20, సెప్టెంబర్ 2022, మంగళవారం

అహం అనే భావన

 అహం అనే భావన నాశనమైపోయినప్పుడు శ్రేష్ఠం, అఖండం అయిన సత్‌ స్వరూపం ‘నేను, నేను’ అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది’ అని ఈ శ్లోక భావం. భగవాన్‌ రమణ మహర్షి రచించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞాన గ్రంథం.. ‘ఉపదేశ సారం’లోని 20వ శ్లోకమిది. మనో నాశనం కావాలంటే ‘నేను’ అనే భావన తొలగిపోవాలని తెలిపిన రమణులు.. ఆ భావన పోయాక మిగిలి ఉండే స్థితి గురించి ఇందులో వర్ణించారు. అహం భావన పడిపోయాక మిగిలే ‘నేను’.. సత్యమైనది. అది జ్ఞాన స్వరూపం. సత్‌ రూపం. అఖండం, పరిపూర్ణం అయిన శాశ్వత వస్తువు. ఈ ‘నేను’నే రమణ మహర్షి ‘తాను’ అని వ్యవహరించేవారు. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు అన్ని భావనలు, మనస్సు అంతమైనా కూడా ప్రకాశిస్తూ ఉండేది ఇదే. కాకపోతే మనస్సు ఆ ‘నేను’లో లయమైందే తప్ప నశించలేదు కనుక..

మెలకువ రాగానే మళ్లీ మనసు, దాంతోపాటు ఈ జగత్తు, సుఖదుఃఖాలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా, విచారణతో ‘అహం’ భావనను నాశనం చేస్తే ఆ స్థానంలో తాను (ఆత్మ) ‘నేను నేను’ అని స్వయంగా ప్రకాశిస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం. ఆత్మ దర్శనం. అయితే.. ఆత్మదర్శనం అనే మాట నిజానికి పెద్ద తప్పు. ఎందుకంటే.. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. దర్శించడానికి అది దృశ్యమూ కాదు. అది మనచే చూడబడే వస్తువే అయితే.. అది పరిమితమైనదే అవుతుంది. పరిమితమైనది నశిస్తుంది. అలా నశించేది ఆత్మ కాదు. అది ఏకం, అద్వయం, సర్వవ్యాపకం. అది మనకన్నా వేరు కాదు. కనుక మనం దాన్ని వేరుగా దర్శించలేం. ఆత్మ దర్వనం అంటే.. అది ‘నేనే’ అని అనుభవం కలుగుతుందంతే.

ఆత్మదర్శనం కేవలం విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. పూజ, యజ్ఞం, దానధర్మాలు మొదలైన కర్మల వల్లగానీ, జపం, ధ్యానం మొదలైన సాధనల వల్లగానీ, ప్రాణాయామం మొదలైన ప్రక్రియల వల్ల గాని ఈ ‘అహం’భావన తొలగిపోదు. ఈ సాధనలన్నీ కొన్ని ప్రక్రియలు మాత్రమే. ‘అహం’ పుట్టుక ఎక్కడో వెతకడం (విచారణ) వల్లనే అది పడిపోతుంది. అప్పుడే ఆత్మదర్శనం. అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది. సాధకుడు సాధన చతుష్టయ సంపన్నుడై తగిన శ్రద్ధ చూపిస్తే సద్గురువు ద్వారా వేదాంత బోధ వింటూ ఉండగానే అతడికి ఈ స్థితి సద్యోఫలంగా లభిస్తుంది. ఆ అర్హత లేనివారు దాన్ని సంపాదించడానికే జపధ్యానాదులు. వాటి ద్వారా అర్హత సంపాదిస్తే అప్పుడు విచారణ చేసి, అజ్ఞానాన్ని తొలగించుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. 

ఆత్మ ఎక్కడి నుంచో రాదు. అది స్వయం వ్యక్తం. అందుకే రమణులు ‘స్ఫురతి హత్‌ స్వయం’ అన్నారు. వర్షాకాలంలో సూర్యుడు మబ్బుల వెనుక ఉండడం వల్ల వెలుగు కనిపించదు. అంతమాత్రాన సూర్యుడు లేనట్టు కాదు. ఆయనెప్పుడూ జ్వాజ్వల్యమానంగా వెలుగుతూనే ఉంటాడు. ఆత్మ కూడా అంతే. అజ్ఞానమనే మేఘాలు కప్పివేయడం వల్ల మనకు కనిపించడం లేదంతే. జ్ఞానమనే గాలి వీచినప్పుడు అజ్ఞానపు మబ్బులు తొలగి ఆత్మదర్శనమవుతుంది. అందుకే.. ‘నేనడంగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు’ అన్నారు రమణ మహర్షి.

ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?

ఈ మధ్య చాలమంది గురువులు కొంచెం పేరు సంపాదించి మీడియాలలో tvలలో కనిపిస్తూ ఆత్మసాక్షాత్కారం కలిగింది అని చెప్పుకుంటూనే పరమాత్మ ఎవరు అనే విషయాన్ని మరుగున పరచి శైవ వైష్ణవ శాక్తేయ గొడవలు సృష్టిస్తున్నారు కొందరైతే గ్రంథ రచనచేసి మరింత ప్రచారము చేసుకుంటున్నారు.

మనస్సు ఆత్మతో లయం చేయడమే ఆత్మసాక్షత్కారము అని ఒక tvగురువు ఈమధ్యనే ఒకగ్రంధంలో వ్రాశారు.

మనస్సు ని ఆత్మతో లయం చేస్తే ఇంద్రియనిగ్రహం వస్తుంది కాని ఆత్మసాక్షాత్కారం ఎలా వస్తుంది.

ఆయనచెప్పినది ఏమిటంటే ఆదినారాయణుడు వేరు సదాశివుడు వేరు శివుడువేరు విష్ణువు వేరు శంకరుడు వేరు మహేశ్వరుడు వేరు పరాశక్తి వేరు అని

శివుడే పరబ్రహ్మం అని సెలవిచ్చారు.

అత్మసాక్షాత్కారం పొందిన వాడు చెప్పే మాటలేనా ఇవి.

అత్మసాక్షాత్కారం అంటే సర్వం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడం.

ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మని పరమాత్మతో ఒక్కటి చెయ్యటం.

ఆత్మసాక్షాత్కారం అంటే మూలాధారచక్రంలో ఉన్న కుండలిని శక్తిని

మేల్కొలిపి ఆప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం దాటి సహస్రారమునకు చేర్చడం.

ఆత్మసాక్షాత్కారం పొందినవాడికి సర్వము ఒక్కటే అంతా నిరాకార నిర్గుణ నిర్వికల్ప నిర్లింగ సర్వాతీత పరబ్రహ్మస్వరూపమే ఉన్నదని తెలుసుకోవడం.

ఆ పరబ్రహ్మస్వరూపానికి ఎలాంటి పేరు లేదు ఏలాంటి గుణములు లేవు నిరాకారుడు సర్వానికి అతీతుడు లింగరహితుడు ఆపరబ్రహ్మమునే ఆదినారాయణుడు అని పరమశివుడని ఆదిపరాశక్తి అని ఎవరికి నచ్చినట్లువారు పూజిస్తారు.

ఎవరిని పూజించినా చేరేది ఒక్కరికే.

ఎవరిని స్మరించినా అది ఒక్కరినే.

నారాయణుడు శివుడు బ్రహ్మ విష్ణువు శంకరుడు వేరు వేరు కాదు ఒక్కటే ఒకేపరబ్రహ్మస్వరూపులు.

నిరాకారము(పరమాత్మ)

సాకారము(జీవాత్మ)

ఒక్కటే.

పరమాత్మ యోగమాయచే శూన్యస్థితి నుండి జీవాత్మగా మారుతున్నాడు.

జీవాత్మ యోగసాధనతో పరమాత్మలో లయమయ్యి ఆశూన్యస్థితిని చేరి పరమాత్మగా మారుతున్నాడు.

సృష్టి స్థితి లయములో స్థితి శాస్వతమైనది అదే పరబ్రహ్మస్వరూపమైన శూన్యస్థితి.

అంటే నీరాకారపరబ్రహ్మమే శాశ్వతమైన స్థితి ని పొందుతున్నాడు మిగిలినది అది ఏదైనా సరే అశాశ్వతమే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన ఆత్మసాక్షాత్కారము.

ప్రతీ జీవి పరమాత్మ(నీ యొక్క) స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము...

కామెంట్‌లు లేవు: