16, ఆగస్టు 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*


*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*89.1 (ప్రథమ శ్లోకము)*


*సరస్వత్యాస్తటే రాజన్ ఋషయః సత్రమాసత|*


*వితర్కః సమభూత్తేషాం త్రిష్వధీశేషు కో మహాన్॥12051॥*


*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! ఒకానొకప్పుడు మహామునులు పవిత్రమైన సరస్వతీ నదీ తీరమునందు యజ్ఞమును నిర్వహించుటకై చేరిరి. 'త్రిమూర్తులలో (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో) ఎవరు శ్రేష్ఠులు?' అని వారిలో వారికి చర్చ ఏర్పడెను.


*89.2 (రెండవ శ్లోకము)*


*తస్య జిజ్ఞాసయా తే వై భృగుం బ్రహ్మసుతం నృప|*


*తజ్జ్ఞప్త్యై ప్రేషయామాసుః సోఽభ్యగాద్ బ్రహ్మణః సభామ్॥12052॥*


మహారాజా! ఆ విషయమును తెలిసికొనగోరి వారు బ్రహ్మదేవుని కుమారుడైన భృగుమహర్షిని త్రిమూర్తులకడకు పంపిరి. అంతట భృగుమహాముని మొదట బ్రహ్మదేవుని సభకు వెళ్ళెను.


*89.3 (మూడవ శ్లోకము)*


*న తస్మై ప్రహ్వణం స్తోత్రం చక్రే సత్త్వపరీక్షయా|*


*తస్మై చుక్రోధ భగవాన్ ప్రజ్వలన్ స్వేన తేజసా॥12053॥*


*89.4 (నాలుగవ శ్లోకము)*


*స ఆత్మన్యుత్థితం మన్యుమాత్మజాయాత్మనా ప్రభుః|*


*అశీశమద్యథా వహ్నిం స్వయోన్యా వారిణాఽఽత్మభూః॥12054॥*


బ్రహ్మదేవుని ప్రభావమును తెలిసికొనుటకై ఆ మహర్షి చతుర్ముఖునకు నమస్కరింపలేదు. స్తుతింపలేదు. ఆ కారణముగా బ్రహ్మదేవుడు ఎంతయు కుపితుడై ఆ మహామునిమీద మండిపడసాగెను. అగ్నినుండి పుట్టిన జలముతో అగ్నిని చల్లార్చబడినట్లు ఆ బ్రహ్మదేవుడు తన కుమారుడైన భృగువుపై తనలో పెల్లుబికిన కోపమును వివేకబుద్ధితో (శాంతస్వభావముతో) ఉపశమింపజేసెను.


*ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోఽన్నమ్* (ఉపనిషద్వచనము)


*89.5 (ఐదవ శ్లోకము)*


*తతః కైలాసమగమత్స తం దేవో మహేశ్వరః|*


*పరిరబ్ధుం సమారేభ ఉత్థాయ భ్రాతరం ముదా॥12055॥*


పిదప ఆ భృగుమహర్షి కైలాసమునకు వెళ్ళెను. మహాదేవుడైన శంకరుడు తన సోదరుడైన ఆ మహామునియొక్క రాకను గమనించి, ఆసనమునుండి లేచి ఆయనను ఆత్మీయతతో (సంతోషముతో) తన అక్కున జేర్చుకొనుటకై సిద్ధపడెను.


*89.6 (ఆరవ శ్లోకము)*


*నైచ్ఛత్త్వమస్యుత్పథగ ఇతి దేవశ్చుకోప హ|*


*శూలముద్యమ్య తం హంతుమారేభే తిగ్మలోచనః॥12056॥*


కానీ, భృగువు 'నీవు లోకమర్యాదలను, వేదమార్గములను ఉల్లంఘించినవాడవు' అని పలుకుచు ఆ పరమశివుని ఆలింగనమును స్వీకరింపకుండెను. అంతట మహేశ్వరుడు క్రోధముతో ప్రళయాగ్నివలె ఉగ్రుడై, త్రిశూలమును చేబూని, అతనిని చంపుటకు సిద్ధమయ్యెను.


*89.7 (ఏడవ శ్లోకము)*


*పతిత్వా పాదయోర్దేవీ సాంత్వయామాస తం గిరా|*


*అథో జగామ వైకుంఠం యత్ర దేవో జనార్దనః॥12057॥*


అప్పుడు పార్వతీదేవి తన పతిదేవుని పాదములపై వ్రాలి, మృదుమధుర (సాంత్వన) వచనములతో ఆ శంకరుని శాంతింపజేసెను. అంతట ఆ మునిశ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుని నివాసమగు వైకుంఠమునకు చేరెను.


*89.8 (ఎనిమిదవ శ్లోకము)*


*శయానం శ్రియ ఉత్సంగే పదా వక్షస్యతాడయత్|*


*తత ఉత్థాయ భగవాన్ సహ లక్ష్మ్యా సతాం గతిః॥12058॥*


*89.9 (తొమ్మిదవ శ్లోకము)*


*స్వతల్పాదవరుహ్యాథ ననామ శిరసా మునిమ్|*


*ఆహ తే స్వాగతం బ్రహ్మన్ నిషీదాత్రాసనే క్షణమ్|*


*అజానతామాగతాన్ వః క్షంతుమర్హథ నః ప్రభో॥12059॥*


అప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవియొక్క ఒడిలో శిరస్సును ఉంచి పరుండియుండెను. భృగుమహర్షి తన పాదముతో వైకుంఠుని వక్షస్థలమున తన్నెను. అంతట భక్తవత్సలుడైన (సత్పురుషులకు ఆశ్రయుడైన) విష్ణుభగవానుడు లక్ష్మీదేవితో సహా లేచి కూర్చొనెను. పిమ్మట ఆ ప్రభువు తన శయ్యనుండి దిగి, ఆ మునికి శిరసా ప్రణమిల్లి ఇట్లు పలికెను- "బ్రాహ్మణోత్తమా! నీకు స్వాగతము. ఒక్కక్షణము ఈ ఆసనమునందు విశ్రమింపుము. మహాత్మా నీ శుభాగమనమును ఎఱుంగక తగు విధముగా అర్ఘ్యపాద్యాదులను నెఱపకుంటిని. నన్ను క్షమింపుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: