26, మే 2021, బుధవారం

నాట్యమొచ్చేస్తుందా

 కాల్లు చేతులు కదిలిస్తేచాలు నాట్యమొచ్చేస్తుందా ?

--------------------


64 కళలలో నాట్యం ప్రధానమైంది. హిందూదేశంలో నర్తనకళ చాలా ప్రాచీనమైంది, ఇది ఎంతో ఆదరణ పొందింది. నాట్యానికి అంగలక్షణం అనగా శరీరసౌష్టం ముఖ్యమైంది.

అంగలక్షణమంటే తల, ముఖం, వక్షస్థలం, కుక్షి (ఉదరం), కటి (నడుము), తొడ,మోకాలు, కాలు, పాదం (అరికాలు ) అనే పది శరీరభాగాలతో చేరి వుంటుంది.


అభినయమంటే శరీరభాగాలను కదల్చి హావభావాలను ప్రకటింపచేయడం. అభినయం ద్వారా అన్ని రకాల భావాలను ప్రకటింప చేసినప్పటికి వాచకం (గాత్రం) తోడైతే బంగారానికి సువాసనలు అద్దినట్లుగా వుంటుంది. వాచకానికి సాహిత్యం అవసరం. అభినయవాచకాల ద్వారా  విషయాన్ని ఖచ్చితంగా  ప్రకటించవచ్చును.


అంగలక్షణాన్ని నాట్యశాస్త్రకారులు నాలుగు భాగాలుగా విభజించారు. అవి 

(1) మహాంగం, ఇందులో ముఖం, ఛాతీ (యెద)నాభి, కటి అనే శరీరభాగాలతో అభినయం వుంటుంది.


( 2 ) కాళ్ళు చేతులు అంగాలుగా చెప్పారు.


(3) నఖ (గోర్లు), శిఖ (శిరం), దంతాలు అనేవి ఉపాంగాలు.


(4) ఆయుధం, వస్త్రం, ఆభరణాలు, వాద్యపరికరాలను ప్రత్యంగాలుగా చెప్పారు.


నాట్యంలో అభినయం ముఖ్యం. అభినయం కూడా నాలుగురకాలు, అవి.

(1) తల, కంఠం, కాలు, చేయి, ఇతర శరీరభాగాలను ఆడిస్తూ చేసేదాన్ని అంగికాభినయం అంటారు.(2) నోటితో పాడుతూ నాట్యం చేస్తే దానిని వాచికాభినయం అంటారు 

(3)  ఏ పాత్రకు అనుగుణంగా నాట్యం చేస్తారో ఆ పాత్రకు అనుగుణంగా వస్త్రాలు, ఆభరణాలు, ఆయుధాలు, సంగీతపరికరాలు ధరిస్తే దానిని ఆహార్యాభినయం అంటారు.ఉదా॥ సత్యభామ, శ్రీకృష్ణ, శివ, నటరాజు, గొల్లభామలకు వేరువేరుగా వస్త్రాభరణాలుంటాయి.

(4) కేవలం ముఖకవళికల ద్వారా హావభావాలను ప్రదర్శిస్తే దానిని సాత్వికాభినయం అంటారు.


నాట్యశాస్త్రంలో చేతులు ప్రముఖమైనవి.చేతివేళ్ళను చాపుట, ముడుచుట, వంచుట, విరుచుట, రకరకాలుగా కదల్చుట అనే ఐదు విన్యాసాలతో సందర్భోచితంగా పలు భావాలను ప్రకటించవచ్చు.


చేతులతో చేసే అభినయాన్నే ముద్రలు అంటారు. వీటినే హస్తముద్రలు లేదా సంజ్ఞా హస్తాలంటారు. ఇవి ఒక చేస్తో చేసేవి, రెండుచేతులతో చేసేవిగా వుంటాయి. అభయహస్తం ఒక చేస్తో చేయటానికి,అంజలి రెండు చేతులతో చేయటానికి ఉదాహరణలు.  ఒకచేత్తో చేసినా రెండుచేతులతో చేసినా దానిని ముద్ర అంటారు.


ఏకహస్త ముద్రలు  24 రకాలుగావున్నాయి. అవి


 (1) అభయహస్తం (2) వరదహస్తం (3) కటకహస్తం (4) సింహకర్ణహస్తం (5) వ్యాఖ్యానహస్తం (6) సూచీహస్తం (7) తర్జనీహస్తం (8) కర్తరీముఖహస్తం (9) అలపద్మహస్తం (10) విస్మయహస్తం.


 (11) పల్లవహస్తం (12) నిద్రాహస్తం (13) అర్థచంద్రాహస్తం (14) అర్థపతక హస్తం (15) త్రిశూలహస్తం (16) ముష్టిహస్తం (17) శిఖరహస్తం (18) భూస్వర్శహస్తం (19) కటిహస్తం (20) ఊరుహస్తం (21) ఆలింగనహస్తం (22) ధనుర్ హస్తం (23) ఢమరుహస్తం (24) తాడనహస్తం.


ఇక రెండు చేతులతో చేసేముద్రలు (1) అంజలి (2) ధ్యానం(3) పుష్పపుటం (4) ధర్మచక్రం.


ఇవేకాకుండా నాలుగు అలంకారముద్రలు కూడా వున్నాయి.అవి


(1) గజహస్తం లేదా కరిహస్తం. చేతిని నేరుగా చాపి మణికట్టు వద్ద వంచితే అది గజహస్తం. నటరాజవిగ్రహాలలో కరిహస్తాన్ని చూడవచ్చు.

(2) దండహస్తమంటే ఆసన (కూర్చున్న) భంగిమలో ఒక కాలును మడచి పీఠముమీద వుంచి మోకాలుపై మణికట్టును వుంచాలి. అయ్యప్పస్వామి విగ్రహం ఇందుకు ఉదాహరణ.

(3) డోలహస్తం. చెట్టుకొమ్మలోని రెండు రెమ్మలు కిందికి వేలాడురూపం. స్త్రీ ప్రతిమలలో చూడవచ్చును.

(4) ప్రసారితహస్తం. శయనరూపంలోవున్న విష్ణుప్రతిమలో, నృత్యగణపతి మొదలైన విగ్రహాలలో చేతిని పొడవుగా చాచి వేళ్ళను కిందికి (పల్లవముద్రలా) వదిలాలి.


నాట్యభంగిమలు ఈ నాటికి బ్రతికిబట్టకట్టాయంటే అందుకు శిల్పకళాశాస్త్రప్రకారం మనవారు నిర్మించిన హిందూదేవాలయాలే తార్కాణం.బేలూరు, హళేబీడు, మధుర, హంపి, తాడిపత్రి ఇలా చెప్పుకొంటూ పోతే నాట్యభంగిమలు లేని దేవాలయమే లేదంటే అతిశయోక్తే. ---------------------జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: