8, అక్టోబర్ 2021, శుక్రవారం

వెంకటి చెప్పిన కధలు-4

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹


వెంకటి చెప్పిన కధలు-4


పొత్తుల రావులమ్మ.......


ఆదివారాలు మాకో పిచ్చి రొటీన్ ఉండేది. ఆలస్యంగా లేచి... అల్పాహారాన్ని చాలా స్వల్పంగా తిని, మంచి సినిమానో, టీవీలో పిల్లల పాటల ప్రోగ్రామ్ లో చూసి... ఒంటిగంట కల్లా ఇంట్లోంచి బయటపడి... భీమిలీ బీచ్ రోడ్లో లాంగ్ డ్రైవ్ కెళ్ళడం. 


గీతం కాలేజ్ ఎదురుగా ఉండే రాజుగారి పాకలో కుండబిర్యానీలు పేక్ చేయించుకుని... ఏ ఋుషికొండ బీచ్ లోనో కూర్చుని, ఎండలో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా, ఎగిసే సంద్రపుఅలల ఆటుపోట్లవెండి జలతార్లను నిశ్శబ్దంగా చూస్తూ , జీవితంలో అరుదుగా దొరికే ఆ రుచుల్ని ఆస్వాదిస్తూ గడపడం.. ! జనసమర్ధం పెరిగే వేళకల్లా మూటాముల్లే చుట్టపెట్టి... ఇంటికి బయలుదేరడం! 


         ఆ ఆదివారం వాతావరణమంతా మేఘాచ్ఛాదితమై .. సన్నగా జల్లులు పడుతుండడంతో ఇంట్లోనే భోంచేసి... బీచ్ రోడ్ లో క్వాలిటీ బండిలో ఐస్ క్రీం కొనుక్కుని, మొక్కజొన్న పొత్తుల కోసం ఎంత వెదికినా ఒక్కళ్ళూ కనపడలేదు. 


ఊడాపార్కు దాటేసి.. కామత్ గెస్ట్ హౌస్ దగ్గరకొచ్చేసరికి... ఆపద్బాంధవిలా కనిపించింది ఆమె.... బస్ షెల్టర్ లో బొగ్గులు రాజేసుకుంటూ... పక్కన వలచిన పెద్ద లేత అనకాపల్లి జొన్న కండెలతో! 


       కారు పక్కకి పోనిచ్చి అడిగాము "ఎంతని?". మాకేసి కాస్త గీరగా చూసి.." బోణీ యవ్వాల!"... అంది. మా అమ్మాయికి ఛివ్వున కోపం వచ్చింది. " మేం డబ్బులుకే కొంటాం కదా. మాది బోణీయేగా!"... అంటూ రెట్టిస్తుంటే... మాకేసి నిర్లక్ష్యంగా చూసి... ఆ పక్కనే కాస్త దూరంలో కూచుని స్టీలు కారేజీ గిన్నెల్లోంచి అన్నం తింటున్న ఓ నిక్కరూ, చొక్కా వేసుకుని... బాగా బీదగా ఉన్న ఒకడ్ని పిలిచి... " ఒలే! అపార్మెంట్ లో పాపగారికి పోన్ చెయి. గిన్నెలు ఆ పాలి తోమేసి తే... లగెత్తు.." అంటూ ఓ సున్నితమైన కర్కశపదంతో ముగించే సరికల్లా... " అల్గల్గేనే యప్పా.." అనుకుంటూ వాడు గిన్నెలు పట్టుకుని పోయాడు. 


       ఈ డ్రామాకు మా వారు అసహనంతో రగులుకుపోయి... మేమెంత వారించినా వినకుండా కారు స్టార్టు చేస్తుంటే వచ్చింది ఓ పన్నెండేళ్ళ పిల్ల... పదిరూపాయలిచ్చి... కాల్చిన రెండుపొత్తులు తీసుకుని పోయింది. 


ఆ పిల్లకేసి అపురూపంగా చూస్తూ, పదిరూపాయలు ముద్దుపెట్టుకుని పొత్తులకు తాటించి....మొలలో చిక్కంలోకి తోసింది. కరుణించిన మేరిమాతలా.. మా అమ్మాయిని చూసి రమ్మని సైగ చేసింది. 


స్టార్ట్ అయిన కార్లోంచే తలుపు తీసుకుని దూకేసింది మా సివంగి. పది వేడి వేడి పొత్తులు వైనంగా కాల్చి, ఆకుల్లో పెట్టి.... కవర్లో పెట్టి ఇచ్చింది." వందిచ్చాగా! చిల్లరేదే? " అంటే.." మనకయితే ఒకటీ పదిటమ్మా.." అంటూ బేరమాడ్డం రాని మా జడ్డి చెప్పింది. 


           ఆ పొత్తుల బేరం, ఆ దేశవాళీ పొత్తుల రుచీ.... మా పిల్లను ఆ అమ్మికి ఎంతలా కట్టేసిందంటే.... కాలేజీ నుంచి స్కూటీ అటుతిప్పుకుని.... బీచ్ రోడ్లో లక్షా పదిమంచి అమ్ముతున్నా... ఆ అమ్మి దగ్గరే కొనుక్కునేంత! ఆవిడ కూడా మా అమ్మాయితో బోణీ చేయించుకునేంత! మా అమ్మాయికి తను " పొత్తుల రావులమ్మ!"


రావులమ్మ చాలా విలక్షణంగా ఉండేది. మహా ఎత్తరి మనిషి. పచ్చటి ఛాయ. ఇసుకలో అలల జాడల్లా... మొహంలో కాలం, పరిశ్రమ వదిలి వెళ్ళిన సన్నని గీతలు. వీళ్ళ వయసులూ చెప్పలేము ముఖకవళికలు బట్టీ.....వాళ్ళవి కాయకష్టం వంచిన శరీరాలు! 


అయితే ఈ రావులమ్మ భారీగా ఉండేది. కాళ్ళకు బరూవైన ఇత్తడి, వెండి జోడు కడియాలు, సంద్రపుగాలికి నల్లబడిపోయిన వెండి,జిలేబీ పట్టీలు, ఇంత మందాన పసుపు పూసిన పాదాలకు... పుచ్చిపోయిన గోర్లు! చెవులకు పెద్ద లోలాకుబుట్టలు, మాటీలు, మెడలో నలిగిపోయిన నానుతాడు, నల్ల, ఎర్ర పూసలదండలు. మొహానికి దూమెరుగ్గా రాసిన పసుపు... నుదుట రూపాయి కాసంత బొట్టు... దానిమీద గంధం బొట్టు, విబూధి! ముదూరురంగు నేతచీరలు పైకంటా కట్టి... పైట స్థానభ్రంశాలను చులాగ్గా విస్మరించి..... మధ్యాహ్నం నాలుగింటి నుండి ఎనిమిదింటి లోగా మూడు సంచుల పొత్తులు.. అసిస్టెంట్ సాయంతో అమ్మేసే రాములమ్మ స్టోనిప్పి నోరారా అరిచిందా.... స్టూడెంట్ గొల్లిగాళ్ళు( ఆమె భాషలో) డబ్బులిచ్చి పారిపోవలసిందే! మా అమ్మాయిని ఏదో కామెంట్ చేసాడని... ఒక కుర్రాడి చేతిలో పొత్తుతోపాటూ... కుంపట్లోంచి మండుతున్న నిప్పుకణికె తీసి చేతిలో పెట్టిందట! అంత వయెలెంట్ రావులమ్మ


                      ----------


         " ఇంత గద్దు సింతపండేసి జిడ్డు ఒగ్గీయాలి...మిలమిల మిలమల మెరిసిపోవాలంటే ఎల్గవుతాది పంతులూ! పీతాంబారి యెయ్యండి కుసింత...".... ఈ స్టోను ఎక్కడో విన్నట్టుందని వెనక్కి తిరిగి చూద్దును కదా... రావులమ్మ. 


ఓ బుట్టలో దేవుడి సామాన్లన్నీ తోమడానికి నూతిదగ్గరకు వెళ్తోంది. 


నలభై శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకాలు చెయ్యమని గురువుగారు చెప్పడంతో తెల్లవారి ఐదింటికి వచ్చాము నేనూ, ఆయనా! 


మమ్మల్ని చూస్తూనే.." పంతులుగోరూ! మా యమ్మగార్లే! బాగా చేయించండి...!" అంటూ రికమెండేషన్ చేసి మరీ పనుల్లోకి దూకింది. 


అలా ఎన్నో శనివారాల ప్రత్యూషవేళల.... ఆ పురాతన శివాలయపు ప్రాంగణమంతా తుడిచి కల్లాపు చల్లి... రెండు వేళ్ళ మధ్యనుండి రెండుగీతలుగా ముగ్గుపోస్తూ... అత్యంత నేర్పరిలా పెద్దపెద్ద ముగ్గులతో అలంకరించి, మారేడుదళాలు, నందివర్ధనాలు కోసి అర్చకునికి అందించే.... గ్రామదేవతలా కళకళలాడే రావులమ్మను చూడడం... ఎందుకో మనసుకు చాలా నచ్చేది నాకు! 


                      -----------


         " పాపగారు ఈరోజు మా పేటకొచ్చారమ్మా... ఈయేళ మా ఓనరమ్మగారితో! ".... " నాటుగుడ్లు కావాలన్నారంట పాప. అందుకే. సానా సేపే కూచున్నారు. నేను పనికొచ్చీసినాను! వెంకటి చెప్తుంటే..నా గుండె ఆగిపోయింది. 


ఈ పిల్ల అలా ముక్కూమొహం తెలీని వాళ్ళతో వెళ్ళడమేంటని కోపం వచ్చింది. ఇంతలో మా అమ్మాయి..పుస్తకాల సంచీ, ఎగ్ హోల్డరూ... ఒడుపుగా బేలన్స్ చేస్తూ ఇంట్లోకొచ్చింది.


" అమ్మా! రాములమ్మ నన్ను నాటుకోడి గుడ్డు రోజూ రా గా మింగమంది. పదిరూపాయలుకి ఒకటీ. కానీ నాకు ఫైవ్ కే ఇచ్చింది. వెంకటీ ఇవి ఫ్రిజ్ లో పెట్టవే.." అంటూ అందించింది. 


నేను వెంకటి కేసి చూపించి.. " ఇది ఓనరమ్మ అంటోంది.." అని కూపీలాగబోయా! వెంటనే వెంకటి " అయ్యో అమ్మా! రావులమ్మగోరే మా ఓనరమ్మ. ఐదు మేడలాళ్ళవి. ఒకింట్లో ఆళ్ళంతా ఉంటారు. నాలుగు మేడలు అద్దెలకే! అమ్మో లచ్చాదికారి. కోటీస్పరురాలు..! " ... ఉలిక్కిపడ్డా నేను. నాకున్న చిన్న గూడుకే నాకు ఎంత భేషజమో. రావులమ్మ అంతుంచుకుని.... ఇంకా శ్రమిస్తుంది. ఎక్కడో అహం మిటమిటలాడింది నాకు. 


        వెంకటి చెప్పడం.... రావులమ్మ, మొగుడూ విజనారం చిట్టివలస నుండి ముగ్గురు పిల్లలతో పెదవాల్టేరు వలసొచ్చి చిన్న పాకొటేలు నడిపేవారంట. మెల్లగా రావులమ్మ మొగుడు సన్నాసప్పడు బిల్డింగ్ పనులకెళ్ళి కూలీ నుంచి కొన్నాళ్ళకు మేస్త్రీ అయ్యాడంట. 


ఒకరోజు బళ్ళారి కుర్రాడొకడ్ని తెచ్చి... ఒటేలు పాకలో రాత్రిపూట పడుకుంటాడని తెచ్చిపెట్టాడట. ఈడిపేరు "అచ్చుమెచ్చు"! స్లాబులెయ్యడంలో మంచి నేర్పరంట. అచ్చుమెచ్చు కాస్తా అచ్చిబాబులా మారి, మనబాస 

నేర్చుకుని... సన్నాసప్పడి కుటాంబంతోనే ఉండిపోయాడంట. ఆళ్ళ పిల్లలు ఈడిబుజాల మీదే పెరిగి పెద్దయ్యారంట. 


ఒకరోజు ఐదో అంతస్ధు కిటికీ స్లాబేస్తూ సన్నాసప్పడు కిందపడి.. తలపగిలి చచ్చిపోయాడంట.వేరే దిక్కులేని ఓనరమ్మని, కుటుంబాన్నీ అచ్చిబాబే పోషించేవాడంట. రావులమ్మ ఆడికి పెళ్ళిచేద్దామంటే ఒప్పుకోకుండా... " వచ్చే పెళ్ళం నిన్నూ, పిల్లల్నీ చూడనిస్తుందా. నువ్వే నన్ను మనువాడేయి" అన్నాట్ట. 


ఇద్దరూ పెళ్ళి చేసుకుని... పైసాపైసా కూడపెట్టి... ఇళ్ళూ వాకిళ్ళూ కట్టుకున్నారంట. అచ్చిబాబుకు రావలమ్మంటే చచ్చేంత ప్రేమా, భయమూనంట. నెలకోసారి పెళ్ళం డబ్బులిస్తేనే తాగుతాడంట...అంతే! 


" మరి వీళ్ళకు పిల్లల్లేరా?".. అడిగా! కనక బాగా గొంతు తగ్గించి...." ఒక కూతురమ్మ! నాగరత్నం! అచ్చిబాబు ఆళ్ళమ్మ పేరు. పదారేళ్ళ వొయిసులో... ఇంట్లో అద్దెకున్న గుంటెధవలు పాడుచేసారంట. మేడమీద గదిలోకెళ్ళి కాల్చుకుని సచ్చిపోయిందంట ! మా పక్కింటోళ్ళు చెప్పారు. తెల్లగా, పొడావుగా, ఈరోయిన్ లా ఉండేదంట పిల్ల! "....పక్కగదిలోండి ఓ చెవి ఇటు పడేసిన మా పిల్ల ఒక్క ఉదుటున వచ్చింది.


 " అందుకేనేమో అమ్మా! తనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఒక బీరువానిండా వాళ్ళింట్లో రంగూన్ బొమ్మలున్నాయి. రావులమ్మ నాన్న తన చిన్నప్పుడు రంగమెళ్ళి తెచ్చేవాడట"! .... అది రంగమెళ్ళి ... అంటుంటే అప్రయత్నంగా నవ్వొచ్చింది. 

ఇన్ని విషాదాల మధ్య స్థితప్రజ్ఞురాలిలా తన పని తను చేసుపోయే రావులమ్మ కర్మయోగిలా కనిపించేది నాకు. 


        కాలచక్రంలో మార్పులు మనుషులకూ తప్పవు. వారంరోజులు టైపార్టీ జ్వరం( టైఫాయిడ్) తో సడన్గా రావులమ్మ చనిపోయింది. అచ్చిబాబుని పట్టుకోలేకపోయారుట. కిరసనాయిల్ పోసుకుని చచ్చిపోతానని గోలగోలట. "ఎంత ప్రేమించే భర్త!".... అనుకోకుండా ఉండలేకపోయా! మా అమ్మాయి వెళ్తానంది. నేను వీల్లేదన్నా! పుణ్యస్త్రీగా పోయిందని... అచ్చిబాబూ, రావులమ్మ కొడుకూ, అల్లుళ్ళు భారీగా ఖర్చుపెట్టి ఆమెను పూలరధంలా సాగనంపేరట!! 


       మా అమ్మాయి మళ్ళీ మొక్కజొన్నపొత్తు ముట్టుకోలేదు. "దీనికేమయినా పిచ్చా! " అనుకున్నా.... ! కొన్ని బంధాలకు బంధుత్వాలతో పనుండదేమో. మా ఆదివారం లాంగ్ డ్రయివ్ లు పలచనయిపోయాయి. 


                          --------------


          మా అమ్మాయి పెళ్ళయి, గూడు వదిలి రెక్కలొచ్చి ఎగిరేరోజు వచ్చేసింది. ఒకరోజు పొద్దున్నే గుమ్మంలో ఓ తెల్లగా, పొట్టిగా నిక్కరూ, తెల్లచొక్కా వేసుకుని ...గుమ్మటంలా ఉన్న ఓ నడివయస్కుడు ఏదో అట్టపెట్టితో నిలబడి ఉన్నాడు. ఆర్కాట్ యాసలో " నాను రావులమ్మ పెనిమిటిని! అచ్చిబాబంతారు! రావులమ్మ ఈ పెట్టి మీపాప కోసం పెట్టినాది! నాను మరిసిపోయా! యాదికొచ్చి తెచ్చినా!" .... అంటూ నిర్వికారంగా చూస్తూ..నా చేతిలో పెట్టి పెట్టేసి వెళ్ళిపోయాడు. 


     పెట్టి విప్పి చూద్దును కదా.... రెండు వరసల్లో... ఎంతో నాణ్యమైన చైనాతో చేసిన పింగాణీబొమ్మలు. తేలికగా, తెల్లని బొమ్మలకు అందమైన రంగులేసుకున్న అమ్మాయి బొమ్మలు! 


వాటికి మధ్యలో కూరిన ఎండిపోయిన మొక్కజొన్న ఆకుల చెత్త! ఆ ఆకులు చేతిలోకి తీసుకున్నా! ఎవరీ రావులమ్మ. ఎందుకింత ప్రేమ ఈ పిల్లమీద! కళ్ళంబడి ఒక కన్నీటిబొట్టు జారి ఆకుల్లో పడి ఇంకిపోయింది! 


*శశికళ ఓలేటి* ( కధ నా స్వంతం, కల్పితం, షేర్ మనా!!) 

18-3-2020

కామెంట్‌లు లేవు: