26, మే 2021, బుధవారం

కంచి పరమాచార్యస్వామివారి జయంతి*

 * కంచి పరమాచార్యస్వామివారి జయంతి* 


*శ్రీ కామకోటి పీఠ ప్రభవః*

*శ్రీ చంద్రశేఖర యతీంద్రాః*

*సర్వమత భక్త వందిత చరణాబ్జాః*

*జ్ఞానదాశ్చ విజయతే*


*జయ జయ శంకర హర హర శంకర* 


*ఈరోజు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహా స్వామివారి జయంతి సందర్భంగా సంక్షిప్తంగా వారి చరిత్ర తెలుసుకుందాం*.. 


 

కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపరలో 68 వ పీఠాధిపతులు స్వామివారు. 


వారు పరమాచార్య, మహాస్వామి. మహా పెరియవ, మున్నగు పేర్లతో కూడా పిలవబడతారు.


ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటారు స్వామి.


స్వామి సంకల్పబలంతో ఇది ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరాల్సిందే. 


ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటారు స్వామి.


*జీవిత విశేషాలు* !


కంచి మహాస్వామిగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు1894 వ సంవత్సరములో దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురం గ్రామమునందు ఒక స్మార్త హొయసల కర్నాటక బ్రాహ్మణ కుటుంబములో మే 20,న అనూరాధ నక్షత్రములో (చాంద్రమానానుసారము) జన్మించారు.


వీరి తల్లిదండ్రులు శ్రీమతి మహాలక్ష్మీ ,శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు. వారికి చిన్నతనములో పెట్టబడిన పేరు స్వామినాథన్. 


జిల్లా విద్యాధికారిగా పని చేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి వారు రెండవ అబ్బాయి. వారి ఇలవేల్పు, కుంబకోణము దగ్గర్లోనున్న స్వామిమలై ఆలయము ప్రధాన దేవత ఐన స్వామినాథుని పేరు మీదుగా బాలుడికి స్వామినాథన్ అని నామకరణము చేసారు.


స్వామినాథన్ దిండివనములో తన తండ్రి పని చేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు. వారు చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని పలు పాఠ్యాంశాలలో రాణించారు. 

వారికి 1905లో ఉపనయనము జరిగినది. 


13వ ఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్టించారు. 


చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం పీఠాధిపతులే కారు.


వారిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్రపరిశోధ కుడు, జ్యోతిశ్శాస్త్రవేత్తను, ఆధ్యాత్మిక తరంగాన్ని ఇలా ఒకటేమిటి ఎందరినో దర్శించవచ్చు. 


ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభాసామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితం,


అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదాలు సలిపి, అనేక దివ్యశక్తులు ప్రదర్శిస్తూ, సనాతన ధర్మపునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు స్వామి. ఈయన 'నడిచే దేవుడి' గా ప్రసిద్ధికెక్కారు.


విశేషాలు !


చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఒకసారి తమిళ నాడులోని చిదంబరంసమీపంలోని 'ఆనంద తాండవ పురం'లో ఒక మూగబాలుడికి మాటలు రప్పించారు.


స్వామి మతాతీతుడు. 1926లో కారం బుక్కుడి నుండి పుదుక్కోటకు వెళ్ళే దారిలో గుంపుగా ప్రజలు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. వారిలో మహమ్మదీయులూ వున్నారు. అలా ఓ మహమ్మ దీయుడు స్వామి పల్లకీ మోసాడు. స్వామి అతన్ని పిలిచి క్షేమం అడిగాడు. ఆ భక్తుడు 'ఆచార్యుల వారి రూపంలో నా కళ్ళకు 'అల్లా' కనిపించాడన్నాడు. మహాపురుషులు మతాతీతులు కదా !


భారత రాజ్యాంగం మతాన్ని 'ప్రాథమిక హక్కు'గా గుర్తించడానికి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారే కారణమని ఈ దేశంలో చాలా మందికి తెలియదు. వారు సన్యాసదీక్ష తీసుకొని మఠాధిపత్యం వహించడం వల్ల దేశ రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. 


కాని భారతస్వాతంత్య్రాన్ని వారు మనస్ఫూర్తిగా కాంక్షించారు. ఉద్యమాన్ని సమర్థించారు. గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపు ఇచ్చిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్ధరునే ధరించారు.


 'భారతరాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఇది ఎంత మాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు' అని స్వామి తన భక్తులను హెచ్చరించాడు.మతాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తింపజేయుటకు కృషి చేశారు.


*కంచి పీఠాధిపతులుగా* !


 ఫిబ్రవరి 13, 1907 వ సంవత్సరము లో స్వామి కంచి పీఠానికి 68 వ పీఠాధిపతిగా నియమించబడ్డారు. వేదరక్షణకోసం ఎన్నో వేదపాఠశాలలు నెలకొల్పారు, 


సంస్కృతి రక్షణ మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వున్నారు. భారతదేశము అంతా పాదయాత్ర చేశారు. స్వామి వారి ఉపన్యాసములు చాలా ప్రసిధ్ది పొందాయి.


మహాస్వామి వారు 1994 జనవరి 8 న శనివారం రోజు బ్రహ్మీభూతులయ్యారు. వారి శత సంవత్సరం పూర్తి కావడానికి కేవలం నాలుగు నెలలు ముందే వారు విదేహముక్తులయ్యారు. 


కంచి మఠం 68వ పీఠాధిపత్యం అనుకోకుండా ఆనాడు మధ్యాహ్నం 2:58ని పరిసమాప్తమయ్యింది.


హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పేద - ధనిక, ఉన్నత వర్గం – నిమ్న వర్గం అనే తేడా లేకుండా మొత్తం భారతదేశం వారికి నివాళులు అర్పించడానికి తరలి వచ్చింది. 


అప్పటి ప్రధానమంత్రి పి.వి నరసింహారావు గారు తమ కార్యక్రమాలన్ని రద్దు చేసుకుని తమిళనాడుకు పయనమయ్యారు.


సంవత్సరం ఆరంభంలో స్వామి వారికి కఫం తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలకు స్వామి వారి దర్శనం ఆపేసారు. కానీ వారు కొద్దికాలంలోనే తేరుకుని మళ్ళీ ప్రజలతో మమేకమయ్యారు. 


ఆరోజు మహాస్వామి వారు ఉదయాన్నే 100 మంది భక్తులు పఠించిన విష్ణుసహస్రం విన్నారు. 


సేవకుని చేత వారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని తెప్పించి ఈ జన్మను ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపి, 


మళ్ళీ పుట్టనవసరం లేని స్థితిని కల్పించిన గురువుల బృందావనములు ఉన్న కలవై వంక తిరిగి నమస్కరించి, యోగమార్గం ద్వారా బ్రహ్మరంధ్రము నుండి ప్రాణముల ఉద్గమింపజేసి కొన్ని కోట్ల మందిని ఎన్నో విధాలుగా ఉద్ధరించి సాక్షాత్ ‘నడిచే దైవం’గా ప్రస్తుతింపబడిన మహాస్వామి వారు తాము ఈ భూమికి వచ్చిన కార్యాన్ని ముగించుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్యాన్ని పొందారు.


స్వామి వారి దేహాన్ని రాత్రి 7:05 నిముషాలకు ప్రజల సందర్శనార్థమై వెలుపలికి తెచ్చి, వారు ఎప్పుడూ కూర్చుని భక్తులను ఆశీర్వదించే అరుగుపై ఉంచారు. సశరీరులుగా స్వామిని దర్శించిన చోటులోనే స్వామి వారిని చివరిగా చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. 


మొత్తం కంచి వీధులన్ని వేలమంది జనంతో నిండిపోయాయి. స్వామివారు జాత్యాతీతులు. వారిని దర్శించుకోవడానికి ఎందరో మహమ్మదీయులు, క్రైస్తవ సన్యాసినులు మూడు మైళ్ళ పొడవైన వరుసలను సైతం లెక్కచేయకుండా వచ్చారు. 


వందల మంది ఆస్థాన విద్వాంసులు, గాయకులు స్వామి వారికి ఇష్టమైన పాటలను పాడారు. తరువాత వారికి పుష్పాలతో పాటు బంగారు పుష్పాలతో కూడా అర్చన జరిగింది. ఏకహారతి, పంచహరతి, నక్షత్రహారతి వంటి నానా రకములైన మంగళహారతులను ఇచ్చి, చివరిగా కర్పూర హారతితో స్వామి వారికి చివరి పూజను పూర్తి చేశారు.


ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి, సన్యాసాశ్రమ ధర్మాలను తు.చ. తప్పక పాటించిన అపర శంకరావతారులు ఎన్నో దేవాలయాలను వేద పాఠశాలలను నెలకొల్పిన ధర్మస్వరూపులు. కొన్ని దశాబ్ధాలుగా పేలాలు, పళ్ళు, పాలు ఒక్కపూట మాత్రమే తీసుకుంటూ సన్యాసాశ్రమ ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం పాదాచారియై ఆసేతుహిమాచలం నడిచారు. 


*మహాస్వామి వారు మన ప్రశంసలకు అతీతులు కేవలం మనం వారి సమకాలీనులు అని చెప్పుకోవడమే గర్వకారణం*

🙏🌹🙏💐🙏🌸

కామెంట్‌లు లేవు: