20, మే 2022, శుక్రవారం

కాశీమశీదులో శివలింగం

 చరిత్ర 

కాశీమశీదులో శివలింగం


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-05-2022 ; సెయింట్ లూయీస్ ; యు ఎస్ ఎ


క్రీ. శ. 1823-26 మధ్య కలకత్తాలో తూర్పు ఇండియా వర్తక కంపెనీవారి అధికారిగా నుండి పరిపాలనలో ప్రధాన క్రైస్తవమతాధి హిందూ దేశమంతా తిరిగిచూసిన హెబరుగారు (Bishop Heber) తమ గ్రంథములో ఒక చిత్రమైన చరిత్రాంశాన్ని వుదాహరించారు.


1659–1707 మధ్య హిందూ దేశాన్ని పరిపాలించిన ఔరంగ జేబుచక్రవర్తి చాలా హిందూ దేవాలయాలను పడగొట్టించి వాటిపై మశీదులు కట్టించినాడని ప్రతీతి. దేవాలయ స్తంభాలతోటీ, రాళ్ళతోటీ, దూలాలతోటీ నిర్మించబడిన మశీదులు ఇప్పటికీ కాశీలో కనబడుతున్నాయి.


ఒకశివాలయాన్ని పడగొట్టి మశీదుకట్టడంలో ఆ దేవాలయంలో నుండిన అందమైన గొప్ప శివలింగాన్ని అలాగే అట్టే వుండనిచ్చి మశీదుకట్టారు. ఈశివలింగం నలభై అడుగుల ఎత్తుగల ఏకాండీశిల. దీని మీద అందమైన చెక్కడపుపని వుండేది. ఇది పూర్వం రెండు రెట్లు ఎత్తువుండేదనిన్నీ, క్రమ కమంగా భూమిలోకి దిగబడిపోతూ వున్నదనిన్నీ, అది భూమి మట్టానికి రాగానే అన్ని కులాలూ ఒక్కటైపోతాయనిన్నీ ప్రజలు అనుకుంటూ వుండేవారు.


ఈ శివలింగం మశీదులో చిక్కుపడినా హిందువులు దీనిని అతిపవిత్రంగా ఎంచి, మశీదు అధికారులను మంచి చేసుకొని, లోపలికి వెళ్ళి దీన్ని పూజిస్తూవుండేవారు. భక్తులు ఇచ్చేకానుకలలో సగంవంతు తమకు చెల్లే పద్ధతిని మశీదువారు దీనికి వప్పుకున్నారు.ఈ శివలింగం చుట్టూవున్న చెక్కడపుడని మహమ్మదీయులకు అసహ్యంగా కనబడినా పై చెప్పిన కారణంవల్ల దానిని ఏమీ చేయకుండా వుంచారు. ఇలాగా ఒక నంద సంవత్సరాలు ఈ శివలింగానికి మశీదులోనే అర్చనలు జరిగాయి. 


ఇలా వుండగా ఒక మాటు మొహరం పండుగ ఊరేగింపుల సందర్భంలో హిందువులకూ, మహమ్మదీయులకూ తగాదాలు వచ్చి దెబ్బలాటలు జరిగాయి. అది మతకలహంగా పరిణమించింది. ముసల్మానులు కొందరు ఆవేశపరులై హిందువులు అతి పవిత్రంగా పూజించే యీ శివలింగాన్ని పగులగొట్టారు. అంతట హిందువులు ఉగ్రులై దీనికి ప్రతిక్రియగా ఒక మశీదును తగులబెట్టారు. దానిమీద తురకలు  ఒక ఆవును చంపి, దాని రక్తాన్ని విశ్వేశ్వర ఆలయందగ్గర గంగానదీ జలంకన్నా అతిపవిత్రమని ఎంచి యాత్రికులందరూ స్నానపానములుచేసే 'ఇననకూప' మనే ఒక పురాతనమైన నూతిలో కలిపారు.


అంతట కత్తిపట్టగల ప్రతి హిందువూ రోషావేశంతో కత్తులూ కఠారులూ పుచ్చుకుని కనబడిన తురక వాడి పైనబడి దౌర్జన్యం చేయసాగారు. కాశీలో హిందువులే బహుసంఖ్యాకు లైనందువల్ల తురకలను రూపుమాపుతారేమో నన్నంత భయం కలిగింది.


కుంపినీఅధికారులు శీపాయీలను బయటికి తెచ్చి నిలపకపోతే ఇటు సూర్యు డటు పోయేలోపల ఊళ్ళో మశీదు లన్నింటినీ హిందువులు నేలమట్టం చేసేవారే. అయితే,హిందువుల దౌర్జన్యాన్ని అణచడానికి శీపాయీ లెంతవరకు తోడ్పడతారో అనేదికూడా అనుమానాస్పదమైన విష యంగా అధికారులకు తోచింది. కారణం ఏమిటంటే, అక్కడి శీపాయీలలో చాలామంది హిందువులు, సగంమంది బ్రాహ్మణులే. నిజంగా వాళ్ళమనసులోని సంగతి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఈ మహమ్మదీయులరక్తాన్ని చూరగొనాలనే వుందని చెప్పాలి.


ఈ తురకలపైకి పోతూవున్న జనంలో ముఖ్యులు బ్రాహ్మణులూ, యోగులు, గోసాయీలూ, బై రాగులూ మొదలైన సనాతనధర్మపరులే. వీళ్ళు తమవంటినిండా విభూతి పూసికొని 'మొగాల పైన గోపీచందనం అద్దుకొని చావుకు తెగించినందుకు తార్కాణంగా తల వెండ్రుకలు విరబోసికొని, జందెములు చేతపట్టుకొని తమతోడిహిందువులతోనూ, దేవుళ్ళతోనూ యుద్ధం చెయ్యబూనిన వారిని శాపనార్థాలు పెడుతూ వీరంతా ముందువరసలోనే వున్నారు. అయినప్పటికీ శీపాయీలు చలించలేదు. తాము ఎవరి వుప్పు తింటున్నారో ఆ కుంపినీవారి వుత్తర్వులను శిరసావహించి తమ రక్తబంధు వులు ఎదురైనాసరే తుపాకీ పేల్చడానికి ఒట్టు పెట్టుకొని సైన్యపుకొలువులో చేరిన ఈ శిపాయీలు అవసరమైతే బ్రాహ్మడి పైనకూడా తుపాకీని పేల్చడానికి సంసిద్ధులైనారు.


పైన చెప్పిన శివలింగం వుండే మశీదు ద్వారం దగ్గర కావలి కాస్తూవున్న శిపాయీలలో ఒకడు అక్కడ క్రిందపడి వున్న శివలింగాన్ని చూసి ఇలాగ అన్నాడు. “అయ్యో ! మనమెన్నడూ అనుకోనిసంగతిని చూశాము. శివలింగం శిరస్సు నేలపైకి ఒరిగింది. ఇంక కొద్దికాలంలోనే మన మంద రమూ ఒకే కులంవాళ్ళ మైపోతాము. అప్పుడు మనమతం ఏమవుతుంది?" అన్నాడు. “బహుశఃకిరస్తానీమతం అవుతుం దేమో!" అని రెండవవాడన్నాడు.


కంపెనీవారు ఇలాగ బందోబస్తు చేసినందువల్ల అల్లరి సద్దు అణగింది.

ఈ కల్లోలం అణగిన తరు వాత మళ్ళీ ఆ సంగతి తలుచుకునేటప్పటికి కాశీలోని హిందువుల గుండెలు నీరైనవి. వారికి తీవ్రమైన విషాదం కలిగింది. “పవిత్రమైన కాశీ క్షేత్రం అపవిత్రమైపోయింది. అతి పవిత్రమైన గంగాజలములో గోవుర క్తం కలిసింది. ఈ కాశీమాహాత్మ్యం పోయింది. ఇంక ఇక్కడ మోక్షం దొరకదు” అనే ఆలోచనలతో వేలకొద్ది బ్రాహ్మణులు ఉపవాసం చేస్తూ ముఖాలపైన విభూతి రేఖలతో పై మీద బట్టలు కూడా లేకుండా దుఃఖసూచకంగా గంగానదీ తీరాన్నివున్న ముఖ్యఘట్టాలకు నడిచి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకుని తలలు వంచుకొని కూచుని మళ్ళీ ఇళ్ళకు పోకుండా అక్కడనే పడివుండి ఒక మెతుకైనా తినకుండా ప్ర్రాణాల పై ఆశవిడిచి ప్ర్రాయోపవేశం చెయ్యడానికి నిశ్చయించారు. 


ఇలాగ రెండుమూడు రోజులు గడిచినవి. ఇది చూసేటప్పటికి చాలమంది మనస్సులు కరగినవి. వీళ్ళను ఓదార్చి సానుభూతి చూపిస్తే వీళ్ళకు కొంత మనశ్శాంతి కలుగుతుందని కొందరికి తోచింది. ఈ సంగతిని వీరు కాశీలోని మేజిస్ట్రేటుల చెవిని వేశారు. అంతట కుంపినీ వారి ఆంగ్లేయోద్యోగులందరూ గంగానదీ తీరానికి వెళ్ళి అక్కడి ఘట్టాలలో ఇలాగ వుపవాసం చేస్తూవున్న బ్రాహ్మణులను చూసి వగచి, తాము నివారిం చడానికి ఎంతోకష్టపడి ప్రయత్నంచినా లాభంలేక తమవశం తప్పిందని, జరిగినదానికోసం వారందరూ ఇలాగ నిష్కారణంగా బాధపడడము బాగా లేదనిన్నీ, జరిగిన అక్రమాలకు కొంత ప్రతిక్రియ జరిగించేవున్నారుకదా అందుకోసం మళ్ళీ ఇలాగ బాధ అనుభవించడం ఎందుకనిన్నీ చెప్పి, వాళ్ళను బుజ్జగించగా, వారందరూ చాలా దుఃఖించి తరువాత కొంత ఊరట చెందారు.


ఇంతటి అకృత్యం జరిగినా గంగ గంగ కాకపోదనిన్నీ, కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్ తకర్మలు జరిగిస్తే వైదికధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవచ్చుననిన్నీ న్యాయాధికారులు ఓదార్చగా వారు చెప్పిన సలహా బాగానే వున్నదని ఆఖరికి వారందరూ నిశ్చయించి, ఉపవాసాలు మాని ఇళ్ళకు వెళ్ళారు.


ఆ సమయంలో ఈ రాయబారం నడిపిన దొరలలో ఒకరైన 'బర్డు’ గారు ఆ దృశ్యం ఇప్పటికీ తనకు కన్నులకు కట్టినట్లు వున్నదని కొన్ని సంవత్సరాల తరువాత 1824 లో బిషప్ హెబరుగారికి ఈ సంగతులన్నీ చెప్పాడు.


Bishop Heber's Journal - Vol. 1 Pp. 428-32.

( కథలు - గాథలు బై దిగవల్లి వేంకట శివరావు గారి గ్రంథం నుండి )

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-05-2022 ; సెయింట్ లూయీస్ ; యు ఎస్ ఎ

కామెంట్‌లు లేవు: