1, అక్టోబర్ 2021, శుక్రవారం

సంస్కృత మహాభాగవతం

 *01.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదియవ అధ్యాయము*


*లౌకిక - పారలౌకిక సౌఖ్యములన్నియును నిస్సారములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*10.10 (పదియవ శ్లోకము)*


*యోఽసౌ గుణైర్విరచితో దేహోఽయం పురుషస్య హి|*


*సంసారస్తన్నిబంధోఽయం పుంసో విద్యాచ్ఛిదాత్మనః॥12586॥*


ఈశ్వరునిద్వారా నియంత్రింపబడు మాయాశక్తి త్రిగుణాత్మకమైనది. ఆ త్రిగుణములే పురుషున(జీవున)కు సూక్ష్మ, స్థూల శరీరములను నిర్మించుచున్నవి. పురుషుడు అజ్ఞానముచే దేహమే తానని తాదాత్మ్యమును చెందుటవలన అహంకార, మమకారములు ఏర్పడుచున్నవి. ఇట్టి దేహాభిమానము వలన అతడు సంసారమునందు బద్ధుడు అగుచున్నాడు. ఈ విధముగ పురుషునిలో కలిగిన దేహాభిమానమే ఆత్మజ్ఞానమును దూరమొనర్చును. కావున, తనలో కలిగిన ఈ అజ్ఞానమును ఆత్మవిచారముతో నశింపజేయవలెను.


*10.11 (పదకొండవ శ్లోకము)*


*తస్మాజ్జిజ్ఞాసయాఽఽత్మానమాత్మస్థం కేవలం పరమ్|*


*సంగమ్య నిరసేదేతద్వస్తుబుద్ధిం యథాక్రమమ్॥12587॥*


ఆత్మవిచారము యొక్క జిజ్ఞాసవలన తనలోనే ఉన్నట్టి అద్వయము, నిరంజనము, పరతత్త్వము అనెడు ఆత్మస్వరూపమును విశదముగా తెలిసికొనవలెను. క్రమక్రమముగా దేహాది అనాత్మవస్తువుల యందుగల సత్యత్వబుద్ధిని విడిచిపెట్టవలెను.


ఉన్నది ఆత్మ సత్తా ఒక్కటే వేరొక దానికి ఉనికి లేనేలేదు. దృశ్యజగత్తు అంతా మాయామయము. మిథ్య అని పలుమార్లు చెప్పబడినది. ఈ మాట అందరి అనుభవములో కూడా ఉన్నది. కావున, మిథ్యాభిమానము వదలిపెట్టి వైరాగ్యభావమును పొంది, స్వస్వరూపానుసంధానమనకై సాధన సలుపవలెను.


*10.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఆచార్యోఽరణిరాద్యః స్యాదంతేవాస్యుత్తరారణిః|*


*తత్సంధానం ప్రవచనం విద్యాసంధిః సుఖావహః॥12588॥*


యజ్ఞము చేయుటకు అరణి మంథనమువలన అగ్ని ఉత్పన్నమగును. ఇందులో పైన ఒకటి, క్రింద ఒకటి రెండు కర్రలు ఉండును. మధ్యలో మంథనకాష్ఠము ఉండును. అట్లే ఆత్మ విద్యయనెడి అగ్ని ఉత్పన్నమగుటకు ఆచార్యుడు ఆదియరణి (పైకర్ర), శిష్యుడు ఉత్తరారణి (క్రింద కర్ర) ఉపదేశము మంథనకాష్ఠము (మధ్య కర్ర). ఆచార్య, శిష్యుల సంధానమునుండి ఉత్పన్నమగు ఆత్మ విద్యాగ్ని సుఖావహము, అది అజ్ఞానమును రూపుమాపి పరమానందమును పంచియిచ్చును.


*10.13 (పదమూడవ శ్లోకము)*


*వైశారదీ సాతివిశుద్ధబుద్ధిర్ధునోతి మాయాం గుణసంప్రసూతామ్|*


*గుణాంశ్చ సందహ్య యదాత్మమేతత్ స్వయం చ శామ్యత్యసమిద్యథాగ్నిః॥12589॥*


ఈ విధముగా అభ్యాసము చేయగా చేయగా బుద్ధి సూక్ష్మమగును. అట్టి విశుద్ధబుద్ధి గుణములనుండి ఉత్పన్నమైన మాయను భస్మమొనర్చును. అప్పుడు ఆ గుణములవలన ఏర్పడిన సంసారమునందుగల నానాత్వముగూడ అంతరించును. అంతట ఇంధనములను పూర్తిగా భస్మమొనర్చిన పిమ్మట అగ్ని శాంతించినట్లు, గుణములను భస్మమొనర్చిన బుద్ధియు ప్రశాంతమగును. ఇట్టిస్థితిలో *వాసుదేవస్సర్వమ్* అనెడి అనుభవము లభించును. అంతట ఆత్మయొక్క అఖండసత్తా నిలిచిపోవును.


*10.14 (పదియవ శ్లోకము)*


*అథైషాం కర్మకర్తౄణాం భోక్తౄణాం సుఖదుఃఖయోః|*


*నానాత్వమథ నిత్యత్వం లోకకాలాగమాత్మనామ్॥12590॥*


*10.15 (పదిహేనవ శ్లోకము)*


*మన్యసే సర్వభావానాం సంస్థా హ్యౌత్పత్తికీ యథా|*


*తత్తదాకృతిభేదేన జాయతే భిద్యతే చ ధీః॥12591॥*


కర్మలను ఆచరించుటవలన సుఖము లభించును అని మీమాంసకులు చెప్పుచుందురు. కాని, ఈ అభిప్రాయము సరియైనదికాదు. మీమాంసకుల ప్రధాన ఆశయమగు ఈ మాటను ముందుగా ప్రస్తావించి ఇంకనూ భగవానుడు వారి గురుంచి ఇట్లు వివరించుచున్నాడు - వారు చెప్పునదేమన, కర్మలను ఆచరించువారు, వాటి ఫలములగు సుఖ-దుఃఖములను అనుభవించువారు అనేకములుగ ఉందురు. వివిధములైన దేహముల కారణముగా ఆత్మలు కూడా అనేకములని భావింతురు. వారి కర్మల ఫలితములుగా లభించెడు లోకములు, కాలములు, వాటిని ప్రస్తావించే శాస్త్రములు, వాటిని అనుసరించి లభించే దేహములు ఇవన్నింటి స్థితులు నిత్యములు. ఇంతేగాక, ఇవన్నియును యథాతథముగా ప్రవాహరూపముతో కొనసాగుచుండును. మరియు ప్రాణుల ఆకృతిభేదములతో వాటి బుద్ధులు కూడా వేర్వేరుగా ఉండును. ఈ రీతిగా వీరు విశ్వసించే నిత్యత్వమును స్వీకరించినయెడల, భగవంతుని అభిప్రాయము మేరకు వాస్తవస్థితి వేరుగా నుండుటచే వైరాగ్యము ఎట్లు కలుగును? వైరాగ్యము వినా మోక్షము లభించుటెట్లు?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: