20, సెప్టెంబర్ 2022, మంగళవారం

లైట్ భోజనం

 *లైట్ భోజనం*


ఎప్పుడొచ్చినా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొస్తారు, భోజనానికి ఎప్పుడూ ఉండరు....అనే మా చిన్ననాటి స్నేహితుడి భార్య మరీ నిష్టూరమాడుతుంటే చెప్పాను.


భోజనానికి పిలిస్తే ఎందుకు రాం. కానీ మా భయమల్లా మేం వస్తున్నామంటే మీరు పొద్దున్నే నాలుగింటికి లేచి బోల్డన్ని వెరైటీలు చేస్తారు. మీ కష్టం చూడలేకే మీ ఇంటికి భోజనానికి రావట్లేదు మేం. సరే ఇన్నిసార్లు పిలిచారు కాబట్టి మా షరతులు ఒప్పుకుంటేనే వస్తాం...అన్నాను.


సరే చెప్పండి. మీరు ఎలా అంటే అలాగే అన్నారావిడ.


సరే చెప్పాను. మరీ ఎక్కువ కాకుండా లైట్గా మామిడికాయ పప్పు, సాంబారు అంతే. అంతకు మించి ఇంకేమీ వద్దు. ఇక మీరు గుత్తొంకాయ కూర బాగా చేస్తారని మీ ఆయన చెప్తుంటాడు, కాబట్టి అదొకటే. ఇహ చిన్నచిన్నవంటారా.. ఏదో మరీ ఎక్కువ కాకుండా ఓ గుప్పెడు చల్ల మిరపకాయలు, రెండు అప్పడాలు.


ఇహ మీ అత్తగారు పెట్టిన గుమ్మడికాయ వడియాలు నాలుగు. నాకు గారెలు అంత ఇష్టం ఉండవు కాబట్టి మీకు గారెలు చేసే బాధ లేదు. ఏవో నాలుగంటే నాలుగు ఆవడలు, మరీ పెద్దవి కాకుండా చపాతీ సైజులో రెండంటే రెండు బొబ్బట్లు, ఇక మీ అమ్మగారు మీతోనే ఉన్నారు కాబట్టి ఆవిడ తరం పులిహోర అంతే. మా చిన్నప్పుడు మీ అత్తగారు దద్దోజనం, చక్రపొంగలి చేసి పెట్టేవారు. ఒకసారి ఆవిడని ఫోనులో అడిగి కొంచెం కొంచెం చెయ్యండి. 


యే పదార్థం అయినా ఎక్కువ చేసేసి తర్వాత ఇంటికి కూడా పట్టుకెళ్ళండి అని బలవంతం చెయ్యొద్దు. ఇక మీకు తెలుసుగా నేను ఆవకాయలు తినను. అందుకని కొంచెం మామిడి+కొబ్బరి కలిపిన పచ్చడి, రెండో పచ్చడి గురించి నాకు ఎక్కువ పట్టింపు లేదు, మీరు ఏదంటే అదే. ఇక భోజనానంతరం గులాబ్జామ్. 


ఇక ఇంత కంటే ఒక్కటి ఎక్కువ చేసినా వచ్చిన వాళ్ళం వచ్చినట్టే వెళ్ళిపోతాం మరి మీ ఇష్టం అని నిష్కర్షగా చెప్పాను.


ఇంకో విషయం మర్చిపోయానండీ...మీకు తెలుసుగా నేను ఉదయం 11 గంటలకే భోజనం చేసేస్తా. అందుకని ఉదయం 10 తర్వాత కాఫీ తాగను. మేం పొద్దున్నే 7 కల్లా వచ్చేస్తాం. మరి మా ఆవిడకి కూడా ఏదో ఒకపని చెప్పండి. వూరికే కూర్చుంటే ఎలా. మీరు ఫిల్టర్ వేసి, మంచి పాలు తెప్పించి ఆ కాఫీల వ్యవహారం ఆవిడకి ఇవ్వండి. స్నేహితులం అయి మేం ఆ మాత్రం సాయం చెయ్యొద్దూ అన్నాను.


తర్వాత చాలా సార్లు వాళ్ళింటికి వెళ్ళాం కానీ భోజనం ప్రస్తావన లేదు ఎందుకో తెలియదు మరి.

కామెంట్‌లు లేవు: