20, ఆగస్టు 2022, శనివారం

ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -5

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -5


అందరూ ఆనందంలో మునక లేస్తుంటే, ఆ చిన్నపిల్లకు సిగ్గూ, ఏడుపూనూ. అయితే ఆనందం లేదా అంటే ఈ సిగ్గూ దుఃఖాలకు సమానంగా అదీ మనసులో ఉన్నదట. ముసలి వగ్గు అయిన తరువాత అంటే 50సంవత్సరాల తరువాత ఈ కథ చెప్పేటప్పుడు కూడా ఆమె ఈ మిశ్రమ భావనలతో సతమతమవుతూ అనుభవిస్తూ చెప్పారు. అదీకాక మొదట్లో తనకు అప్పట్లో తెలియని తన భర్త గొప్పదనాన్ని ఎంతో గర్వంగా కూడా చెప్పుకొన్నారు. 


శ్రీమఠానికి రాజుగారు చేసిన మర్యాదలకు శిఖరంగా పీఠం కుంభకోణానికి బయలుదేరే ముందు స్వామివారికి కనకాభిషేకం చేశారు. వారిని ఆహ్వానించడానికే డబ్బు లేదని చెప్పిన రాజుగారు స్వర్ణ పుష్పాలతో స్వామి నిండి పోయేంతవరకూ అభిషేకం చేశారు. ద్వితీయుల శ్వాస ఆశ్చర్యంతో నిలిచిపోయినంత పని అయింది. వారి ఆనందానికి అంతే లేదు. 5000 వరహాల బంగారం (సుమారు పదికిలోలు) జంబుకేశ్వరంలో చేసిన అప్పంతా ఈ బంగారంతో తీర్చి వేయవచ్చు. అలానే కుంభకోణం చేరిన వెంటనే జంబుకేశ్వరపు అప్పులు తీర్చివేశారు. మిగిలిన బంగారాన్ని నవనిధులను కాపాడే నాగుపాము వలె కాపాడుతూ వచ్చారు ఈ ద్వితీయులు. 


స్వామివారికి కూడా అమ్మవారి దయతో అప్పు తీరిందనే తృప్తి. కామాక్షి అఖిలాండేశ్వరీ అమ్మవార్ల కార్యాలు తన హయాంలో పూర్తీ చేయగలిగాననే సంతృప్తి. ఆ తరువాత రెండు మూడు సంవత్సరాల్లోనే స్వామివారు పరిపూర్ణ తృప్తి పదాన్ని పొందారు. రాజదృష్టియే దోషమంటారు. రాజుగారి చేత అత్యంతమైన మర్యాద పొందినందుననే ఈ రకంగా అయిందని ఊరిలో చెప్పుకొన్నారు. సిద్ధి పొందక ముందే స్వామివారు తమ వారసుని, తరువాతి పీఠాధిపతిని నియమించారు. వారెవరో కాదు శంకర మఠంలో పూజ చేస్తూ శ్రీమఠ ముద్రాధికారిగా తిరువడైమరుదూరులో స్థిరపడిన మన ద్వితీయుల అన్నగారి కుమారులే. 


వారు బాల్యంలోనే పాండిత్యంలోనూ, దాన ధర్మాలలో ధారాళమయిన బుద్ధి కలవారుగా ప్రసిద్ధి పొందారు. చిన్నప్పటి నుండి మహాపండితులు, దానశూరులు అయిన మహారాష్ట్ర పండితుల మధ్య పెరిగి ఉండడం వీరిలో ఈ గుణాలు పరిడవిల్లడానికి కారణమయి ఉండవచ్చు. పీఠమునకు వచ్చిన తరువాత వీరి పాండిత్యము దాన శూరత మరింత పరిడవిల్లినవి. పూజా కల్పములో చెప్పిన విధముగా ప్రతిదినము త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులను కొంగ్రొత్త ద్రవ్యములతో పూజించుట, ఔత్తరాహిక భక్షణములు వివిధములు పుష్కలముగా చేయించి నైవేద్యములు చేసి, మహా సంతర్పణాదులు చేయించుట, పేదలకు అన్న వస్త్రాది దానములెన్నో చేయుట, విద్వత్సదస్సులు, శాస్త్ర గోష్ఠులు జరిపించి శాస్త్ర విచారమూ పండిత సన్మానాదులు చేయుట, మొదలుగా గల మహత్కార్యములలో కాలము గడపజొచ్చినారు. 64వ ఆచార్యుల వలె వీరు ఆజానుబాహువులు కానప్పటికీ, తేజో గాంభీర్య విశేషము చేత శీఘ్రముగానే సర్వ జన ప్రియులయినారు. వీరి మూలముగనే శ్రీమఠము రెండవ తూరి ఖైదు అయినది. ఖైదు చేసినది అదే తంజావూరు సిపాయిలు. అయితే పోయినసారి రాజావారి ఆజ్ఞానుసారం జరిగింది. ఈసారి ఇంకొకరు ఆజ్ఞ చేసినారు. వారెవరో తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మన కథలో ముఖ్య పాత్ర. శ్రీమఠమే ఊపిరిగా జీవిస్తున్న ద్వితీయులే పోయిన సారి మార్గమధ్యంలో మఠం నిర్బంధించబడినది. ఏ కారణాన ఈ ద్వితీయులే సాహసానికొడిగట్టారని మీకు ఉత్సుకతగా ఉన్నది కదా!


ధనం విలువ, దాని ఆవశ్యకత. అది లేనందువల్ల పడవలసిన కష్టములు తెలిసిన వారు కదా. ఈ ద్వితీయులు? క్రొత్త స్వామి ఆదాయవ్యయములు చూడకుండా దానధర్మములు విరివిగా చేయనారంభించారు. మధ్యకాలంలో పోగు చేయబడిన డబ్బంతా కరిగిపోయింది. తంజావూరు ఊరేగింపులో సమర్పింపబడిన వెండి అంబారీ వెండిని తొలగించి అమ్మివేసి ఆ డబ్బు కూడా దానం చేసేశారు. ద్వితీయులు ఈ క్రొత్త స్వామివారికి పూర్వాశ్రమపు పినతండ్రి అయి ఉండటాన శ్రీమఠ శ్రీకార్యం చూసేవారు చెప్పవలసిన విధంగా నైనా చెప్పజాలని సున్నితస్థితి ఏర్పడింది. ద్వితీయులు తీవ్రంగా ఆలోచించారు. స్వయంగా స్వామి వారితో తలబడితే వారికీ వీరికీ కూడా మొహమాటంగా ఉంటుంది. అందువల్ల మొరటు కార్యక్రమమే చేయాలి అనుకున్నారు. మనకోసం చేయడం లేదు. భగవత్పాద పీఠంకోసం చేస్తున్నాము. అందువలన మర్యాదాతిక్రమం చేశామనే చెడు పేరు వచ్చినా ఫరవాలేదని సిద్ధపడ్డారు.


వీరు తంజావూరు సంస్థాన ‘హేజీబు’ కదా! నేరుగా రాజావారికి మఠమునకు 12మంది సిపాయిలు కావాలని సందేశము పంపారు. రాజావారికి వీరి వాక్కు వేదవాక్కు అయినందువలన కారణమడుగకుండానే సిపాయిలను పంపారు. సాధు బ్రాహ్మణుడయిన ఈయన మిలటరీ చర్య తీసుకొన్నారు. మఠంలో మహారాజా వారిని తొలగించి వారి స్థానే సిపాయిలను నియమించారు.


సన్నిధానము వారి బాల హ్రుదయాన్నికరిగించి అబద్ధాలో నిజాలో చెప్పి వారివద్ద నుండి ద్రవ్యము సంగ్రహించే వారిని ఆపడమే వీరి ఈ ఏర్పాటులోని మర్మం. మఠంబాగుచేస్తున్నానని చెప్పుకుంటూ తానీ పని చేయడమే తప్పు. అందులో మఠసిబ్బందిని స్వామివారికి వ్యతిరేకంగా ప్రోత్సహించడం మరింత తప్పు. ఇది యోచించే రాజ సేవకులను పిలిపించారు. వారితో “నే చెప్పేవారిని తప్పించి ఇతరుల నెవరినీ లోనికి పంపరాదు” అని కట్టుదిట్టమైన ఆజ్ఞ చేశారు. సిపాయిల పహారా అనగానే స్వామి వద్ద వంచన మాటలతో మోసపుచ్చి ద్రవ్యం సంగ్రహించి వారు భయపడతారు కదా అని ఆయన అభిప్రాయం. ఈ నడవడి చూసి ఊరంతా గడగడలాడింది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: