20, సెప్టెంబర్ 2022, మంగళవారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : మాతృమూర్తి 


తమ అక్కగారిని పరామర్శించడానికి వచ్చిన మహాలక్ష్మమ్మ గారు తన పుత్రునే సన్యాసిగా ముండన కాషాయదండ కమండలాదులతో కడసారిగా దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. చిదంబర అగ్నిప్రమాదం తరువాత గిణిని గుండెలకు హత్తుకొని తండ్రితో కూడా కుమారుని ఎక్కడికీ పంపనని పలికిన మాతృమూర్తి తన వెంటనే వచ్చిన కుమారుని శ్రీమఠానికి సమర్పించి తిరుగు ముఖం పట్టారు.


మహాలక్ష్మమ్మ గారికి గిణి అంటే ప్రత్యేక అభిమానం అని మనం ముందే చెప్పుకొన్నాము. చిన్నతనం నుంచీ ఆమె తma కుమారుని దగ్గర కూర్చోబెట్టుకొని అనేక పురాణ కథలు చెప్పేవారు. అనేక శ్లోకాలు నేర్పించేవారు. చిలుక పలుకుల గిణి అమ్మ చెప్పినవన్నీ ఇట్టే గ్రహించి తన రమ్యమైన కంఠంతో ఒప్పగించేవారు. అమ్మగారిది ధర్మశాస్త్రంలో గట్టి పాండిత్యమున్న నాగేశ్వర శాస్త్రి కుమార్తె అవడం వలన నిప్పులు కడిగే ఆచారము. స్వామివారి మడి మరి వారిదేనేమో. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు హేజీబు కుమారుడు. ఆయనవి రాచపోకడలు. సంగీతాలు, స్నేహాలూనూ. 


గిణికి అప్పుడ్ పదమూడేండ్లు. ఎప్పుడూ కొంగు పట్టుకొని తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ విసిగిస్తూ సంతోష పెడుతూ తననలరించే ఈ ముద్దుల తనయుడు ఈ పాలుగారే పసివాడు నిస్సంగునిగా, నిర్లిప్తునిగా జీవితాంతం సన్యాసిగా గడపబోతున్నాడా?” లొట్టలు క్రొంబొదుగులో జిలు ముట్టియగ్రుమ్ముదూడ నా చిత్తిని చేతబట్టుకొని సింహఘటాలి నెదుర్ప జూచెదో” అంటారు విశ్వనాథవారి దశరథుడు. అప్పటికి శ్రీరామునికి పదునారేండ్లు. బ్రహ్మర్షి విశ్వామిత్రుని తోడు ఉంది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మన గిణికి పట్టుమని పదమూడేండ్లు కూడా నిండలేదే! మళ్ళీ తన కుమారుని తాను కనులారా చూడలేదు. మాట్లాడలేదు. ఈ హఠాత్సంఘటనకు బిత్తరపోయారామె.


కామకోటి పీఠాచార్యుల వారికి, వారి పూర్వాశ్రమ బంధువులు, తండ్రితో సహా యావన్మందీ సామాన్య శిష్యగణంతో పాటు వచ్చి నమస్కారం చేసుకొంటారు. వారికి ప్రత్యేక మర్యాదలు ఏమీ ఉండదు. తల్లిగారు మాత్రం ఎదురుబడరు. పీఠాధిపతుల మర్యాదననుసరించి పరదేవతకు తప్పించి నమస్కరించే అవకాశం లేదు. అయితే తల్లి ఎదురుబడితే యతి అయినప్పటికీ నమస్కరించక పోతే ధర్మభంగం అవుతుంది. అందువల్లనే వారు తల్లిగారిని కలుసుకోరు. ఈ విషయం పరంపరగా శ్రీమఠంతో పరిచయమున్న మహాలక్ష్మమ్మ గారు ఎరుగుదురు. ఈ ఎరుక వారికి మరింత దిగులు కలుగజేసి ఉంటుంది.


తరువాత కాలంలో కూడా ఎవరైనా వారి ముందు శ్రీవారి ప్రస్తావన తెస్తే తల్లి తండ్రులిద్దరూ మౌనంలోకి జారిపోతుండేవారు. బహుశః తమ పుత్రుడు లోకోద్ధరణకై అవతరించిన దైవాంశ సంభూతుడని సరిపెట్టుకొన్నారేమో! పదమూడు సంవత్సరములుగా పెంచుకొన్న మమకారం, ప్రేమ ఆశలు సమూలంగా తెంపుకొని తన గారాలపట్టిని మనకై సమర్పించి వెనుదిరిగారు జగన్మాత. జీవన్ముక్తుని కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులు. వారిపై తరాలు క్రింది పదితరాలు తరించాయి. స్వామివారి కాలంలో జీవించి వారిని దర్శించిన మనందరం తరించాము.


పట్టుబట్టి అమ్మతో శ్రీమఠానికి బయలుదేరిన గిణి శ్రీమఠానికి అధిపతులుగా ఒంటరిగా మిగిలిపోయారు. తరువాతి కాలంలో చాటుగా దర్శించాలనీ, పుత్రుని వాక్యములు వినాలనీ మహాలక్ష్మమ్మగారు రెండు మూడు పర్యాయములు ప్రయత్నించారట. అది తెలుసుకొనిన స్వామివారు అర్థాంతరంగా ఆ ఊరినుంచే మకాం ఎత్తేశారట. సన్యాసాశ్రమపు నిస్సంగత్వం క్షణికంగానైనా చెదిరిపోతుందేమోనన్న ఒక healthy fear. అయితే తమ 95ఏళ్ళ వయస్సులో వారి అమ్మగారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు స్వామివారి కన్నులలో ఆ పదమూడేళ్ళ మెరుపు, మురిపం ఉత్సాహం కన్పించాయి.


1932 జూన్ 14వ తేదీన శ్రీవారు బుగ్గ గ్రామంలో విద్వద్గోష్ఠిలో మునిగి ఉన్నారు. దూరంగా చేతిలో తంతితో మఠం మేనేజర్ నిలుచుని ఉండడం గ్రహించారు. కుంభకోణం నుంచేనా టెలిగ్రాం అని అడిగారు. ఔనని సమాధానం వచ్చింది. శ్రీవారు మౌనముద్రాంకితులయ్యారు. సభ నిశ్శబ్దంగా ఉంది. స్వామి మనస్సులో ఉవ్వెత్తున లేస్తున్న భావతరంగాలు కనులనుండి బయటకు దూకటానికి ప్రయత్నిస్తున్నట్లున్నాయి. మరుక్షణంలో తమాయించుకొన్నట్లు కన్పించారు. మాతృనిర్యాణం విన్న సన్యాసి ఏం చేయాలి అని పండితులను ధీరోదాత్తమైన కంఠధ్వనితో ప్రశ్నించారు. పండితులకు విషయం అర్థం అయింది. చింతాక్రాంతులయ్యారు. స్వామివారు నిదానంగా లేచి బయలుదేరారు. శిష్యులందరూ భగవన్నామ సంకీర్తనతో సామిని అనుసరించారు. స్వామి అక్కడకు రెండు మైళ్ళ దూరంలో నున్న జలపాతంలో స్నానం చేశారు. పండితులు, పామరులు, పరివారం యావత్ శిష్యగణమూ శ్రీవారి వెనుకనే స్నానం చేశారు. మఠపక్షాన భూరిదానాలు చేయబడినవి. పదవ రోజున పెద్ద ఎత్తున అన్నదానం చేయబడింది.


శ్రీవారు అవతారం చాలించేరోజు ఉదయాన అమ్మగారి జన్మ స్థలమైన ఇచ్చంగుడి వేదపాఠశాలలో పెట్టడానికి తీసుకొని వెళుతున్న మహాలక్ష్మమ్మగారి పటం శ్రీవారి ముందుంచబడింది. అప్పటికి శ్రీవారు చాలాకాలంగా మౌనంగా, సహజ సంవిన్మయీస్థితిలో ఉన్నారు. అయినా ఆ పటాన్ని చూసి, చేతితో ప్రేమగా స్పృశిస్తూ అమ్మ అంటూ గౌరవాదరాలతో అలా ఎంతోసేపు చూస్తూనే ఉన్నారట. ఆ రోజున స్మరించిన ఇంకో విషయం తనకు సన్యాస దీక్ష ఈయబడిన కలవై శ్రీవారు ఏ ఊరిలో ఉన్నా ప్రతిరోజూ సంధ్యావందనం అయిన వెంటనే కనులు మూసుకొని ఖచ్చితంగా ఒక గంట జపం చేసేవారు. ఇది శ్రీమఠంలో ‘ఒరుగంట జపం’గా ప్రసిద్ధి. ఆ ఒక గంట జపం అయిపోయిన తరువాత కలవై వైపుకు తిరిగి నమస్కారం చేసేవారు. అక్కడి గురు పరమ గురువుల అధిష్ఠానాల మధ్య అనేక రోజులు ఆవాసం చేశారు. కలవై అంటే కలయిక అనే అర్థం కూడా ఉన్నది. ఆ రోజు పదిగంటల సమయంలో అకస్మాత్తుగా కనులు తెరిగి కలవై వైపు నమస్కారం చేసి కలవై అన్నారట. అక్కడున్న పారిషదులు శీవారు కలవై వెళ్ళాలనుకుంటున్నారేమో అనుకున్నారు. ఈవిధంగా తమ అవతార విరమణ సమయంలో స్వామి తమ జన్మకారకులయిన తమ అమ్మగారిని, పునర్జన్మ కారకులయిన గురు పరమ గురువులను స్మరించుకొన్నారు. స్వామిని మనకు ప్రసాదించిన వారు మనందరకూ నిరంతరమూ స్మరణీయులు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: