1, అక్టోబర్ 2021, శుక్రవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*428వ నామ మంత్రము* 1.10.2021


*ఓం పంచకోశాంతరస్థితాయై నమః*


పంచకోశముల మధ్య యందలి అధిష్ఠానదేవత అయిన శ్రీవిద్యాస్వరూపిణియై తేజరిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పంచకోశాంతరస్థితా* యను ఎనిమిదక్షరముల నామ మంత్రమును *ఓం పంచకోశాంతరస్థితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, కీర్తిప్రతిష్టలు, కైవల్య సాధనకు కావలసిన ధ్యాన నిమగ్నతయు అనుగ్రహించును.


శ్రీవిద్యాస్వరూపిణి అయిన పరమేశ్వరి పంచకోశముల మధ్యయందలి అధిష్ఠానదేవత. ఆ తల్లి పంచకోశమంత్ర దేవతల మధ్యనున్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనునవి పంచకోశములు. ఈ పంచకోశములలోని ఆనందమయకోశ స్వరూపిణి జగన్మాత గనుకనే ఆ తల్లి *పంచకోశాంతరస్థితా* యని అనబడినది. పంచకోశములలో పరమేశ్వరి సూక్ష్మరూపమున విలసిల్లుచున్నది. శ్రీచక్రమందు బిందుస్వరూపిణిగా తేజరిల్లుచున్నది. 1.శ్రీవిద్య, 2. పరంజ్యోతి, 3. పరా, 4. నిష్కళశాంభవి, 5. అజపామాతృక అను ఈ ఐదింటిని పంచకోశదేవతల నామములుగా జ్ఞానార్ణవ తంత్రమందు వివరింపబడినవి. శ్రీచక్రమునందు ఈ అయిదు దేవతలను పూజించునపుడు సృష్టిచక్రము మొదలైన చక్రములందు చుట్టును పరంజ్యోతి మొదలుకొని నలుగురు దేవతలను పూజించుతారు. ఈ ఐదు దేవతల పూజలు ప్రత్యేకముగాను, సమిష్టిగాను కూడా పూజించుదురు. ఇది అలా ఉండగా ఈ ఐదు దేవతలలో శ్రీవిద్యను మాత్రము శ్రీచక్రములోని బిందుస్థానములో పూజించుతారు. గనుక ఇట్టి పంచకోశమలలోపలి భాగమందు అమ్మవారు ఉన్నది గనుక ఆ తల్లి *పంచకోశాంతరస్థితా* యని అనబడినది. అదే విధముగా సకల శరీరములందు అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అను అయిదుకోశములు ఒకదానిలో ఒకటి సంచులవలె నున్నవి. అది ఎలాగ అంటే:-


అన్నమయకోశంలో ప్రాణమయకోశం ఉంటుంది.


 ప్రాణమయకోశంలో మనోమయకోశం ఉంటుంది.


మనోమయకోశంలో విజ్ఞానమయకోశం ఉంటుంది.


విజ్ఞానమయకోశంలో ఆనందమయకోశం ఉంటుంది. 


*ఆనందమయకోశంలో ఉండునదే పరబ్రహ్మ*. అట్టి పరబ్రహ్మమే శ్రీమాత. గనుకనే ఆ అమ్మ *పంచకోశాంతరస్థితా* యని అనబడినది.


ఈ విషయములో దూర్వాసమహర్షి ఈ విధముగా అనెను "ఓ తల్లీ! అన్న, ప్రాణ, మనో, బుద్ధి, ఆనందములు ఐదును శిరస్సు, రెక్కలు, తోక, ఆత్మ, దేహములుగా ఉపనిషద్వాక్యములచే వివరింపబడి ప్రసిద్ధములైన పంచకోశములతో నీవు జ్యోతిస్స్వరూపముగా దాగియున్నావు. ఆ విషయం తెలిసికొనినవాడు పరబ్రహ్మమును తెలిసినవానిగా చెప్పవచ్చును". అందుచే అమ్మవారు *పంచకోశాంతరస్థితా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పంచకోశాంతరస్థితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: