*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*442వ నామ మంత్రము* 8.10.2021
*ఓం కుమార గణనాథాంబాయై నమః*
కుమారస్వామికి, గణేశ్వరునికి తల్లి అయిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కుమార గణనాథాంబా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం కుమార గణనాథాంబాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను ఆరాధించు భక్తులను ఆ తల్లి వారిని తన పుత్రులైన కుమారస్వామి, గణేశ్వరులతో సమానముగా తన పుత్రులుగా భావించి వారికి కావలసిన భౌతికపరమైన ఆముష్మికపరమైన శాంతిసౌఖ్యములను ప్రసాదించును.
కుమారస్వామి, గణనాథుడు అనువారు అమ్మవారి పుత్రులు.
*కుమారస్వామి జననము*
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులను బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, పండ్రెండు చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి.
*షణ్ముఖుడు* - ఆరు ముఖాలు గలవాడు
*స్కందుడు*- పార్వతి పిలచిన పదాన్ని బట్టి
*కార్తికేయుడు* - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
*వేలాయుధుడు* - శూలము ఆయుధంగా గలవాడు
*శరవణభవుడు* - శరవణము అంటే ఱెల్లుగడ్డిలో అవతరించినవాడు
*గాంగేయుడు* - గంగలోనుండి వచ్చినవాడు
*సేనాపతి* - దేవతల సేనానాయకుడు
*స్వామినాథుడు* - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
*సుబ్రహ్మణ్యుడు* - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
*మురుగన్* - అందమైన వాడు (తమిళం)
*గణపతి జననము*
ఒకసారి పార్వతి శంకరునకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది. తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికి ప్రాణప్రతిష్ట చేయవలెననిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది. ఆ దివ్యసుందర బాలుని వాకిటిలో ఉంచి, స్నానమునకై వెళ్ళినది.
శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.
జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి.
జగన్మాత ఆ విధంగా కుమారస్వామి, గణనాదులకు తల్లి యగుటచే, *కుమారగణనాథాంబా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కుమారగణనాథాంబాయై నమః* అని యనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి