1, అక్టోబర్ 2021, శుక్రవారం

సాక్షీభూతుడు భగవానుడు

 కర్మల కేవల సాక్షీభూతుడు భగవానుడు అయితే ఆయనను ఆరాధించడం ఎందుకు? ...ఆచార్య వాణి వినండి.

................................

ఈ ప్రశ్న అందరినీ తొలిచే ప్రశ్న. దీనికి ఆచార్య వాణి ద్వారా నాకు దొరికిన సమాధానం మీతో పంచుకుంటున్నాను. ప్రతి వ్యక్తి తనకు నిర్దేశించిన పని చేయకుండా ఉండలేడు. చేయాలి కూడా. వీటికి భగవంతుడు సాక్షీ భూతుడు గానే ఉంటాడు. కర్మలు చేయించేది భగవానుడు కాదు. జీవుడి సుఖ దుఃఖాలకు ఆయన ఎంత మాత్రం బాధ్యుడు కాదు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలం, చెడు కర్మలు చేస్తే చెడు ఫలం జీవుడు అనుభవిస్తాడు. కర్మలు మూడు రకాలు. కర్మలు, అకర్మలు, సుకర్మలు. మనం మామూలుగా చేసుకుపోయేవి కర్మలు. చెడు తలంపుతో చేసేవి, చెడ్డ పనులు చేయడం అకర్మలు. కేవలం శక్త్యానుసారం చేసే మంచి పనులు సుకర్మలు.మూడోది మాత్రమే ఉత్తమ గతులు కలిగిస్తుంది. మరి కేవలం చూస్తూ కూర్చునేటప్పుడు భగవంతుడి ఆరాధన ఎందుకు? ఇక్కడే మనం ఆలోచించాలి. భగవంతునికి శరణాగతి చేయడం ద్వారా మనం చేసే బలమైన పాప కర్మలు క్షయం అవుతాయి. సత్వ గుణం అలవడుతుంది. అది సత్ కార్యక్రమాలకు దారితీస్తుంది. మంచి (పని) చేయడమే పుణ్యం. చెడు చేయడమే పాపం. ఏ పనీ చేసినా భగవంతుని సంతోష కోసం చేయాలి. ఆయన సంతోషమే జీవుడి సంతోషం కావాలి. కాలాన్ని బట్టే మార్పు అని మనం అనేస్తుంటాం. కాలాలుమారడం లేదు, ఋతువులు మారడం లేదు. సూర్యచంద్రుల భ్రమణం మారడం లేదు. మారుతున్నది మన మనో ప్రవృత్తే. వ్యాస భారతం పాశ్చాత్యులు తల మీద పెట్టుకుంటున్నారు. మనం వాళ్ళ సంస్క్రుతి అక్కున చేర్చుకుంటున్నాం. మరి మారుతున్నది కాలమా, మనమా? చేయాల్సింది చేయకుండా వితర్క, కుతర్కాలు చేస్తే ఫలితం సున్నే. సుకర్మలు చేస్తూ, అది కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా ఉంటూ, భగవంతునికి శరణాగతి చేయమనే భగవద్గీతలో భగవాన్ ఉవాచ. అదే కర్మ సూత్రం. భారములు నాపై ఉంచి పని చేస్తూ ఉంటే, వారి మంచి చెడ్డలు నావే, వారు నావారే, వాటిని మళ్లీ తిరిగి రాని నా ధామాన్ని చేరుస్తామని శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేసి ఉన్నారు. జీవుడా..శరణాగతి ద్వారా తరించు. ఓం పరబ్రహ్మనే నమః// ఆదూరి వేంకటేశ్వర రావు. 🙏

కామెంట్‌లు లేవు: