ఒక ప్రశ్న ఒక జవాబు
60యేళ్ళ తరువాత మన క్రియా శీలక జీవితం ముగుస్తుందా ? ఔనననే నా మిత్రులు కొందరు చర్చించుకోవడం విన్నాను.
నాకు మాత్రం అలా అనిపించటం లేదు .. భౌతికంగా మన శరీరంలో కొంత అరుగుదల ఉన్నా, మానసికంగా గొప్ప పరిణితి. పరిపక్వత మనలో ఉంటుంది ఆ వయస్సులో.. విస్త్రుతమైన జీవిత అనుభవాలు ,ప్రపంచంలో మానవుల నైజం, ఆ పాటికి మనకు బాగా అర్ధమై ఉంటాయి.
వీటి కారణంగా ఒక బుద్ధుడు, ఒక యోధుడు మనలో ఆవిష్క్రుతమౌతారు.. నా జీవితంలోని ఒక ఉదాహరణ మీకు చెబుతాను.
మా గురువుగారైన డాక్టర్ ఉప్పల లక్ష్మణ రావు గారు మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకులుగా పనిచేస్తూ ఉండేవారు.
అనుకోకుండా ఒక రోజు ఆయన శ్రీమతి మెల్లీ గారు 1965 జూనులో ఒక రోడ్దు ప్రమాదంలో మరణించారు. భార్య మరణించడం మూలాన, ఒక్కరు మాస్కోలో జీవించడం కష్టతరం కావటం వల్ల 1970 ఫిబ్రవరిలో ఆయన భారత దేశం తిరిగి వచ్చారు.. అప్పటికి ఆయన వయస్సు 72 సంవత్సరాలు.
ఆ 72 యేళ్ల ప్రాయంలో ఆయన మా బరంపురం వికాసం సాహితీ సంస్థలో చేరారు. 25 మంది యువతీ యువకుల మధ్య నేలపై చతురస్రాకారంగా కూర్చొని సాహితీ వ్యాసాంగం కొనసాగించారు. ఈ వ్యాసాంగం ఆయన తుది శ్వాస విడిచేదాకా 1985 వరకు కొనసాగింది.
పది సంవత్సరాల పాటు సంస్థ అధ్యక్షునిగా ఉంటూ రచనలు చేసారు. అనారోగ్య కారణాల వల్ల పదవిని విడిచి పెట్టినా సారస్స్వత వ్యాసాంగం కొన సాగిస్తూ వచ్చారు.
ఈ కాలంలో ఆయన అతడు - ఆమె మూడవ భాగం నవలను, నాలుగవ భాగాన్ని, రచించారు. ప్రఖ్యాత ఇండోలజిస్టు వాల్టర్ రూబెన్ జర్మన్లో రాసిన " ప్రాచీన భారత దేశంలో బానిసల స్థితిగతులు " అనే గ్రంధాన్ని తెలుగులోకి అనువదించారు. పై రెండు పుస్తకాలు విశాలాంధ్రవారు అచ్చు వేయించారు.
తెలుగునాటా సుప్రసిద్ధమైన ఆయన స్వీయ చరిత్ర " బతుకు పుస్తకం " ఈ సమయంలోనే వెలువడింది. దీన్ని ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ధారా వాహికంగా ప్రచురించారు.
" బ్రౌణ్యం నాటి తెలుగు వ్యవహారానికి నేటి తెలుగు వ్యవహారానికి తారతమ్యాన్ని ఒక వ్యాసం రూపంలో రాసారు. ఇది భారతి పత్రికలో ప్రచురించారు. ఇంతేకాదు " తెలంగాణా సాయుధ పోరాట నేపధ్యంగా " గెరిల్లా " కధ రాసారు. అందులో పార్వతి కధా నాయకురాలు.
అగ్యాత సమయాల్లో విప్లవకారులు ఎలా దాక్కుంటారో, ఎంత పకడ్బంధీగా జీవిస్తారో చిత్రీకరించారు. ఉష్ ఉష్ అని విజిల్ లాంటి సంగ్య చేస్తే అటక మీద ఇంట్లోవారికి కూడా తెలియ కుండా దాక్కొన్న ఆసామీ కిందకు దిగి వచ్చి భోజనం చేసి మళ్ళా అటక మీదకు పోతాడు.
తాను యవ్వనంలో జర్మనీలో ఒక ప్రొఫసరు గారింటికి వెళ్తున్నప్పుడు ఎదురైన సంఘటన ఆధారంగా " పెంటబండి " అనే రూపకం రాసారు.
ఒక షాపులో టెన్నిస్ రాకెట్ కొనబోతే సేల్సు గర్లుతో ఎదురైన సంభాషణ ఆధారంగా " టెన్నిస్ రాకెట్ అమ్మిన అమ్మాయి " అనే మరో రచన చేసారు.
ప్రతీ నెల మా వికాసం సమావేశాల్లో చదివిన సభ్యుల రచనల మీద సమగ్ర సమీక్ష రాసి తీసు కొచ్చి చదివేవారు. ఆ నెలలో ఒక ఉత్తమ సాహితీ ప్రక్రియని ఎన్నిక చేసేవారు. ఆ నాడు ఆయన చదివే ఆ సమీక్ష కోసం మేము ఎంతో ఆశతో ఎదురు చూసేవాళ్లం.
ఐరిష్ విప్లవకారుడు బాబీ శాండ్స్ నిరాహార దీక్ష సందర్భంగా ఆయన డైరీని తెలుగులోకి అనువదించారు. ఈ రచన మా స్ప్రుహ పత్రికలో ప్రచురించాము..
సుప్రసిద్ధ జర్మన్ కవి హెన్రిక్ హైనే స్పురణతో " ఉండండుండండి " అనే కవిత రాసారు. ఈ కవిత మకుటమే శీర్షికగా వికాసం తన రెండవ ప్రచురణ " ఉండండుండండి " కవిత సంపుటిని స్వర్గీయ పురిపండా అప్పల స్వామి గారి ముందు మాటతో వెలువరించింది.
ఇవి కాక అనేక కధలూ, కవితలూ, వ్యాసాలు రాసేరు.
ఆ నాటి కాలంలో మా యువకుల్లో గొప్ప అధ్యయనం కొనసాగుతూ ఉండేది. జీన్ పాల్ సార్త్రే, అల్బర్త్ కామూస్, జార్గె బెర్నార్ద్ షా,, ఇతర నోబుల్ ప్రైజు విన్నెర్స్ రచనలు చదువుతూ ఉండే వాళ్ళం. అస్థిత్వవాదం, నిహిలిజం, డాడాఇజం, లాంటి అనేక వాదాల చర్చ జరుగుతూ ఉండేది. ఎప్పటి కప్పుడు లక్ష్మణ రావు గారు వాటి గురించి సమగ్ర విశ్లేషణ రాసి తీసు కొచ్చి సమావేశంలో చదివేవారు.
చీలీలో ప్రజలతో ఎన్నికైన అల్లెండే ప్రభుత్వాన్ని మిలటరీ జెనరళ్ళు అమెరికా సీ ఐ యి మద్దతుతో కూల్చేసినప్పుడు అత్మ హత్యా సద్రుశంగా మరణించిన మహాకవి నెరూడా స్మ్రుతిలో ఎన్నో నెరూడా కవితల్ని తెలుగులోకి అనువదించి మా సమావేశంలో చదివి వినిపించారు.
చీలీ మీద ఆనాడు నేనొక కవిత రాసాను అన్న ప్రేమతో ఫాసిజాన్ని వ్యతిరేకించే పోస్టర్లు నాకు తెచ్చి ఇచ్చారు.. నేను నజ్రూలు బిద్రోహీ క్యాసెట్టు మీటింగులో వినిపించితే నజ్రూలు కవిత్వం బెంగాలీలో రాసిన పుస్తకం కలకత్తా నుంచి తెప్పించి నా కిచ్చారు.
ఏనాడు ఆయన నన్ను గానీ, మా సభ్యుల్ని గానీ " నువ్వు " అని ఏక వచనంలో సంభొదించి ఎరుగరు. ఎల్లప్పుడూ " మీరు " అనేవారు. ఆయన అలా సంబోదిస్తున్నప్పుడు వయస్సులో, గ్యానంలో ఎంతో చిన్న వారిమైన మేము ఎంతో సిగ్గు పడేవాళ్లం. ఆయన సంస్కారం అంత గొప్పది.
ఆయన ఎం. ఏ పీ.హెచ్. డీ (ఎడింబర్గ్ ), డాక్టర్ ఆఫ్ సైన్సు. మొగ్గ అంకురించడంలో కాంతి పాత్ర అనే అంశంపై డాక్టరేటు చేసారు.
స్ప్రసిద్ధ వ్రుక్ష శాస్త్రవేత్త సర్ జగదీసు చంద్ర బోసు దగ్గర కూడా ఆయన పనిచేసారు. అలీఘర్ ఉనివర్సిటీలో, కాకినాడ p.r. కళాశాలలో అధ్యాపక వ్రుత్తి కొన్నాళ్ల పాటు నిర్వహించారు. సుప్రసిద్ధ బీ. ఎన్నర్. రైల్వే సమ్మే సందర్భంగా ఆనాటి ం వహించిన మాజీ రాష్ట్రపతి వీ. వీ. గిరిగారి దాగ్గర సమ్మె ముగిసేవరకూ ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసారు.
భార్య మెల్లీ షోలింగరుతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. గాంధీ గారి ఆశ్రమంలో కొన్నాళ్ళున్నారు. మన శ్రీకాకుళంలో 2-3 సంవత్సరాలు భార్యా సమేతంగా ఉండి మేలి రకం ఖద్దరుపై పరిశోధనలు చేసారు. ఆంధ్ర ప్రదేష్ వర్కింగ్ జర్నలిస్ట్ అస్సొసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు, నా మిత్రుడు అయిన శ్రీ నల్లి ధర్మా రావు గారి దగ్గర ఆయన శ్రీకాకుళం లో జీవించిన కాలం నాటి వివరాలున్నాయి.
ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రం కోసం ప్రాయోపవేశం చేసిన అమరజీవి పొట్టి శ్రీ రాములు గారు ఈ దంపతులకు గొప్ప సన్నిహితుడు. సబర్మతీ ఆశ్రమంలో ఉన్నప్పుడు వీరి మధ్య స్నేహం కుదిరింది.మెల్లీగారు బెజవాదలో నివశిస్తున్నప్పుడు శ్రీరాములు గారు తమ స్వగ్రామానికి వెళ్తూ విధిగా బెజవాడలో ఆమె ఇంటిలో బస చేసేవారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా జీవితాల్లో మాకు ఉప్పల లక్ష్మణరావు గారి లాంటి మేధావి, గొప్ప వ్యక్తి సహచర్యం ఒక దశాబ్దానికి పైగా లభించింది. ఇది మా అద్రుష్టంగానే నాలాంటి వాళ్లం భావిస్తాము.
.మా ద్రుష్టిలో వయస్సు ఒక సంఖ్య మాత్రమే. షష్ఠి పూర్తి కావటం మరో ఉజ్జ్వల అధ్యాయానికి ప్రారంభం మాత్రమే.
ఇదే మా గురువుగారినుంచి శిష్యరికంలో మేము నేర్చుకున్నాం.
కావున చింత వలదు, నిరాశ వలదు, నిస్ప్రుహ ,నిర్వేదం ఒకోసారి మబ్బులా ఆవరించినా మన క్రుషితో తొలగిపోతుంది. నిత్య చైతన్యంతో బ్రతుకుదాం, ఏమంటారు ?
విజయ్ చంద్ర.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి