*🌹🌹 నేడు శ్రీ కూర్మ జయంతి 🌹🌹*
*శ్రీ కూర్మ జయంతి నాడు "శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి!*
*దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవ , దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా , వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు*.
*అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది*.
*శ్రీకాకుళం జిల్లాలోని గారమండలం లో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు , హఠకేశ్వరుడు , సుందేశ్వరుడు , కోటేశ్వరుడు , పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందనీ , కళింగ రాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది*.
*కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు , అతని భార్య వంశధారల తపస్సుకు , భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ , బ్రహ్మాండ , పద్మ పురాణాలలో వుంది*.
*శ్రీరాముడు , బలరాముడు , జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.*
*ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట*.
*దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం*.
*శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ , అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు*.
*ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు*.
*ఇక శ్రీ కూర్మ జయంతి రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడుతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం , కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు*.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి