఉంటుందని మరో విశ్వాసం..దాదాపుగా అందరూ ఆ పల్లకీ క్రింద నుంచి నడచి వస్తారు.." అని చెప్పాను.."ఆ పని చేస్తాను నాయనా..మంచి సలహా ఇచ్చావు.." అని చెప్పి వెళ్లారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాతసేవ పూర్తి అయిన తరువాత..భక్తులందరూ స్వామివారి సమాధి దర్శనం కొఱకు గర్భాలయపు మంటపం లో వేచి వున్నారు..ఆ సమయం లో ముందురోజు పల్లకీసేవ గురించి మాట్లాడిన పెద్దాయన నా దగ్గరకు వచ్చారు.."బాబూ..స్వామివారి సమాధి ని దర్శించుకోవాలి..టికెట్ కూడా కొనుక్కున్నాను.." అన్నారు.."లోపల భక్తులు వేచి వున్నారు..మీ వంతు వచ్చేసరికి మరో గంట పడుతుంది..ఒక ప్రక్కగా కూర్చోండి.." అని చెప్పాను..ఆయన ముఖం లో నిరాశ కనబడుతోంది..మరో గంట తరువాత ఆ పెద్దాయన స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చారు..స్వామివారి ఉత్సవమూర్తి వద్ద తన అర్చన చేయించుకున్నారు..మళ్లీ తిరిగి నా వద్దకు వచ్చారు.."మీతో మాట్లాడాలి..ఎప్పుడు వీలవుతుంది?.." అని అడిగారు.."మరో గంట లోపల ఈ హడావుడి తగ్గిపోతుంది..మనం అప్పుడు మాట్లాడుకుందాము.." అని చెప్పాను.."అలాగే.." అని వెళ్ళిపోయి స్వామివారి ఎదురుగా ఉన్న మంటపం లో కూర్చున్నారు..స్వామివారి సమాధి దర్శనం తరువాత..ఆయన ముఖం లో ఇంతకుమునుపు ఉన్న నైరాశ్యం లేదు..ఏదో ఆనందం కనబడింది..


సరిగ్గా గంట తరువాత..నా వద్ద ఎవ్వరూ లేరని నిశ్చయం చేసుకున్నాక..ఆ పెద్దాయన వచ్చి నా ప్రక్కన కూర్చున్నారు.."మీతో మాట్లాడాలని చెప్పాను కదండీ.." అన్నారు.."ఇప్పుడు చెప్పండి.." అన్నాను.."నా పేరు వాసుదేవరావు..ఇప్పుడు నా వయసు డెబ్భై ఐదేళ్లు..నాకు ఒక్కటే కూతురు..అల్లుడు కూతురు అమెరికా లో వున్నారు..నా భార్య చనిపోయి రెండేళ్లు అవుతోంది..దాదాపుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను..అమ్మాయి తన వద్దకు వచ్చి వుండమని చెపుతున్నది..వెళ్లలేక పోతున్నాను..ఏదో అశాంతి ఆవరించి ఉంది..ఇంటిలో ఒక్కడినే ఉండలేను..అందువల్ల ప్రతి నెలలో ఓ పదిరోజులు ఏదో ఒక క్షేత్రానికి వెళ్లి రావడం అలవాటు చేసుకున్నాను..ఈసారి గొలగమూడి లోని శ్రీ వెంకయ్య స్వామి వారి వద్దకు వచ్చాను..అక్కడ రెండురోజులు వున్నాను..అక్కడా పల్లకీసేవ చేస్తారు..అక్కడ ఈ క్షేత్రం గురించి విని..ఇక్కడికి వచ్చాను..నిన్నరాత్రి మీరు చెప్పిన తరువాత..స్వామివారి పల్లకీ క్రింద నుంచి నమస్కారం చేసుకుంటూ నడచి వచ్చాను..ఒక్కసారిగా నా వళ్ళంతా తేలిక పడినట్లు అనిపించింది..అదే అనుభూతి ఈరోజు స్వామివారి సమాధి వద్ద కూడా పొందాను..నాలోని ఒంటరి తనపు భావన మాయం అయింది..ఇందాక ఆ మంటపం లో కూర్చున్న తరువాత..నాకొక ఆలోచన వచ్చింది..నాకు దేవుడు ఆయుష్షు ఎంతకాలం ఇచ్చాడో తెలీదు..ఇక మిగిలిన ఈ శేషజీవితాన్ని..ఒకరికి సేవ చేసుకుంటూ గడపాలి..అని అనిపించింది..ఆ ఆలోచన కూడా ఈ స్వామివారి సన్నిధి లోనే నాకు వచ్చింది..ప్రతినెలా ఒక నియమం పెట్టుకొని..ఒక్కొక్క క్షేత్రం లో ఏదో ఒక సేవలో పాల్గొంటాను..నాకు భుక్తికి కొరవ లేదు..ఇంకొకళ్లకు పెట్టగలిగే స్థాయి ఉన్నది..నా చేతనైన సేవ నేను చేయాలి అని నిశ్చయించుకున్నాను..అదికూడా ఈ స్వామివారి సన్నిధి నుంచే మొదలుపెడతాను..ఒక వారం పాటు నేను ఇక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వండి..నాకంటూ ప్రత్యేకంగా ఏ వసతీ వద్దు.." అన్నారు.."వయసులో పెద్దవారు..మీరు సేవ చేయడానికి సిద్ధంగా వున్నా..మీ చేత సేవ చేయించడానికి మాకు మనసు రాదు కదా..ఒక పని చేయండి..మీరు ఇక్కడ ఉన్న రోజుల్లో..రోజూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో భక్తులకు పదార్ధాలు వడ్డన చేయండి.." అన్నాను.."అలాగే బాబూ..ధన్యవాదాలు.." అని చెప్పారు..


వాసుదేవరావు గారు మరో వారం పాటు మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద వున్నారు..వారికి ఒక గదిని కేటాయించాము..ఆ వారం రోజులూ ఆయన చాలా ఉత్సాహంతో వున్నారు..తన ఒంటరి తనాన్ని మరిచిపోయారు..ఆ తరువాత తన ఊరికి వెళ్లారు..ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వాసుదేవరావు గారు మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి.."ఒంటరితనం తో ఉన్న నాకు మార్గదర్శనం చేసిన స్వామివారి కి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీస బాధ్యత.." అంటూ వుంటారు..రెండు వారాల క్రితం వాసుదేవరావు గారు స్వామివారి దర్శనానికి వచ్చి.."స్వామివారి వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఒక గది నిర్మిస్తాననీ..అందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తాననీ " చెప్పారు..


"మీకు ఒక విషయం చెప్పమంటారా..? నేను ఒంటరివాడిని అనే ఆలోచనే ఇప్పుడు రావడం లేదండీ..నేను వెళ్లిన ప్రతి క్షేత్రం లోనూ అక్కడి సిబ్బంది నన్ను తమలో ఒకడిగా చూసుకుంటూ..ఆప్యాయంగా పలకరించుకుంటారు..ఓపిక ఉన్నన్ని రోజులూ ఇలా సేవ చేసుకుంటాను..ఆపై ఈ దత్తుడి దయ.." అని నవ్వుతూ చెప్పారు..


ఎవరికి ఏ సమయం లో ఏ మార్గం చూపాలో స్వామివారికి స్పష్టంగా తెలుసు..వాసుదేవరావు గారికి తగిన వ్యాపకాన్ని నిర్దేశించి చూపారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: