_*ముందు వైపు విష్ణుమూర్తి-వెనుక వైపు జగన్మోహిని....*_
ఈ అరుదైన యాత్రాస్థలం 'ర్యాలీ 'మన రాష్ట్రంలో గోదావరి గట్టున ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది.
ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఇది ఏకశిలా విగ్రహం. ఇటువంటి శిలను సాలగ్రామ శిల అంటారు. ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని. ఇటువంటి విచిత్రమైన దేవాలయం మరెక్కడా లేదేమో?
నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇందులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది నిజమైన నిదర్శనం. కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి.
అదేవిధంగా 'శిఖ' జుట్టు వెంట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్పమా, నిజంగా జుట్టు ఉందా? అనిపించేలా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే,!.
ఈ విగ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది.అది 'విష్ణు పాదోధ్బవియైన గంగ' అనే ఆధ్యాత్మిక నమ్మకం.
ఆమాట పక్కన పెడితే,, శిలల్లో 'జలశిల' అనే దాన్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం.
గుడిప్రాంగణమంతా దశావతారాలకి సంబంధించిన శిల్పాలు కొలువై ఉన్నాయి.
చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, 11 వ శతాబ్దం లో ఈ ఆలయాన్ని నిర్మించాడు.
గోదావరి జిల్లా ప్రాంతంలో(రాలి-అంటేపడిపోవటం.అదేమార్పుచెంది 'ర్యాలి' గామారింది. '. ఈ ప్రాంతాన్ని పూర్వం 'రత్నపురి' అని పిలిచేవారు. భాగవత కధ ప్రకారం... దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధర గిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులోంచి చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం... ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్టచివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యాడు.
దేవదానవులిరువురూ దాని కోసం పోటీ పడుతుండగా, విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి ముందుకు నడుస్తుండగా, వెనుకనుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యిపట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనుకకు తిరిగాడు.
ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది. ఆ కారణంగా ఆప్రాంతానికి 'ర్యాలి' అని పేరు వచ్చిందని స్థలపురాణం.
విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపోయాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదురుగా ఉంటాయని స్థానికులు చెప్తారు.
అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.
తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తుంది. విష్ణుమూర్తి జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి