16, ఆగస్టు 2021, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సలహా..సంతానం..*


శ్రీ మీరాశెట్టి గారు నిరంతరమూ శ్రీ స్వామివారి మందిర అభివృద్ధి గురించే ఆలోచించేవారు..ఆ విషయమై తరచూ మొగలిచెర్ల కు వచ్చి మా తల్లిదండ్రులైన శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లతో చర్చిస్తూ వుండేవారు..ఆ క్రమం లోనే వారితో నాకు చనువు బాగా ఏర్పడింది..


వింజమూరు లో వుండే శ్రీ గంగిశెట్టి కామేశ్వరరావు కు వివాహం జరిగి ఏడెనిమిది సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలుగలేదు..అతనూ శ్రీ మీరాశెట్టి గారికి దగ్గర బంధువేనన్న సంగతి నిన్ననే మనం చదువుకొని వున్నాము..ఒకసారి మీరాశెట్టి గారు, కామేశ్వరరావు దంపతులు అందరూ కలిసి శివరాత్రి పర్వదినానికి ఒక రోజు ముందుగా మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి రావడం జరిగింది..ప్రతి శివరాత్రి రోజు, శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్న ఆర్యవైశ్య సత్రం తరఫున అన్నదానం చేయడం పరిపాటి..ఆ సేవా కార్యక్రమంలో అందరినీ మీరాశెట్టి గారు భాగస్వామ్యులుగా చేర్చేవారు..ఆ పనుల నిమిత్తమే కామేశ్వరరావు దంపతులూ వచ్చారు..


ఆరోజు మధ్యాహ్నం.. ఆర్యవైశ్య సత్రం లో అందరూ కూర్చుని ఉండగా..కామేశ్వర రావు తో మీరాశెట్టి గారు, " సంతానం కలగాలని శ్రీ దత్తాత్రేయస్వామి వారిని వేడుకోరా..ఆయన తప్పక కరుణిస్తాడు..నీకు త్వరలో పిల్లలు పుడతారు.." అని చెప్పారు..

"ఆ యోగం నాకు లేదేమో పెదనాయనా.." అన్నాడు కామేశ్వర రావు.."అట్లా అనవద్దు..మీ దంపతులు ఇంతవరకూ ఈ స్వామిని వేడుకోలేదు..ఇప్పుడు మనస్ఫూర్తిగా వేడుకోండి.. తప్పక సంతానం కలుగుతుంది..నా మాట నమ్ము.." అని గట్టిగా చెప్పారు..ఈ సంభాషణ అంతా వింటున్న శ్రీ చెక్కా కేశవులు గారు కూడా..కామేశ్వర రావు తో స్వామివారిని వేడుకోమని సలహా ఇచ్చారు..కామేశ్వర రావు తన భార్య వైపు చూసాడు..ఆవిడ ఏదో పని ఉన్నదానిలా చటుక్కున లేచి, బైటకు వెళ్ళిపోయింది..


కొద్దిసేపటికి, కొంతమంది ఆడవాళ్లు కామేశ్వర రావు వద్దకు వచ్చి.."అయ్యా..మీ భార్య స్వామివారి మందిరం లో పెద్ద పెద్ద కేకలు పెడుతున్నది.. జుట్టు విరబోసుకొని మందిరం అంతా తిరుగుతున్నది..నువ్వు వెంటనే మందిరం లోకి వెళ్ళు.." అని చెప్పారు..కామేశ్వర రావు పరుగులాటి నడకతో శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..అతను వచ్చేసరికి, ఒక పెద్ద బండరాయిని నెత్తిన పెట్టుకొని, కామేశ్వర రావు భార్య..మందిరం చుట్టూ పరుగెడుతూ.."దత్తాత్రేయా..నేను ఉండలేను..నేను ఈ అమ్మాయిని వదిలి పోతానూ.." అంటూ కేకలు వేస్తోంది..కామేశ్వర రావు కేమీ అర్ధం కాలేదు..తన భార్య ఎన్నడూ ఇటువంటి విపరీత ప్రవర్తన తో వుండలేదు..ఈరోజు ఏమి జరిగింది?..ఉన్నట్టుండి ఈ ఉపద్రవం ఏమిటి?..సంతానం కోసం, తామిద్దరూ శ్రీ స్వామివారిని మొక్కుకోవాలని అనుకుంటుంటే..ఈలోపల ఈవిడ ఈవిధంగా మారిపోయిందేమిటి?..అని ఆలోచించ సాగాడు..మరి కొద్దిసేపటికే ఆమె లో ఉన్న ఉన్మాదం తగ్గి, మామూలు మనిషిగా మారింది..భార్యను తీసుకొని, శ్రీ స్వామివారి సమాధి వద్దకు వచ్చి.."స్వామీ..నా భార్య లోని ఈ జబ్బును తగ్గించు తండ్రీ..ఆ తరువాత..మేమిద్దరమూ నీ దగ్గరకు వచ్చి..సంతానం గురించి మ్రొక్కుకుంటాము.." అని వేడుకున్నాడు..


"ఒరే కామేశ్వర రావూ..ఈరోజు జరిగింది నీ మంచికేరా.. ఆ అమ్మాయిలో ఉన్న దుష్ట గ్రహం..ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయింది..ఇంక నువ్వేమీ బాధపడనక్కరలేదు..ఇద్దరూ తలారా స్నానం చేసి..మీకు సంతానం కలిగితే..నీకు తోచినంత హుండీలో వేస్తానని మొక్కుకో..ఖచ్చితంగా పిల్లలు పుడతారు.." అని మీరాశెట్టి గారు చెప్పారు..


కామేశ్వర రావు దంపతులు మీరాశెట్టి గారు చెప్పినట్లే చేశారు..తమకు సంతానం కలిగితే..సమాధి వద్ద మీద పదివేల రూపాయలు పెడతానని కామేశ్వర రావు మ్రొక్కుకున్నాడు..మరో మూడు నెలల కల్లా కామేశ్వర రావు భార్య నెల తప్పింది..మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది..అమ్మాయికి "నాగ దత్త కల్యాణి" అని పేరు పెట్టుకున్నారు..ఆ అమ్మాయి వివాహం తాలూకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చిన కామేశ్వర రావు ఆనాటి అనుభవాన్ని మాతో మరొక్కసారి పంచుకున్నాడు..తమకు రెండవ సంతానం గా మొగపిల్లవాడు కావాలని శ్రీ స్వామివారినే వేడుకున్నామని..ఆ స్వామివారు ఆ కోరిక కూడా తీర్చాడని..అత్యంత భక్తి తో ఆ దంపతులు చెప్పుకొచ్చారు..మీరాశెట్టి గారిచ్చిన సలహా తమ జీవితం లో ఎంతో విలువైనది అని అంటుంటారు కామేశ్వర రావు దంపతులు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: