20, ఆగస్టు 2022, శనివారం

మోక్షం

 మోక్షం 

మన హిందూ ధర్మం ప్రతి మనిషి ఎందుకు జన్మించాడు అనే విషయన్ని కూలంకుషంగా పరిశీలించి ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏమి ఏమి చేయాలో పేర్కొనటం జరిగింది.  అదే పురుషార్ధంగా తెలిపారు అంటే పురుషుడు (ఇక్కడ పురుషుడు అంటే కేవలం పురుషులని కాదు అది మనుషుల అందరికి వర్తిస్తుంది) సాధించవలసిన విషయాలు అవి 1) ధర్మం,2) అర్ధం, 3) కామం, 4) మోక్షం 

1)  ధర్మం,: ప్రతి మనిషి తనకు నిర్ధేశించిన ధర్మాన్ని ఆచరించాలి.  కృష్ణ భగవానులు గీతలో నీ ధర్మం సరిగా అనుష్టానించదగినది కాక పోయిన ఇతరుల ధర్మం మేలైనది ఐయినా నీవు నీ ధర్మాన్ని ఆచరించాలి అని పేర్కొన్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 35 ।। 

గీత అధ్యాయం 3 శ్లోకం .35: ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.అనగా ఉదా : ఒక వ్యాపారస్తుడు వున్నదనుకోండి అతను వ్యాపారమే చేయాలి అంతే కానీ చక్కగా వున్నదని ఇతరులకు నిర్దేశించిన ధర్మాన్ని ఆచరించకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తన బాధ్యతను తానూ త్రికరణ శుద్ధిగా ఆచరించటం ఉత్తమం.  ఇతరుల బాధ్యతను స్వేకరించకూడదు. 

ఒక చిన్న కథతో ఈ విషయాన్ని విశదీకరిద్దాం ఒక చాకలి వానికి ఒక కుక్క మరియు గాడిద వున్నాయట.  ఆ రెంటిని  అతను వాని ఇంటి ముందు కట్టి వేసి ఉంచాడట.  ఒక రాత్రి వేళ చాకలి ఇంటికి ఒక దొంగ ప్రేవేశించాడట అది ఆ రెండు చూశాయి.  అప్పుడు గాడిద ఓ కుక్క మిత్రమా మన యజమాని ఇంటిలోనికి దొంగ ప్రవేశించాడుగా నీవు మిన్నకున్నావు ఎందుకు నీవు చూడలేదా అని అడిగింది.  దానికి కుక్క మన యజమాని నన్ను సరిగా చూసుకోవటం లేదు కావట్టి నేను మొరగను అని మొరాయించింది.  యజమానిమీద ప్రేమ వున్న గాడిద నీవు మొరగక పోతేనేమి నేను మన యజమానికి నష్టం జరిగితే నేను ఊరుకోను అని పెద్దగా అరవటం మొదలు పెట్టింది.  ఆ అరుపులకు నిద్రా భంగం అయిన ఆ చాకలి కోపంగా వచ్చి ఒక కర్రతో గాడిదను కొట్టాడు.  ఆ దెబ్బలకి గాడిద  చనిపోయింది. యజమానికి మేలు చేద్దామనుకున్న గాడిద తన చావు తానె కొనితెచ్చుకుంది.  అదే కుక్క మొరిగితే యజమాని జాగ్రత్త పడేవాడు తన సొమ్మును కాపాడుకునే వాడు.  కానీ గాడిద ప్రయతనం ఫలించక పోగా తన చావుకు తానే కారణం అయ్యింది.  ఈ కధ మనకు భగవానులు చెప్పిన శ్లోకానికి అద్దం పట్టినట్లు వుంది. 

2) అర్ధం: అనగా ధన సంపాదన చేయటం. ప్రతి మనిషి కూడా ధర్మంగా వుంటూ తనకు యోగ్యమైన దానినే పరిగ్రహిస్తూ ఉన్న దానింతో తృప్తి చెందుతూ జీవనం చేయాలి.

3) కామం: అంటే కోరికలు ధనం తో కోరికలను తీర్చుకోవచ్చు కానీ తన స్థాయిని మించిన వాటిని ఆశించకుండా ఒక ప్రణాళికా బద్దంగా కోరికలను తీర్చుకోవాలి.

4) మోక్షం:  ముందు మూడు పురుషార్ధాలను ఆచరించి చివరిదయిన మోక్షాన్ని కోరుకోవాలి.  నిజానికి మానవ జన్మ అంతిమ లక్ష్యమే మోక్షం.  ఇతర జీవులకు లేనిది మనుషులకు వున్నది బుద్ది అంటే మంచి చెడులను విచేక్షించే లక్షణం.  అది ఉండటం వలననే మనుషులు తమ విచక్షణతో తన జన్మకు లక్ష్యాన్ని నిర్దేశించుకోగలరు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే   మన మహర్షులు వారి అద్వితీయ, అపార జ్ఞ్యాన సంపదతో తెలుసుకున్న జీవిత పరమావధి మోక్షం. 

మోక్షం కోసం మనిషి మనస్సు వేదాంతం వైపు మళ్ళాలి, వేదాంతం అంటే వేదాలకు చివరన వున్న  జ్ఞ్యానం. అవే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మోక్ష జ్ఞ్యానాన్ని మనకు ప్రసాదించాయి. అవి ఆత్మానాత్మ విచేక్షణ చేసి సాధకుడు ఎలా మోక్షాన్ని సాధించాలో తెలియపరచారి 

మోక్షాన్ని కోరేవారు ముందు అనుసరించవలసినది సాధన చతుష్టయం. అవి 1. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము 2. శమదమాది షట్క సంపత్తి 3. ఇహముష్మిక ఫల భోగ విరాగం 4. వైరాగ్యము. మొదటి మూడింటిని అనుభవంలోనికి తెచ్చుకుంటే నాల్గవదైన వైరాగ్యము కలుగుతుంది.

వైరాగ్యం స్థిరంగా ఉండాలంటే ఆత్మ యొక్క ప్రత్యక్షానుభవం కావాలి. ప్రత్యక్షానుభవం కలగడానికి ఆత్మ వస్తువు కాదు. గురువు వలన తెలుసుకొన వచ్చును గదా అంటే అది పరోక్షానుభుతి అవుతుందిగాని స్వానుభవం కాదు. అట్లని గురువు అవసరం లేదా అంటే అదీ కుదరదు. తమస్సు నుండి జ్యోతిస్సు లోనికి తీసుకొని వెళ్ళేవాడే గురువు. అట్టి గురువులకు గురువైన జగద్గురువు శ్రీ ఆదిశంకరుల వారు చెప్పిన అపరోక్షానుభూతిని పొందాలి. పరోక్షానుభూతి అంటే పంచదార తియ్యగా ఉంది అని ఎవరో చెఫ్పితే నమ్మినట్లు. ఆ పంచదారను మనమే తింటే తియ్యదనం మన అనుభవంలో ఉంటుంది. కాబట్టి గురువు చెప్పిన, చూపిన మార్గంలో స్వయంగా విచారణ చేసి పొందిన స్వానుభవమే అపరోక్షానుభూతి. అది పొందాలి. దానిని స్థిరంగా ఉంచటమే మోక్షం. 

మనకు కలిగే జ్ఞ్యానం పూర్తిగా పరోక్షమైనదే అదెలా అంటే నీవు ఒక విషయాన్ని గూర్చిన జ్ఞ్యానాన్ని పొందవనుకో అది ఏ విషయమైనా కానీ అది నీ కన్నా భిన్నంగా వున్నదే.  కానీ అనుభూతులు మాత్రం ఎవరివి వారివే. ఆలా కాకుండా విషయం దానిని తెలుసుకునే వాడు ఒక్కటే అయితే అదే అపరిక్షానుభూతి అంటే అనుభూతి పొందేవాడు అనుభూతిని ఇచ్చే వస్తువు ఒకటి  అవటం. ఇది తెలుసుకోవటం చెప్పినంత సులువు కాదు.  సాధకుడు తన నిరంతర సాధనతో తెలుసుకోవలసినది మాత్రమే. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: