8, అక్టోబర్ 2021, శుక్రవారం

సంస్కృత మహాభాగవతం

 *7.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పండ్రెండవ అధ్యాయము*


*సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*12.9 (తొమ్మిదవ శ్లోకము)*


*యం న యోగేన సాంఖ్యేన దానవ్రతతపోఽధ్వరైః|*


*వ్యాఖ్యాస్వాధ్యాయసన్న్యాసైః ప్రాప్నుయాద్యత్నవానపి॥12671॥*


ఉద్ధవా! కొందరు మహాత్ములు యోగము, సాంఖ్యము, దానము, వ్రతము, తపస్సు, యజ్ఞములు, శాస్త్రాధ్యయనము, అధ్యాపనము, సన్న్యాసము మొదలగు వాటిద్వారా గట్టిగా పూనిక వహించియు, నా కృపకు పాత్రులు కాలేకపోయిరి. కానీ, సత్సంగము ద్వారా వారు నన్ను పొందగలిగిరి.


*12.10 (పదియవ శ్లోకము)*


*రామేణ సార్ధం మథురాం ప్రణీత శ్వాఫల్కినా మయ్యనురక్తచిత్తాః|*


*విగాఢభావేన న మే వియోగతీవ్రాధయోఽన్యం దదృశుః సుఖాయ॥12672॥*


ఉద్ధవా! గోపికలకు నా యందుగల ప్రేమానురాగములు అపూర్వములు. అక్రూరుడు నన్ను, మా అన్నను వ్రజభూమినుండి మథురకు తీసికొని వచ్చునప్పుడు వారు నా ఎడబాటువలన వ్యాకుల చిత్తలైరి. ఎవ్వరివలనను నా నుండివలె వారికి ఆప్యాయత లభింపదు. గావున, వారు అప్పుడు ఎంతగానో విలవిలలాడిరి.


*12.11 (పదకొండవ శ్లోకము)*


*తాస్తాః క్షపాః ప్రేష్ఠతమేన నీత మయైవ వృందావనగోచరేణ|*


*క్షణార్ధవత్తాః పునరంగ తాసాం హీనా మయా కల్పసమా బభూవుః॥12673॥*


మహాత్మా! ఉద్ధవా! నేను గోపికలకు అత్యంత ప్రీతిపాత్రుడను. అందువలన నేను బృందావనము నందున్నప్పుడు నాతో పాటు రాసలీలలను జరుపుచు, వారు హాయిగా పెక్కు రాత్రులను అరక్షణముగా గడపిరి. కాని, నేను బృందావనము వీడివచ్చిన పిమ్మట నా యెడబాటువలన వారికి ప్రతిరాత్రియు ఒక కల్పప్రాయమై దుర్భరమయ్యెను.


*12.12 (పండ్రెండవ శ్లోకము)*


*తా నావిదన్ మయ్యనుషంగబద్ధధియః స్వమాత్మానమదస్తథేదమ్|*


*యథా సమాధౌ మునయోఽబ్ధితోయే నద్యః ప్రవిష్టా ఇవ నామరూపే॥12674॥*


ఉద్ధవా! నదులు పరుగెత్తుకొనిపోయి సముద్రములో చేరినమీదట తమ నామ, రూపములను కోల్పోయినట్లుగా, మునీశ్వరులు సమాధినిష్ఠలో మునిగినప్పుడు వారికి దేహాధ్యాస నశించినట్లుగా, నేను తప్ప వేరొకటి తెలియకుండా, నా ప్రేమయే సర్వస్వముగా భావించి, లయించిన చిత్తముగల గోపికలకు తమ స్వంతశరీరమే అతనికి చెందినదా! లేక శరీరము వారికి చెందినదా! ఇది - అది అను భేదము ఇంచుకంతయును స్పృహ తెలియనివారై, నాలో తాదాత్మ్యమును చెందెదరు.


*ఒక ముఖ్యగమనిక* - లోకంలో సహజంగా మంగళాచరణము నందు భగవంతుని స్మరించుట పరిపాటి. కాని, ఈ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా మంగళాచరణమునందు భక్తులను స్మరించి తన ఉపదేశమునకు ఉపక్రమించుట గొప్ప విశేషము. నిర్హేతుక కృపామయుడు, అవ్యాజమైన ప్రేమమూర్తియగు పరమాత్మకు తన భక్తుల పట్ల గల భక్తిప్రేమభావము ఎంతగొప్పదో, ఇచట స్పష్టముగా నిరూపింపబడినది.


*12.13 (పదమూడవ శ్లోకము)*


*మత్కామా రమణం జారమస్వరూపవిదోఽబలాః|*


*బ్రహ్మ మాం పరమం ప్రాపుః సంగాచ్ఛతసహస్రశః॥12675॥*


అమాయికలైన గోపభామినులు నా సహజస్వరూపమును ఎరుగకున్నను నాయందు గల ప్రేమాను రాగములచేత జారభావముతో ప్రియునిగా నన్ను పొందగోరిరి. ఐనను, నా సాంగత్య ప్రభావమున వేలకొలది గోపికలు పరబ్రహ్మస్వరూపుడనైన నన్ను చేరుకొనిరి.


*12.14 (పదునాలుగవ శ్లోకము)*


*తస్మాత్త్వముద్ధవోత్సృజ్య చోదనాం ప్రతిచోదనామ్|*


*ప్రవృత్తం చ నివృత్తం చ శ్రోతవ్యం శ్రుతమేవ చ॥12676॥*


*12.15 (పదిహేనవ శ్లోకము)*


*మామేకమేవ శరణమాత్మానం సర్వదేహినామ్|*


*యాహి సర్వాత్మభావేన మయా స్యా హ్యకుతోభయః॥12677॥*


కావున ఉద్ధవా! విధినిషేధములను, ప్రవృత్తి, నివృత్తి మార్గములను, ఐహికము మరియు ఆముష్మికమునకు చెందిన విషయములను అన్నింటిని పరిత్యజించి, సర్వాత్మభావముతో నన్నే శరణుపొందుము. ఏలయన, నేను సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడను. నన్ను ఆశ్రయించిన వారికి ఎట్టీభయమూ ఉండదు అని శ్రీకృష్ణభగవానుడు ఉద్ధవునితో నుడివెను.


*ఉద్ధవ ఉవాచ*


*12.16 (పదహారవ శ్లోకము)*


*సంశయః శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర|*


*న నివర్తత ఆత్మస్థో యేన భ్రామ్యతి మే మనః॥12678॥*


*ఉద్ధవుడు వచించెను* యోగేశ్వరేశ్వరా! నీవొసంగిన ఉపదేశమును పూర్తిగా వింటిని. కానీ! నాలోగల సంశయము తీరనేలేదు, 'నేను స్వధర్మపాలనము చేయవలెనా? లేక అన్నింటిని పరిత్యజించి, నిన్నే శరణుపొందవలెనా?' అను విషయము ఇంకను నా మనస్సును తికమక పెట్టుచునే యున్నది. కావున నాకు కృపతో విశదపఱుచుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: