8, అక్టోబర్ 2021, శుక్రవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*441వ నామ మంత్రము* 8.10.2021


*ఓం కౌళమార్గ తత్పర సేవితాయై నమః*


శ్రీవిద్యోపాసనలో గల సమయ, కౌళ, మిశ్రమములు అను మూడుమతములలో కౌళమార్గతత్పరులచే సేవింపబడు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కౌళమార్గ తత్పర సేవితా* యను పదియక్షరముల (దశాక్షరీ) నామ మంత్రమును *ఓం కౌళమార్గ తత్పర సేవితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను ఉపాసించు సాధకులకు, ఆ తల్లి కరుణచే విశేషమైన ఆ పరమేశ్వరీ తత్త్వము తెలిసి, తన్మూలంగా తమ సాధనపటుత్వమును పొంది తరింతురు.


శ్రీమాతను ఆరాధించుటలో వివిధ మార్గములు గలవు. అవి సమయాచారము, కౌళమార్గము, మిశ్రమమార్గము. వంశపారంపర్యముగా దేవీ ఆరాధన చేయుటనే కులాచారము అనియు, అదియే కౌళాచారమనియు అందురు. ఈ కౌళాచారులు వంశానుక్రమంగా అమ్మవారిని సేవించుచూ, ఆ కౌళమార్గములో చెప్పిన ప్రకారము జంతుబలులు, వివిధరీతుల నైవేద్యములు, మద్యము అమ్మవారికి సమర్పింతురు. ఈ ఆచారమునే కౌళాచారము అందురు. కౌళాచారులు అమ్మవారి స్వరూపమును ఉగ్రస్వరూపంగా తలచుదురు. నూకాలమ్మ, మరిడమ్మ, అసిరమ్మ మొదలైన వివిధనామములలో గల కొండదేవతలు, గ్రామదేవతలు వీరు అందరూ కౌళాచార మార్గమునందు సేవింపబడుచూ, భక్తులను తరింపజేయుదురు. కంచికామాక్షి ఉగ్రస్వరూపంలో ఉండి భయంకర రూపంలో ఉండేదట. ఆదిశంకరులవారు ఆ తల్లిని శాంతమూర్తిగా పరివర్తింపజేసి తరించారు.   


శ్రీవిద్యోపాసనమందు సమయమతము, కౌళమతము, మిశ్రమమతమని మూడు మతములు గలవు. శుకసంహిత, వశిష్ఠ సంహిత మొదలగు ఐదు సంహితలయందు చెప్పబడిన మతము సమయమతము. ఇది పూర్తివైదీకము. చంద్రతంత్రము, కులతంత్రము మొదలగు ఎనిమిది తంత్రములందు కౌళాచారము చెప్పబడినది. మిశ్రమమతము నందు తాంత్రికము, వైదికము రెండునూ ఉండును. కౌళమార్గము కేవలం తాంత్రికమార్గము మాత్రమే. ఉదాహరణకు- అమ్మవారి పండుగ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అందరూ చేరి కోడి, మేక, దున్నపోతు మొదలైన జంతువులను బలి ఇచ్చి, ఆ మాంసము, మద్యము సమర్పిస్తారు. ఈ కార్యక్రమం కేవలం తాంత్రికం తప్ప వైదిక మంత్రయుతంగా ఉండదు. బ్రాహ్మణుడు ఈ తంత్రమందు పాల్గొనుట జరుగదు. కొండకోనల్లో జరిగా కౌళాచార ఆరాధనలో బలులతోబాటు, మద్యమును సమర్పిస్తూ, డప్పులు, అగ్నిగుండములు మొదలైన విశేషమైన తాంత్రిక పద్ధతులలో అమ్మవారిని సేవిస్తారు. ఇటువంటి మార్గమునే కౌళమార్గమనియు, కౌళమార్గములో ఆరాధింపబడుతుంది గనుక అమ్మవారు *కౌళమార్గతత్పర సేవితా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కౌళమార్గ తత్పర సేవితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐-

కామెంట్‌లు లేవు: