అరణ్యవాసం 14 ఏళ్లు ముగిసింది. ఇన్నేళ్ల పాటు అలుపు లేకుండా అరిచిన ఆ గొంతుకలకు ఇప్పుడు ఓ అధికారి తోడయ్యాడు. అందమైన సరస్సును అడ్డంగా ఆక్రమించుకుని ధన బలంతో మమ్మల్ని ఎవ్వడేం చేయగలరని ఎగిరిన ఆ శక్తుల మెడలు వంచాడు ఆ ఆఫీసరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తి...కళ్లు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు...అన్నీ అక్రమంగా సరస్సును చెరచి కట్టుకున్నవే. జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతున్నాయి ఇప్పుడు.
కేరళలోని అలెప్పీ జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్ సరస్సు... #Kapico రిసార్టు పేరు తెలియని వాళ్లుండరు. అంత విలాసవంతమైన రిసార్టు అది. సామాన్యులకు అసలు నో ఎంట్రీ. ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే 55 వేల రూపాయలు. ముత్తూట్ నుంచి కువైట్ దాకా పాకిన ప్రబల శక్తుల సొత్తు. సామాన్యుడు కన్నెత్తి చూసే తాహత కూడా లేని సామ్రాజ్యం. పద్నాలుగేళ్ల క్రితం ఈ సరస్సుపై పడింది వాళ్ల కన్ను. మూడెకరాల దీవిలో కట్టుకుంటామన్నారు. ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగే వాడెవ్వడని దాన్ని పదెకరాలకు పొదుముకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్య్సకారులను తొక్కి పడేశారు. కానీ ఓ ఐదుగురు కుర్రాళ్లు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్లకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై న్యాయం స్థానం అనుమతులు తెచ్చుకున్నారు.
సమస్యంతా ఇక్కడే వాటిని అమలు చేసే అధికారి ఎవ్వడు. ప్రతీ సారి ఏదో కుంటిసాకు. మధ్యలో రెండేళ్లు కొవిడ్. కానీ ఈ సారి వచ్చిన ఆఫీసరు మామూలోడు కాదు. 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలెప్పీలో అణువణువూ తిరిగినోడు. ఎవడు ఎలాంటోడో చూపులతో లెక్కగట్టే టైపు. అసలు చేతిలో సుప్రీం కోర్టు ఆర్డర్సు ఉంటే ఇంకెవ్వడికి భయపడాలి. తగ్గేదేలే. వారం రోజుల క్రితం ఆ రిసార్టు భూమినంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించేశాడు. బెదిరింపులు. పై స్థాయి నుంచి. జిల్లాకు ఎంతో మంది ఆఫీసర్లు వచ్చెళ్లారు. ఎవ్వడికీ పట్టనది నీకెందుకు తంబీ అన్నట్లు. పైగా ఈ రాష్ట్రం కూడా కాదు అని. నవ్వి ఊరుకున్నాడు ఆ ఆఫీసరు. ప్రాంతం పేరో, పలుకుబడి తోనో భయపెట్టటానికి అతనేం చిన్న ఆఫీసరు కాదుగా. ఎస్ స్వయానా ఆ జిల్లా కలెక్టర్. IAS అధికారి, మన తెలుగు తేజం #కృష్ణతేజ_మైలవరపు (Krishna Teja Mylavarapu). వరదల్లో తమతోనే ఉండి నాలుగేళ్ల క్రితం దేశమంతా అలెప్పీ వైపు చూసేలా నాటి సబ్ కలెక్టరే ఇప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్. తీరప్రాంతాన్ని అడ్డంగా దోచుకుని కోట్లకు కోట్లు దోచుకుంటున్న ఆ శక్తుల ఆటలు ఇక సాగలేదు. ఆ విల్లాలన్నీ ఇప్పుడు కుప్పకూలుతున్నాయి. అంతే కాదు ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేదు. మొత్తం ఆ ఓనర్లతోనే పెట్టిస్తున్నాడు. కూల్చే బిల్డింగ్ నుంచి ఇసుక రేణువు వెళ్లి సరస్సులో పడినా ఇత్తడై పోద్దనే మాస్ వార్నింగ్ కూడా ఇచ్చేయటంతో బిక్కచచ్చిపోయిన ఆ అక్రమార్కులు అంతా పాహిమాం అంటూ కట్టుకున్న అక్రమ కట్టడాల నుంచి కూలిన బండ రాళ్లు మోసుకుంటున్నారు. ప్రకృతి పరవశించింది. ఈ రోజో రేపో అక్కడ వర్షం పడేలా ఉంది. ఆ మన్నూ మశానం సరస్సులోకి ఎగరకుండా.
Thank You Krishna Teja IAS sir 🙏
Krishna Teja IAS
ఏం చెప్పగలం ఇంతకన్నా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి