8, అక్టోబర్ 2021, శుక్రవారం

సంస్కృత మహాభాగవతం

 *8.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పండ్రెండవ అధ్యాయము*


*సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*12.17 (పదిహేడవ శ్లోకము)*


*స ఏష జీవో వివరప్రసూతిః ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్టః|*


*మనోమయం సూక్ష్మముపేత్య రూపం మాత్రా స్వరో వర్ణ ఇతి స్థవిష్ఠః॥12679॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! విశ్వమంతటను పరమాత్మయే నిండియున్నాడు. *జీవయతీతి జీవః* అనగా పరమాత్మయే అన్నింటికిని చేతన శక్తిని, జీవనశక్తిని ప్రదానము చేయువాడు. కనుక జీవరూపములో నుండెడివాడు పరమాత్మయే. ఆ పరమేశ్వరుడు (జీవుడు) మొదట అనాహత నాదస్వరూప *పరా* వాణీరూపములో ప్రాణముతో గూడ మూలాధార చక్రమున ప్రవేశించును. పిమ్మట మనస్సునుండి మనోమయ రూపమును గ్రహించి, మణిపూరచక్రమునందు *పశ్యంతీ* అను పేరుతో వాక్కుయొక్క సూక్ష్మరూపమును ధరించును. ఇట్లు కంఠస్థానమునందుగల విశుద్ధచక్రము నందు చేరి *మధ్యమ* అను పేరుగల రూపమును దాల్చును. అనంతరము ముఖమున జేరి అకారాది మాత్రలు, స్వరములు, వర్ణములు - మొదలగు రూపములలో *వైఖరీ* అను పేరుతో వాక్కుయొక్క స్థూలరూపమును ధరించును. ఇట్లు శబ్దబ్రహ్మరూపమున పరమాత్మ అభివ్యక్తుడగునని భావింపవలెను.


*12.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*యథానలః ఖేఽనిలబంధురూష్మా బలేన దారుణ్యధిమథ్యమానః|*


*అణుః ప్రజాతో హవిషా సమిధ్యతే తథైవ మే వ్యక్తిరియం హి వాణీ॥12680॥*


ఆకాశమున అగ్ని విద్యుద్రూపమున స్థిరమైయుండును. ఆ అగ్నియే అరణియందు మథించినప్పుడు వాయువుతోడై అగ్నికణముగా వెలువడును. ఈ అగ్నియందు హవిర్ద్రవ్యము చేరినప్పుడు ప్రజ్వలితమగును. ఇట్లు వాక్కుగూడ సూక్ష్మరూపమున ప్రారంభమై, స్థూలరూపమున ప్రకటితమగును. ఇదేవిధముగా శబ్దబ్రహ్మయొక్క రూపమున నేనే అభివ్యక్తుడనగుచున్నాను.


*12.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ఏవం గదిః కర్మగతిర్విసర్ ఘ్రాణో రసో దృక్స్పర్శః శ్రుతిశ్చ|*


*సంకల్పవిజ్ఞానమథాభిమానః సూత్రం రజఃసత్త్వతమోవికారః॥12681॥*


ఇదే విధముగా ఇతరక్రియలందును నా రూపమే అభివ్యక్తమగుచున్నట్లు భావింపుము. మాట్లాడుట, కర్మలను ఆచరించుట, నడచుట, మలమూత్రములను విసర్జించుట, ఆఘ్రాణించుట, రుచి చూచుట, దర్శించుట, స్పృశించుట, వినుట, మనస్సుద్వారా సంకల్ప వికల్పములను జరుపుట, బుద్ధిద్వారా అవగాహనచేసికొనుట, అభిమానించుట మొదలగు అన్ని క్రియలును, మహత్ తత్త్వము, సత్త్వరజస్తమో గుణముల వికారములు, అంతేగాక దృశ్యప్రపంచము - సమస్త కర్తా, కరణ, కర్మలు అన్నియును నా అభివ్యక్తములే అని ఎరుంగుము. ఈ రూపములన్నింటిలో పరమాత్మనైన నేనే ప్రకాశించుచున్నాను.


*12.20 (ఇరువదియవ శ్లోకము)*


*అయం హి జీవస్త్రివృదబ్జయోనిరవ్యక్త ఏకో వయసా స ఆద్యః|*


*విశ్లిష్టశక్తిర్బహుధేవ భాతి బీజాని యోనిం ప్రతిపద్య యద్వత్॥12682॥*


*12.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*యస్మిన్నిదం ప్రోతమశేషమోతం పటో యథా తంతువితానసంస్థః|*


*య ఏష సంసారతరుః పురాణః కర్మాత్మకః పుష్పఫలే ప్రసూతే॥12683॥*


సత్త్వరజస్తమోగుణాత్మకమైన ఈ బ్రహ్మాండము అను కమలముయొక్క ఉత్పత్తికి కారణమైనవాడు ఆ పరమేత్మయే. అవ్యక్తమైన ఆ ఒకే పరబ్రహ్మము పెక్కురూపములలో వ్యక్తమగుచున్నాడు. ఆ ప్రభువు పురాణపురుషుడు, అన్నింటికిని ఆద్యుడు. అతడే తనకు తానుగా పెక్కుశక్తులలో విభాజితుడై దేవమనుష్యాది రూపములలో భాసిల్లుచు, సర్వత్ర ఆయా రూపములలో విరాజిల్లుచున్నాడు. భూమిలో నాటబడిన విత్తనము అనేక రూపములలో అభివ్యక్తమైనట్లు, ఈ విశ్వము పరమాత్మనుండి ఉజ్జీవనీశక్తిని పొంది, అనేకరూపములలో ప్రకటితమగును. కనుక ఈ విశ్వము అంతయును పరమాత్మయొక్క స్వరూపమే. వస్త్రమునందు దారములు ఓతప్రోతములయినట్లు పరమాత్మయే ఈ విశ్వమునందు పడుగుపేకలవలె ఓతప్రోతమై యున్నాడు. అనగా ఆ పరమాత్మయే వ్యాప్తమైయున్నాడు. ఈ సంసారవృక్షము మిక్కిలి పురాతనమైనది. కర్మలపరంపరయు అనాదికాలమునుండి అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్నది. కనుక వాటినుండియే సుఖదుఃఖములనెడు పుష్పఫలములు ఉత్పన్నమగుచున్నవి.


*12.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ద్వే అస్య బీజే శతమూలస్త్రినాలః పంచస్కంధః పంచరసప్రసూతిః|*


*దశైకశాఖో ద్విసుపర్ణనీడస్త్రివల్కలో ద్విఫలోఽర్కం ప్రవిష్టః॥12684॥*


ఈ సంసారవృక్షమునకు 'పాపపుణ్యములు' అను రెండును విత్తనములు. వందలకొలది విషయవాసనలు దీనికి వ్రేళ్ళు. సత్త్వరజస్తమోగుణములు అను మూడును దీని కాండములు. పంచమహాభూతములనెడి ఐదును దీని పెద్దకొమ్మలు. వాటినుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనెడి (పంచతన్మాత్రలు) ఐదురసములు వెలువడును. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు, మనస్సు అనెడి పదకొండును దీని శాఖలు. జీవుడు, ఈశ్వరుడు అను పక్షియుగళముతో గూడిన హృదయమనెడి పద్మమే దీని గూడు. వాత, పిత్త, శ్లేష్మములు అనుమూడు దీని బెరడులు. ఇది భోగమోక్షములు అనెడి ఫలములను ఇచ్చును. జీవుని రూపములో నున్న ఈ పక్షి ప్రవృత్తికర్మయందు ఆసక్తమైనచో భోగము అను ఫలమును, నివృత్తికర్మయందు ఆసక్తమైనచో ముక్తి యను ఫలమును అనుభవించును. విశాలమైన ఈ సంసారవృక్షము సూర్యమండలము వరకు వ్యాపించి యున్నది. ఈ సూర్యమండలమును ఛేదించుకొని పోయెడి ముక్తపురుషులు తిరిగి సంసారచక్రమునందు చిక్కుకొనరు.


*12.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*అదంతి చైకం ఫలమస్య గృధ్రా గ్రామేచరా ఏకమరణ్యవాసాః|*


*హంసా య ఏకం బహురూపమిజ్యైర్మాయామయం వేద స వేద వేదమ్॥12685॥*

 

విషయాభిలాషగల అజ్ఞానులు దుఃఖరూప ఫలములను అనుభవించెదరు. విషయాసక్తులు కాని జ్ఞానులు మోక్షరూపఫలమును పొందుదురు. పరమహంసలైన మహాత్ములు సకలరూపములలోను అద్వితీయ బ్రహ్మనే దర్శింతురు. వేదములలోని ఈ సారాంశమును ఎరిగినవారే యథార్థముగా వేదవిదులు.


*12.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏవం గురూపాసనయైకభక్త్యా విద్యాకుఠారేణ శితేన ధీరః|*


*వివృశ్చ్య జీవాశయమప్రమత్తః సంపద్య చాత్మానమథ త్యజాస్త్రమ్॥12686॥*


ఉద్ధవా! నీవు ఈ విధముగా ధీరుడవై, అనన్యభక్తి పూర్వకముగా గురువును ఉపాసించినచో జ్ఞానసంపన్నుడవు అగుదువు. పిమ్మట సావధానముగా జ్ఞానరూపకుఠారము (పరశువు) చేత జీవభావమును ఛేదింపుము (త్యజింపుము). ఆత్మస్వరూపుడనైన నన్ను పొందిన పిమ్మట ఆ జ్ఞానరూప సాధననుగూడ త్యజింపుము.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ద్వాదశోఽధ్యాయః (12)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి* అను పండ్రెండవ అధ్యాయము (12)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: