*1.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*
*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*10.16 (పదహారవ శ్లోకము)*
*ఏవమప్యంగ సర్వేషాం దేహినాం దేహయోగతః|*
*కాలావయవతః సంతి భావా జన్మాదయోఽసకృత్॥12592॥*
ప్రియమైన ఉద్ధవా! దేహాభిమానులగు జీవులందరు, దేహముతో తాదాత్మ్యతను అంగీకరించుటచే వారు తమ అజ్ఞానమువలన ఆత్మకు నానాత్వమును ఆపాదించెదరు. కాని, వాస్తవమునకు విశ్వమంతటను ఒకే ఒక ఆత్మయొక్క అఖండసత్తా వ్యాపించియున్నది. శారీరకమైన బాల్య, యౌవన, వార్ధక్యములవంటి అవస్థలు కాలప్రభావముతో ప్రతిక్షణము మార్పుచెందుచు, మృత్యుముఖమున ప్రవేశించుచున్న సంగతి సమస్త ప్రాణులకు అనుభవైకవేద్యమే. కావున, ప్రాపంచికమైన దేహ-గేహముకల భార్యాబిడ్డలూ, ప్రాణి-పదార్థములు మున్నగువాటియందు అహంకార - మమకారములను కలిగియుండక వైరాగ్యమును పొందుటకు ప్రయత్నింపవలెను.
*10.17 (పదిహేడవ శ్లోకము)*
*అత్రాపి కర్మణాం కర్తురస్వాతంత్ర్యం చ లక్ష్యతే|*
*భోక్తుశ్చ దుఃఖసుఖయోః కో న్వర్థో వివశం భజేత్॥12593॥*
కర్మలను ఆచరించుటలో వాటి ఫలములను పొందుటలో జీవులు పరతంత్రులే. కాని, వారికి స్వాతంత్ర్యము ఉన్నట్లు గోచరింపదు. ఒక వేళ సుఖ-దుఃఖాదుల అనుభవమునందు స్వాతంత్ర్యమే ఉండినచో, లోకమునందు దుఃఖము ఎవరు కోరుకొందురు? కోరి దుఃఖములపాలు ఎందుకయ్యెదరు? కావున సంసారముపట్ల ఉపరతిని పొంది, వైరాగ్యముద్వారా మోక్షమును సాధించుటకై ప్రయత్నింపవలెను.
*10.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*న దేహినాం సుఖం కించిద్విద్యతే విదుషామపి|*
*తథా చ దుఃఖం మూఢానాం వృథాఽహంకరణం పరమ్॥12594॥*
*10.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*యది ప్రాప్తిం విఘాతం చ జానంతి సుఖదుఃఖయోః|*
*తేఽప్యద్ధా న విదుర్యోగం మృత్యుర్న ప్రభవేద్యథా॥12595॥*
లోకములో గొప్ప విద్వాంసులైన కొందరు మానవులకు కొంచమైనా సుఖము కలుగుటలేదు. అట్లే ముర్ఖులగువారికి దుఃఖము కొంచమైనా లేకుండుట కనబడుచున్నది. కావున, ఏవిధమైన అహంకారమును కలిగియుండుటయును వ్యర్థమే. ఒక వేళ సుఖమును పొంది, దుఃఖమును తొలగించుటను తెలిసినవారు కూడా సాక్షాత్తుగా మృత్యుముఖమునుండి తప్పించుకొను ఉపాయమును ఎంతమాత్రమూ ఎరుగరుకదా!
*10.20 (ఇరువదియవ శ్లోకము)*
*కో న్వర్థః సుఖయత్యేనం కామో వా మృత్యురంతికే|*
*ఆఘాతం నీయమానస్య వధ్యస్యేవ న తుష్టిదః॥12596॥*
వధ్యస్థానమునకు తీసికొనిపోబడిన వ్యక్తికి ఈసంపదలుగాని, భోగములుగాని ఏమి సుఖమును ఇచ్చును? అట్లే మృత్యుముఖమునకు చేరినవానికి ఈ భోగములుగాని సంపదలుగాని సంతోషమును చేకూర్చునా?
*10.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*శ్రుతం చ దృష్టవద్దుష్టం స్పర్ధాసూయాత్యయవ్యయైః|*
*బహ్వంతరాయకామత్వాత్కృషివచ్చాపి నిష్ఫలమ్॥12597॥*
ఉద్ధవా! లౌకిక సుఖములవలె పారలౌకిక సుఖములు గూడ దోషయుక్తములే. ఏలయన అక్కడగూడ పరస్పర కలహములు సంభవించుచుండును. అచట ఎక్కువ సుఖమును అనుభవించువారి యెడల తక్కువ సుఖములను అనుభవించు వారికి స్పర్థయుండును. అట్లే వారి గుణములను దోషములుగా ఎంచుచుందురు. ఎక్కువ సుఖములను పొందువారు తక్కువ సుఖములను పొందువారిని చులకనగా చూచుచుందురు. ప్రతిదినము పుణ్యములు క్షీణించుచుండుటచే సుఖములుగూడ తగ్గిపోయి పూర్తిగా నష్టమగును. పరలోకసుఖములు గూడ తగ్గిపోయి పూర్తిగా నష్టమగును. పరలోకసుఖముల కొరకై చేయబడు యాగాది ప్రక్రియలలోగూడ, ఋత్విజులలో అశ్రద్ధయు, కర్మలలో లోపములును ఏర్పడుటవలన యజమాని స్వర్గసుఖములను పొందుటలోను విఘ్నములు ఏర్పడుట సంభవమే. రైతుకృషి ఎంతగా ఉన్నను అతివృష్టి, అనావృష్టి మొదలగు ఈతిబాధలవలన 'పండినపంట చేతికి అందును' అను విషయముగూడ సందేహమేకదా!.
*10.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*అంతరాయైరవిహతో యది ధర్మః స్వనుష్ఠితః|*
*తేనాపి నిర్జితం స్థానం యథా గచ్ఛతి తచ్ఛృణు॥12598॥*
యజ్ఞయాగాది ధర్మములు ఎట్టి అంతరాయములు లేకుండా ఆచరింపబడినను, వాటివలన పొందబడిన ఊర్ధ్వలోకముల గతి ఎట్లుండునో తెలిపెదను వినుము.
*10.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*ఇష్ట్వేహ దేవతా యజ్ఞైః స్వర్లోకం యాతి యాజ్ఞికః|*
*భుంజీత దేవవత్తత్ర భోగాన్ దివ్యాన్ నిజార్జితాన్॥12599॥*
యజ్ఞములను ఆచరించు పురుషుడు యజ్ఞములద్వారా దేవతలను ఆరాధించి స్వర్గలోకమునకు చేరును. అచట అతడు తన పుణ్యకర్మలద్వారా ఆర్జించిన భోగములను దేవతలవలె అనుభవించును.
*10.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*స్వపుణ్యోపచితే శుభ్రే విమాన ఉపగీయతే|*
*గంధర్వైర్విహరన్ మధ్యే దేవీనాం హృద్యవేషధృత్॥12600॥*
*10.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*స్త్రీభిః కామగయానేన కింకిణీజాలమాలినా|*
*క్రీడన్ నవేదాత్మపాతం సురాక్రీడేషు నిర్వృతః॥12601॥*
తాను ఆర్జించిన పుణ్యములఫలితముగా అతడు దివ్యములైన వస్త్రాభరణములను ధరించి, తేజోవిరాజమానమైన విమానము నందు దివ్యాంగనలమధ్య విహరించును. గంధర్వులు అతని గుణగణములను గానము చేయుదురు. చిఱుమువ్వల తోరణముల గలగలలతో ఒప్పుచు కోరినరీతిగా సంచరించునట్టి విమానమున అతడు మేరుపర్వతసానువుల యందును, దివ్యములైన ఉద్యానములయందును విహరించును, ఆ సుఖములలో మునిగి, పుణ్యసమాప్తితో వాటిల్లెడి తన పతనమును గూడ అతడు గుర్తింపడు.
*10.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*తావత్ప్రమోదతే స్వర్గే యావత్పుణ్యం సమాప్యతే|*
*క్షీణపుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాలచాలితః॥12602॥*
పుణ్యఫలములు ముగియు నంత వఱకును అతడు స్వర్గసుఖములను అనుభవించును. పుణ్యములు క్షీణించిన పిమ్మట తనకు ఇష్టము లేకున్నను కాలప్రభావమున అథోలోకమున పడిపోవును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి