వాల్మీకి కవిత్వం అంటే...
సుకుమారీం సుజాతాంగీం
రత్న గర్భ గృహోచితాం.
సుందరాకాండ 19 వ సర్గ 18 వ శ్లోకం మొదటి 2 పాదాలు.
హనుమంతుడు సీతను చూచి ఆవిడ సీత అని గుర్తు పట్టే సదర్భం.
ఇందులో మొదటి పాదం అర్థం చేసు కోవడం లో పెద్ద ఇబ్బంది లేదు. ఆమె లావణ్యం సౌకుమార్యం చూసి గొప్ప వారి ఇంట్లో పుట్టిందని నిర్ణయిస్తాడు.
ఇక రెండో పాదం వాల్మీకి శ్లేష కవిత్వం.
రత్న గర్భ గృహోచితాం. :-
ఇది మొత్తం ఒకటే సమాసం.
ఈ సమాసం పూర్తి గా తెలియాలంటే క్రింది పదాలకు నానార్థాలు తెలియాలి.
1. రత్న గర్భ:- పుంలింగం లో సముద్రుడు. స్త్రీ లింగంలో భూమి.
2. గృహం :- ఇల్లు / భార్య.
ఈ సమాసానికి వచ్చే అర్థాలు:
A. సముద్రుడి ఇంట్లో వుండదగినది. (సముద్రుడి కూతురు)
B.భూదేవి ఇంట్లో వుండదగినది (భూదేవికూతురు).
C. సముద్రం ఇల్లుగా కలవాడు విష్ణువు. అతనికి ఉచితా అతనికి భార్యగా తగినది.
D. భూదేవిని భార్యగా కలవాడు విష్ణువు. అతనికి ఉచితా అతనికి భార్యగా తగినది.
సుందరాకాండ 15 వ సర్గ 33 & 34 శ్లోకాలు. ఈ రెండు శ్లోకాలలో వాడిన ఉపమానాలు అన్నీ "యా దేవీ సర్వ భూతేషు ... రూపేణ సంస్థితా" అని చెప్పిన పరదేవతా నామాలు.
ఆంజనేయుడు ఆమెను కేవలం సీతా దేవి అని మాత్రమే చూడలేదు. ఆమె పరతత్వా న్ని కూడా నిర్ణయించాడు.
సుందరాకాండ 15 వ సర్గ శ్లోకం: 51.
అస్యా దేవ్యా యధా రూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం
రామస్య చ యధా రూపం తస్యేయ మసితేక్షణా.
ఈ శ్లోకం లో నానార్ధాలు లేవు. కానీ
తాత్విక మైన రహస్యం ఉంది.
దేవతా జంటలలో పంచ సమ్యాలు ఉంటాయి. రూప సామ్యము అధిష్టాన సామ్యము మంత్ర సామ్యము మొదలైనవి. వీటి గురించి ఆది శంకరుల అర్ధ నారీశ్వర స్తోత్రం వ్యాఖ్యానం లో చూడవచ్చు. ఈ శ్లోకం లో సీతా రాముల రూప సామ్యం గురించి వాల్మీకి వ్రాశాడు.
సంస్కారము అర్హతా ఉన్న జ్ఞానులకు ఈ సామ్యం కనపడుతుంది. అంటే అంత జ్ఞానం ఉన్న వాళ్ల కు ఈ జంటలో ఒకరిని చూస్తే రెండో వాళ్ళు గుర్తు వస్తారన్న మాట!!..
సంస్కారము అర్హతా ఉన్న జ్ఞానులకు ఈ సామ్యం కనపడుతుంది. అంటే అంత జ్ఞానం ఉన్న వాళ్ల కు ఈ జంటలో ఒకరిని చూస్తే రెండో వాళ్ళు గుర్తు వస్తారన్న మాట.
ఈ శ్లోకం లో ఉన్న భావం నచ్చి వేద వ్యాస మహర్షి భాగవతం లో రుక్మిణీ కళ్యాణ ఘట్టం లో చిన్న వ్యాఖ్యానం లాంటి వర్ణన చేశాడు. దశమ స్కంధం 53 అధ్యాయం 37 & 38 శ్లోకాలు. పోతన గారు దానికి "తగు నీ చక్రికి" పద్యం వ్రాశారు. అందులో విశేషం ఆ సమయానికి రుక్మిణీ కి కృష్ణునికి పెళ్ళవుతుందని ఎవరికీ తెలీదు. పైగా శిశుపాలుడు తో పెళ్ళి కి అన్నీ ఏర్పాట్లు జరుగు తుంటాయి.... కుండిని నగర వాసులు కృష్ణుడిని చూడగానే రుక్మిణీ పెళ్ళి కృష్ణుడి తో నే జరగాలని కొరుకున్నారట. ... కుండిని నగర వాసులు మరీ జ్ఞానులు.
త్రిజటా స్వప్నం లో గాయత్రీ మంత్ర పూర్ణ రూపం 32 అక్షరాలది సూచన గా ఉంది. అది సన్యాసులు జపించేది. మనం చేసే సంధ్యా వందనం లో ఆఖరి పాదం 8 అక్షరాలు ఉండవు.
సుందరాకాండ లో ఈవిధ మైన కవితా చమత్కారాలు బోలేడున్నాయి.
మిగతా కాండల లో కూడా వున్నాయి.
సుమిత్ర వనవాసానికి వెళ్ళే ముందు లక్ష్మణుడికి చెప్పే మాట " రామం దశరథ విద్ది" అద్భుతమైన శ్లోకం. కొన్ని సుందరాకాండ శ్లోకాల లాగా దీన్ని కూడా మంత్రం గా వాడతారు. దాన్ని గురించి ఒక వ్యాసం వ్రాయ వచ్చు.
లోకోత్తర శ్లేష లూ వర్ణన లూ వేదాంత, మంత్ర శాస్త్ర రహస్యాలు జీవితా నికి పనికివచ్చే మంచి మాట లూ అన్నీ రామాయణం లో ఉన్నాయి. అవి అన్నీ కనిపెట్టడానికి ఒక జీవితం చాలదు!!
*పవని నాగ ప్రదీప్*
*98480 54843*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి