8, అక్టోబర్ 2021, శుక్రవారం

జ్యోతిషం_ధర్మశాస్త్రం

 #జ్యోతిషం_ధర్మశాస్త్రం 


#రేపటినుండే_దేవీనవరాత్రులు (6 అక్టోబర్, బుధవారం)


              చాలామంది నవరాత్రులను పంచాంగం లో ఆశ్వయుజమాసం ప్రారంభమైనరోజున, పాడ్యమి ఉదయకాలమునకు 1లేక 2 ఘడియలు ఉన్నా , ఆరోజు నుండే ప్రారంభిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఈ పద్ధతి 16 వ శతాబ్దానంతర ధర్మశాస్త్ర గ్రంధాలలో మాత్రమే ఉన్నది. ద్వైతనిర్ణయీ అనే ధర్మశాస్త్రగ్రంధ రచయిత అయిన శంకరభట్టు తన గ్రంధంద్వారా ఈ తప్పుడు పద్ధతి ప్రారంభించాడు. ఈయన అనుయాయులైన విష్ణుభట్టు (పురుషార్థ చింతామణి), కమలాకరభట్టు ( నిర్ణయ సింధు) మొదలైనవారు ఈ పాటనే పాడారు. 16 వ శతాబ్దం ముందు రాయబడిన ధర్మశాస్త్రగ్రంధాలలో వేనిలోనూ ఇలా లేదు. 12 వ శతాబ్దపు ధర్మశాస్త్రకారులైన #హేమాద్రి , 13 వ శతాబ్దపు #మాధవాచార్యులు ( కాలమాధవం) మొదలైనవారు నవరాత్రులను #నక్తవ్రతం గా పేర్కొన్నారు. 

నక్తవ్రతమంటే - పగలు ఉపవాసముండి రాత్రి పూజానంతరం భోజనము చేయడం. 


         నక్తవ్రతానికి నియమం ఏమిటంటే, తిథి ప్రదోష సమయానికి ఉండాలి. ఏ రోజు ఎక్కువ ఉంటే ఆరోజే ఉపవాసముండాలి. అందువలన, నవరాత్రులను పాడ్యమి ఘడియలు ప్రదోషానికి ఉన్నరోజునే ప్రారంభించాలి. అసలు ఏ ఉపవాసానికైనా ( ఏకభుక్తం, నక్తం,ఉపవాసం, అయాచితం) అమావాస్యతో కలిసిన తిథికే పవిత్రత గానీ, విదియ తో కలిసినది అపవిత్రము అని సాధారణ ధర్మశాస్త్రనియమం. 

#ఏకాదశీ_తథాషష్ఠీ_అమావాస్యా_చతుర్థికా। 

#ఉపోష్యాః_పరసంయుక్తాః_పరాః_పూర్వేణసంయుతాః ॥ 

అందువలన అమావాస్య తో కూడిన పాడ్యమినాడే ఉపవాసముండాలి. అందువలననే #కాలమాధవం లో మాధవాచార్యులు ( విద్యారణ్యులు) -

#ఏతేషు_సర్వేషువచనేషు_ప్రతిపదః_పూర్వవిద్ధాయాః_పూజ్యత్వం_ప్రతీయతే అని స్పష్టంగా చెప్పారు. 


#పురుషార్థచింతామణి కారుడైన విష్ణుభట్టు నవరాత్రులకు ఉపవాసమనేది గౌణమే కానీ ప్రధానం కాదనీ, విద్యారణ్యుల వచనాలు మనం పట్టించుకోనక్కరలేదనీ రాసాడు. ఆ విధంగా తన తప్పుడు నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేసాడు. హైందవసామ్రాజ్య స్థాపకులూ , శృంగేరీ జగద్గురువులూ నైన విద్యారణ్యులను పట్టించుకోనక్కరలేదట ! ఈ రాతలు కలిపురుషప్రేరేపణలు కాక మరేమిటి? 


📌#అసలు_నవరాత్రులప్పుడు_ఏమి_చేయాలి? 


దీనికి సమాధానం #దేవీభాగవతం లో నారదమహర్షి శ్రీరామచంద్రమూర్తి కి ఇలా తెలియజేసాడు -

#నవరాత్రోపవాసంచ_భగవత్యాఃప్రపూజనమ్। 

#సర్వసిద్ధికరం_రామ_జపహోమవిధానతః॥ 

                               3వస్కంధం , 30అ-19శ్లో

   అందువలన ఉపవాసం ముఖ్యమని తెలుస్తోంది. 


📌#అయితే , #భాద్రపద_అమావాస్య నాడు #సంకల్పం ఎలా #నవరాత్రులకు ఎలా చెబుతాం ? 


జ్యోతిషశాస్త్రానుసారం పాడ్యమి సాయంత్రం వస్తుంటే, ఉదయం అమావాస్య ఘడియలలో పాడ్యమి సంకల్పం ఎలా చెబుతామన్న ప్రశ్నకు సమాధానం - ధర్మశాస్త్రం చెప్పమన్నది కాబట్టి. 


    మీకు అర్థమయ్యేలా చెబుతాను - 

ఎవరైనా ఉగాదినాడు మరణించారనుకోండి, మృతుని పుత్రుడు అతనికి ప్రత్యాబ్దికం ఎప్పుడు పెట్టాలి? పాడ్యమికి అపరాహ్నవ్యాప్తి ఎప్పుడుంటే అప్పుడు పెట్టాలి. అంతేకదా ! 


ఒక సంవత్సరంలో ఫాల్గున అమావాస్య బుధవారం మధ్యాహ్నము 1-15 వరకూ ఉన్నది. మరునాడు గురువారం నాడు పాడ్యమి సాయంత్రం 4-30 వరకూ ఉన్నది. అపుడు ఆ మృతుని పుత్రుడు బుధవారంనాడే ప్రత్యాబ్దికం పెట్టాలి. మరి #సంకల్పం? నూతన సంవత్సర పాడ్యమి కే చేయాలి కదా! ఈ ధర్మశాస్త్ర నియమాన్నే ఆపాదించుకుని #నవరాత్రులకు కూడా #సంకల్పం చెప్పాలి. ఈ విషయాన్నే విద్యారణ్య గురువులు తమ #కాలమాధవం లో 


" వచనబలాత్ ప్రాతరేవ సంకల్పః కార్యః । తదానీం జ్యోతిశ్శాస్త్రప్రసిద్ధ ప్రతిపదభావేऽపి స్మృతిభిరాపాదితాయాః ప్రతిపత సత్త్వాత్ । "


         అందువలన నేను నా పంచాంగంలో భాద్రపద అమావాస్య నాడే నవరాత్రారంభం రాయడం జరిగింది. నేను వ్యక్తిగతంగా గత దశాబ్దకాలంనుండీ ఇలాగే చేస్తూ వస్తున్నాను. స్మార్తులే గాక, శాక్తేయులంతా రేపటి నుండే నవరాత్రులు ప్రారంభించాలని #శ్రీవిద్యార్ణవతంత్రం , #రుద్రయామళతంత్రం , #పరమానందతంత్రం , #నిత్యాతంత్రం అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. 


సర్వం శ్రీ జగదంబార్పణమస్తు 🙏

కామెంట్‌లు లేవు: