19, మే 2021, బుధవారం

కంటేనే అమ్మ అని అంటే ఎలా:-

           🌷🌷🌷

కంటేనే అమ్మ అని అంటే ఎలా:-( విషయానికి రాసిన కథ)


" బాబ్జీగోరిని పొలాలంబడి యెల్తుంటే కోడెతాచు కరిసిందంట. మనూరి నుండి మంత్రాల మల్లయ్యకోసం వొచ్చారు ఆళ్ళ బామ్మరుదుల మడుసులు! పేణాలుంటాయో పోతాయో తెల్దంట."


" యేటి రంగమ్మా నువ్వుచెప్తున్నావు? నిన్నేకదా నన్ను పెద్దాసుపత్రిలో చూపించి ఆయనెళ్ళారు. వారం పోయాకా వస్తానన్నారు. నిజవేనా నువ్వు చెప్పేది! దేవుడా ఏటీ ఘోరం".....నూకరత్నం బిగ్గరగా తలబాదుకుంటూ ఏడవసాగింది. 


" రత్నంగోరూ! మనకి ఒద్దే టయాం లేదు. నడండి. ఇంట్లో డబ్బూ, నగలూ గట్రా ఏటుంటే అది మూటకట్టండమ్మా! మందులూ, నూలుసీరలూ పెట్టుకోండి. మనం బయలెల్లిపోవాలి. ఏటయానికయినా సరోజినీగోరు మడులుల్ని పంపచ్చు. లెగండమ్మా! లెగండి! "


" ఆయన లేని బతుకు నాకూ వద్దు. ఆళ్ళు చంపేత్తే ఆనందంగా చచ్చిపోతా! నువ్వెళ్ళిపో రంగా" 


" ఊరుకోమ్మా తల్లే! ఈ యేళో రేపో పెసవించడానికి రెడీగున్నవు! నువ్వనాలిసిన మాటలేనా! లెగు లెగు! గట్టవతల మా యక్క మంత్రసాని. దానింటికి పోదాము. బిడ్డపుట్టాకా ఆలోసిద్దాం ఏం చేద్దారో! ఇదిగో ఈ తురకోల్ల బురకాలు తెచ్చేను. బేగా సద్దమ్మా" 


ఆ మిట్టమధ్యాహ్నం గుట్టమీద దర్గా దగ్గర .... నెత్తిన మూటలు దించుకుని ...వేపచెట్టుకింద కూచుని సేదతీరుతున్న ఆ ఆడోళ్ళిద్దరూ .... దూరంగా పొలాల్లోంచి పైకి లేస్తున్న మంటలూ, పొగనూ చూస్తూ నిలువునా వణికిపోయారు! 


                      *****^******


" సరోజినమ్మా! సరోజినమ్మా! " ..... బయటితలుపు దబాదబా బాదుతోంది చాకలమ్మ! 

తలుపు తీసిన పాలేరుతో.... " బావూ! గొల్లపూడి నుండి వచ్చా! అమ్మగారికి సొమ్ములప్పగించడానికొచ్చా! " .... ఆమె చేతిలో వున్న పెద్ద వెదురుబుట్టను చూసి... పక్కకు తప్పుకుని దారిచ్చాడు పాలేరు. పూలమొక్కలతో ఉన్న పెద్దవాకిలిని దాటి... పక్కసందులోండి పెరట్లోకి తీసుకెళ్ళాడు. 


బయటకొచ్చిన సరోజినికి... రంగమ్మ చెప్పిన వూరుపేరు వినగానే మొహం కోపంతో జేవురించింది. పాలేరును పొమ్మనమని సైగచేసి.... " ఎవతివే నువ్వు. నా సయితి వూరునుండి ఏటి సొమ్ములు తెచ్చావు? అంత పెద్దదానివా! "..।. అంటూ రౌద్రంగా అరిచింది. 


      రంగుమనిషయినా.... ఒడ్డూపొడవుగా.... నడుముదాటిన దుబ్బలాంటి ఉంగరాలజుట్టుతో, పెద్దపెద్ద పొడుచుకొచ్చినట్టు ఉండే కళ్ళతో, చెంపలంతా రోమాలతో.... చూడగానే భీతికొల్పేట్టు ఉంటుంది సరోజిని రూపం! 


ఉలికిపాటు కప్పుకుని...." బిడ్డడమ్మా! అయ్యగోరి బిడ్డ! కనేసీ.... మూన్నెల్లు నిండగానే...మా యప్ప దగ్గరే ఒగ్గేసీ... రాత్రికి రాత్రి పారిపోనాది. యెలయాలు బుద్ధి గందా. మావెక్కడ ఈ బుడ్డోడిని పోసించగలం? మీకే అప్పగించేద్దారి అని తెచ్చా! పెద్దమనసు చేసుకుని అయ్యగారి బిడ్డడని ఉంచుకుంటారో.... సీ! నా సయితి సంతానమని సంపుకుంటారో మీ ఇట్టం! " ...... ఆవిడిచ్చిన మజ్జిగ గటగటా తాగేసి..." వత్తానమ్మా! పెద్దమనసు సేసుకోండి అమ్మగోరూ!".... అంటూ వెళ్ళిపోయింది రంగమ్మ! 


             లోపలినుంచి అంతా వింటున్న సరోజినీ అత్తగారు వాకర్ సాయంతో బయటకొచ్చింది. " పెంటకుప్పల్లో పడేయ్ ....కొడుకుని! ఈడు మన రత్తమూ కాదూ మన వొంసెమూ కాదు! దాని యాపారం అది చేసుకోడానికి పోయుంటాది ఈడిని మనకు అంటగట్టి! ఈడొద్దు మనకి! నీ ఆడబొట్టి రెండో కొడుకును పెంచుకో! "..... అంటూ గదిలో పడుకున్న కొడుకు వినకుండా మెటికలు విరుస్తూ శాపనార్ధాలు పెట్టి... ఉచితసలహా ఇచ్చింది! 


సరోజిని అప్రయత్నంగా వెదురుబుట్ట మూత పైకెత్తింది. పొత్తిళ్ళలో రెండుచేతులూ గుండెమీద పెట్టుకుని ఆదమరచి నిద్రోతున్న మూడునెలల బిడ్డడు. ఒక్కసారి కళ్ళలో పడ్డ వెలుగుకు విసుగ్గా కళ్ళుతెరిచాడు. సరోజిని గండుమొహం చూసి మరొకరయితే దడిచిపోదురు.... వీడు బతకనేర్చిన వాడిలా ఆమెను చూస్తూనే నోరారా నవ్వాడు. 


పిల్లాడిని చూడగానే ... కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న బాబ్జీపోలికలు... ఆమె మనసులో కోపాన్ని చివ్వున ఎగదోసాయి! సంభాళించుకుని.... పిల్లాడిని పొత్తిళ్ళలోంచి పైకి తీసింది సరోజిని. పెళ్ళయి పద్దెనివిదేళ్ళు. తన నోటికి, తన అంతస్థుకూ జంకి పైకి అనడానికి సాహసించరు కానీ .... నిస్సంతు అని ముద్ర పడిపోయింది జనాల్లో! 


"ఇప్పుడీ బిడ్డను చేరదీయాలా? ఒదిలించుకోవాలా? తన అన్నలకు తెలిస్తే...అగ్గిమీద గుగ్గిలం అవుతారు. నిండుచూలాలితో  ఉన్న ఇల్లు నిప్పెట్టించారని తెలిసీ... ఇంత గయ్యాళిదీ... తనే పాపభీతితో తల్లడిల్లిపోయింది. ఒకపక్క పాముకాటుకు విషమెక్కి కాలూ చెయ్యీ పడిపోయి మంచమ్మీదున్న మొగుడు! మరో వేపు అన్నలు చేసిన మారణహోమం! 


పిల్లాడిని అలా జీవంతో చూసేసరికి సరోజిని మనసెందుకో చాలా తేలికయింది. " చూద్దాం! ప్రస్థుతానికి ఉండనిచ్చీ... తరవాత ఏం చెయ్యాలో చూస్తే పోతుంది! 


"..... అనుకుంటూ పాలేరునీ, అతని భార్యనూ పిలిచి " తెలిసినోళ్ళు పెంపకానికి పంపారు! అందాకలకు మీదగ్గర ఉంచండి " అని అప్పగించింది.... మళ్ళీ తనను చూసి ముఖమంతా పాకేలా నవ్వుతున్న ఆ బుజ్జిపాపడిని తనివితీరా చూసుకుంటూ! 


                        ************


"#ఆరహస్యంనీవద్దఉన్నంతసేపేవాడునీమాటవింటాడు"!గుర్తుంచుకో!  " అత్తగారి మాటలకు మ్రాన్పడిపోయింది సరోజిని. 


"పాతికేళ్ళు అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తనమాట వినకుండా పోతాడా? పెంచిన ప్రేమ కన్నప్రేమ కన్నా గొప్పదంటారే! కిషోర్ అంత తొందరగా మారిపోతాడని తనకస్సలు సందేహమే లేదు. అతని కన్నతల్లి ఎవరో అతనికి తెలుసుకునే హక్కేలేదా! పదేపదే తన మూలాల గురించి కిశోర్ అడుగుతుంటే.... ఏమీ చెప్పకుండా ఎన్నాళ్ళని!? 


వాడు చెన్నైలో చూసిన ఒకామె... తనను పట్టిపట్టి చూసి వివరాలడిగిందని, ఆమెను మళ్ళీ తమ వూరిలో గుడిదగ్గర కారాపుకుని వివరాలడుగుతుంటే....చూసానని చెప్తుంటే... ఆమె నూకరత్నమే అయుంటుందని తెలిసినా నోరిప్పలేకపోయింది తను ! ..... 


కిశోర్ రాకతోనే ....తన జీవితంలో, తన మనసులో కప్పెట్టేసిన గతమంతా మళ్ళీ సరోజిని బుర్రలో గిర్రున తిరుగసాగింది! 


           గొల్లపాలెం సూర్రావుగారి అబ్బాయి  సంబంధమని తండ్రీ, అన్నలూ ఎంత మురిసిపోయారో! ఒక్కడే కొడుకూ.... పెద్ద ఆస్థి వాళ్ళకు నచ్చితే... తనకు అతని అందం మహానచ్చేసింది. తన అదృష్టవశాత్తు తన తండ్రి వాళ్ళతో తూగగలిగాడు... బాబ్జీ తనవాడయ్యాడు. 


అతనికది మొక్కుబడి కాపురమే అయినా తాపత్రయమంతా తనదే! మొగుడిమీద మోజుతో తనే ఎన్ని కొనిపెట్టేదో కారుతో సహా! ఐదేళ్ళు సజావుగానే సాగిన కాపురం... ఇద్దరిమధ్యా బంధం గట్టిపరచడానికి పిల్లలు లేకపోవడం వలన పలుచన అయిపోసాగింది. 


        దానిమీద మావగారి మరణం ! బాబ్జీని బాధ్యతలనుండి దూరం చేసి.... అక్కరలేని ఆస్థులపెత్తనం తనకు చుట్టుకుంది. అజమాయిషీకోసం... ఉన్న కరుకుతనానికి గడుసుతనం కలుపుకుని.... గయ్యాళిది, గట్టిపిండం అని పేరుపడిపోయింది. 


ఆపై తన అన్నగార్లు వ్యవహారాల్లో కల్పించుకుని జులుం చెయ్యడం... మెల్లమెల్లగా బాబ్జీగారిని ఇంటికి దూరం చేసి... చిన్నిళ్ళ చుట్టూ తిరిగేట్టు చేసింది. నయానా భయానా చెప్పినా .... ఆయన తిరుగుళ్ళు మానలేదు. 


చివరగా కత్తిపూడిలో రికార్డింగు డాన్సు ట్రూపులో... ఈ నాగరత్నం డాన్సాడనని ఏడుస్తుంటే.... డబ్బిచ్చి విడిపించి... గొల్లపూడిలో పెట్టాడు. తను ఆ అమ్మాయిని వదిలేసి ఇంటిపట్టునుండండని మొత్తుకుంటే..... " ఆ నూకరత్నాన్ని ప్రేమిస్తున్నా! పెళ్ళాడతా" నన్నాడు! ఆఖరికి మంచం పట్టి తనకు పుస్తై కూచున్నాడు! 


            కిశోర్ ను నాగరత్నం మీద కోపాన్నంతా మర్చిపోయి తన బిడ్డలాగే గారంగా పెంచుకుంది. వాడి నవ్వులతో, ఆటపాటలతో ఇల్లంతా కలకలలాడిపోయింది. రెండేళ్ళకు భర్త మెల్లగా కోలుకోసాగాడు. ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు! 


కిషోరు కూడా మంచిచదువులు చదువుకున్నాడు. ఆస్తుల కంజాయింపు, అందరితో వ్యవహారంలో తలలో నాలుకలా ఉంటూ మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. తనంటే పంచప్రాణాలు! కొడుకూ, మారిన భర్తతో తన జీవితం సాఫీగా సాగిపోతుంటే మళ్ళీ ఇప్పుడొక కుదుపు! ........


       ఆరోజు సాయంత్రం కొడుకును ఆరుబయట మల్లెపందిరి పక్క... తులసికోట గట్టుమీద కూచోపెట్టి.... పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేసింది సరోజిని! తల్లిమాటలు వింటున్న కిశోర్ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. 


ఆమెమాటలు పూర్తవడంతోనే.... ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. ఏదో నిర్ణయించుకున్నట్టు....." అమ్మా! ఆమె జన్మనిచ్చిందేమో కానీ నువ్వు బతుకునిచ్చావు. రంగమ్మ నన్ను నీ దగ్గరకు చేర్చకపోతే నా జీవితం ఎలా ఉండేదో! ఆమె వలన నువ్వెంత కోల్పోయినా.... ఆమె సంతానాన్ని ద్వేషించకుండా కడుపులో పెట్టుకున్నావు. నీతో ఋుణాల గురించి మాట్లాడను. ఎందుకంటే నువ్వు నా అమ్మవి! పైగా ఆమె మంచిస్థితిలోనే ఉన్నట్టుంది. ఆమె దారిని ఆమెను పోనిద్దాం! నాన్నకు ఎట్టి పరిస్థితుల్లో ఆమె విషయం చెప్పద్దు. #ఈరహస్యంనీదగ్గరవున్నంతవరకేఆయననీమాటవినేదన్నదిగుర్తుంచుకో! తను బతికుందని తెలిస్తే.... ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు! అనుకోని అతిథులకు మన జీవితంలో స్థానంలేదు!" ..... కొడుకు దృఢంగా చెప్తుంటే చిత్తరువులా వింటూ వుండిపోయింది సరోజిని! 


" నాన్నా! ఆ చెప్పేదేదో నువ్వే స్వయంగా వెళ్ళి ఆమెతో చెప్పు. ఒక అమ్మగా ఆమెకు ఆపాటి ప్రేమనేనా పంచు! " .... తల్లిమాటలకు బుర్రూపాడు కిశోర్! 


             చీకట్లో నిలబడి... తల్లీకొడుకుల సంభాషణంతా వింటున్న బాబ్జీగారి తల సిగ్గుతో వంగిపోయింది....జీవితంలో తను వేసిన తప్పటడుగులను తలుచుకుని! 


ధన్యవాదాలతో

శశికళా ఓలేటి.

కామెంట్‌లు లేవు: