19, మే 2021, బుధవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*దత్తాత్రేయుడు..అవధూత..*


*(ముప్పై రెండవ రోజు)*


శ్రీ స్వామివారి ఉపన్యాసం, ఆ సాయంత్రం వేళ అనర్గళంగా సాగిపోతున్నది.. మొగలిచెర్ల గ్రామస్థులకు కూడా బాగా అర్ధమయ్యే రీతిలో సరళంగా బోధించసాగారు..అన్నదానం గురించి వివరిస్తూ..


"అందుచేతనే..ఇంటికి ఏ అతిధి వచ్చినా.. అన్నం పెట్టమంటారు మన పెద్దలు..ఇక చాలు!..ఒద్దు!..అనగలిగేదీ..అనిపించగలిగేదీ..ఒక్క అన్నం మాత్రమే!..ధన, కనక, వస్తు, వాహనాలు ఎన్ని ఇచ్చినా మనిషి తృప్తి పడడు.. కానీ కడుపునిండా అన్నం పెడితే..ఇక చాలు..తినలేము..తృప్తి గా ఉంది..అంటారు..అలా అతిథులకు పెడుతూ వుంటే..ఎప్పుడో ఒక మహాత్ముడు వస్తాడు..ఆ మహాత్ముని దీవెన ఆ వంశాన్ని తరతరాలూ కాపాడుతుంది.."


"ఇక..దత్తాత్రేయుడి అవతారం..ఆ అవతారమంటే నాకు ప్రత్యేకమైన భక్తి.. గౌరవం!..అదీ వివరిస్తాను..అత్రి, అనసూయ మాత దంపతులు..అనసూయ పేరు లోనే అసూయ లేని స్ర్రీ మూర్తి అని అర్ధం ఉంది..ఆ మహాసతి త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చి..వాళ్ళ కోరిక మేరకు..వారిని తన ఒడిలో లాలించింది..తరువాత త్రిమూర్తిరూపంతో వారినే ఒక బిడ్డగా తనకు దత్తతగా రమ్మని కోరింది..ఆ అవతారమూర్తే..దత్తాత్రేయుడు..అత్రి, అనసూయ దంపతుల బిడ్డగా అవతరించిన దత్తాత్రేయస్వామి..వారికి గురువై, వారిని తరింపజేసాడు.. ఆయన అవతార లక్షణమే అవధూత లక్షణం!..ప్రేమమూర్తి ఆయన!..ద్వేషం ఎరుగని తత్వం ఆయనది..శిష్టరక్షణ ఆయన కర్తవ్యం..దుష్టులను సన్మార్గంలోకి మరలించటమూ..అందుకు అవసరమైన అపారమైన ప్రేమ, కరుణా కురిపించటమూ ఆయన తత్వం!..నాలుగు వేదాలూ ఆయన పెంపుడు కుక్కలుగా మారిపోయాయి..ధర్మం గోమాతాగా మారి, ఆయన చెంత చేరింది..త్రిమూర్తి స్వరూపంతో వుండి.. త్రిముఖాలతో చేతదండం..కమండలంతో నిలచినమూర్తి దత్తాత్రేయుడు.."


"విగ్రహారాధనకు అనువైన మూర్తి..మాలాంటి యోగులకు ఆ దత్తాత్రేయుడు అవధూత..సద్గురువు..భగవద్గీత లో చెప్పినట్లు..శీతోష్ణస్థితులకు చలించక, రాగద్వేషాలకూ అతీతమై..సర్వప్రాణికోటిలో దైవాన్ని దర్శించే తత్వమే ఈ అవధూత తత్వం!..అదే ఆ దత్తాత్రేయుడి తత్వం..ఆ దత్తుడు ఈ ప్రకృతి లోని ఇరవై ఒక్క లక్షణాలను గురువులుగా భావించాడు..అందులో..తుమ్మెద, స్త్రీ చేతి గాజులు..ఇలా ఉన్నాయి..ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సందేశాన్ని గ్రహించాడు..ఆ గురువుల గురించి మరలా వివరిస్తాను.."


"నాకు ఆరాధ్యదైవం దత్తాత్రేయ స్వామి..నాది అవధూత లక్షణం..నేను దిగంబరంగా ఉండటం కూడా ఆ స్వామి తత్వం లో ఒక భాగమే..దిగంబరత్వం అన్నది సామాన్యమైన విషయం కాదు..ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగల కఠోర మానసిక దీక్ష!..మానాభిమానాలకు అతీతమైన తపశ్శక్తి ఉన్నప్పుడే దిగంబరత్వం చేరుకోగలడు యోగి!..ఉత్తినే దిగంబరంగా తిరుగుతూ ..లోలోపల మానాభిమానాలకు లోనయ్యే వ్యక్తి..కపటి అయినా కావాలి..లేదా..పిచ్చివాడైనా కావాలి..అనుకరణతో అవధూత తత్వాన్ని ఎదుటివారిచేత నమ్మింపజేసేవాడైనా కావాలి.."


"అవధూత ..సద్గురువు..అయిన ఆ దత్తాత్రేయుడిని గురువుగా భావించాను కాబట్టే..నా పూర్వనామాన్ని వదిలేసి..దత్తాత్రేయుడిగా నాకు నామకరణం జరిగింది..నన్ను దత్తాత్రేయుడిగా నే పిలవండి.." 


అప్పటికి శ్రీధరరావు దంపతులకు అర్ధమైంది..శ్రీ స్వామివారిని తాము ఏనాడూ పేరుతో పిలవలేదు..ఈరోజు ఆయనే తన నామాన్ని చెప్పేసారు..తాము సాక్షాత్తూ ఆ త్రిమూర్తి స్వరూపుడిని ఇన్నాళ్లూ స్వామిగా కొలుస్తున్నామని అనుకున్నారు..


మళ్లీ స్వామివారు కొనసాగిస్తూ.."ఆ దత్తాత్రేయుడి స్వరూపంగా శిరిడీ లో ప్రకటమైన సాయిబాబా ను భావించవచ్చు..ఆయనది కూడా అవధూత సంప్రదాయమే!..నూటికో కోటికో ఒక్కరు ఆ దత్తాత్రేయుడి తత్వాన్ని అర్ధం చేసుకుని..అవధూతగా మారి..ఈ కలియుగంలో మానవాళిని ఉద్ధరించడానికి ప్రకటం అవుతుంటారు..ఈ మానవలోకం.. ముందుగా వారిని గుర్తించదు.. అంతమాత్రం చేత..ఆ అవధూత నిరాశ చెంది వెనక్కు వెళ్ళిపోడు.. తన జీవన పర్యంతమూ సమాజానికి దైవానికి వారధిగా వుండి.. ఎంతో మందిని ఉద్ధరించి..ఆ తరువాత మాత్రమే తమ అవతారాన్ని చాలిస్తారు..వారు తమ దేహ త్యాగం చేసినా.. వారి తపోశక్తి మరికొంతకాలం పాటు  ఈ మానవాళిని తరింపచేస్తూ ఉంటుంది..అవధూత అడుగు పెట్టిన భూమి క్షేత్రంగా మారుతుంది..ఇది సత్యం.." అంటూ కళ్ళు మూసుకున్నారు..


శ్రీ స్వామివారి ఉపన్యాసం ఆగింది..అప్పటిదాకా వింటున్న గ్రామస్థులు..శ్రీ స్వామివారికి మ్రొక్కి..ఇళ్లకు వెళ్లిపోయారు..శ్రీధరరావు దంపతులు కూడా ముగ్ధుల్లా వింటూ వున్నారు..శ్రీ స్వామివారు చెప్పిన చాలా విషయాలు ఎన్నో సార్లు ఎక్కడో ఒకచోట పుస్తకాలలో చదివినవే.. కానీ ఇప్పుడు ఆయన చెపుతున్నప్పుడు..తపస్సు..సాధన..ఆచరణ..అన్న ముప్పేట గొలుసు మంత్రం లాగా వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయింది..తమ ఎదురుగ్గా మూర్తీభవించిన అవధూత తత్వం నిలిచిఉంది అనే స్పృహ వారికి కలిగింది..తమ జన్మకు ఈ అదృష్టం చాలు అని వారిద్దరూ మనస్ఫూర్తిగా భావించారు..


శ్రీ స్వామివారు తనను దత్తాత్రేయుడి గా పిలువమని తేల్చి చెప్పిన తరువాతి రోజునుంచి..మొగలిచెర్ల గ్రామస్థులు ఆయనను దత్తాత్రేయ స్వామి  గా పిలవడం అలవాటు చేసుకున్నారు..శ్రీధరరావు దంపతులు కూడా శ్రీ స్వామివారి గురించి చెప్పేటప్పుడు..దత్తాత్రేయ స్వామి అనే చెప్పేవారు..అలా ఆ పేరు స్థిరపడిపోయింది..


శ్రీ స్వామివారి దూరదృష్టి..ఆచారాల గురించిన అవగాహన..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: