నమస్కార ప్రక్రియ
మనకున్న ఆస్తి అంతా నమస్కార క్రియే. భగవత్పాదుల వారు ఒకప్పుడు కనకధారా స్తోత్రంతో లక్ష్మి దేవిని ఉద్దేశించి ప్రార్థించారు. ఒక బీద బ్రాహ్మణ వనితకోసం ఈ స్తోత్రాన్ని ఆయన చెప్పారు. ఆయనకు స్వయంగా కావలసినది ఏదీ లేదు. కానీ మహాలక్ష్మిని ప్రార్థించి ఆమె దర్శనమిచ్చిన పిదప ఆమెను దేనినీ కోరకుండా ఉండడానికీ లేదు. అందుచేత ఆయన నమస్కారమనే సంపదను మాత్రం ఆమెవద్ద కోరుకుంటారు.
సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షీ
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతునాన్యే ||
కట్టకడపట ‘నాన్యే’ అన్న పదప్రయోగం చేశారు ఆచార్యులు. ‘మహాలక్ష్మీ! నేను చేసే ఈ నమస్కార క్రియను మించిన సంపద వేరే ఏదీ అక్కరలేదు. త్వద్ వందనాని ఏవ – నిన్ను ఉద్దేశించి చేసే ఈ నమస్కారము మాత్రము “మామ్ – నన్ను – అనిశం – ఎల్లప్పుడూ, కలయంతు – చేరుగాక – నాకు కలుగు గాక – నాన్యే – ఇతరము కాదు” అని ఆచార్యులు ప్రార్థించారు.
అమ్మవారికి చేసే ఆ నమస్కారం ఎటువంటిది? సంపత్కరాణి – సంపదలు కలిగించునది. సకలేంద్రియ నందనాని – అన్ని ఇంద్రియములను సంతోషపెట్టునది. సామ్రాజ్య దాన నిరతాని - అంతేకాదు ఆ నమస్కారము సామ్రాజ్యమునే ఇవ్వగల శక్తి గల యట్టిది. లలితా సహస్ర నామములలో “రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజపీఠ నివేశిత నిజాశ్రితా” – అన్న నామములున్నవి. రాజ్యమును ఇచ్చుటకునూ, తన ఆశ్రితులను రాజపీఠం అనగా సింహాసనమందు కూర్చోపెట్టుటకు అమ్మవారికి అనుగ్రహ శక్తి కలదు.
ఆ నమస్కారానికి మరొక శక్తి కలదు. అది, దురితోద్ధరణోద్యతాని – దురితములు అంటే పాపములు దురితముల నుండి ఉద్ధరించుటకు ఉద్యమించే శక్తి అంటే మన పాపములను ఆ నమస్కారం పోగొడుతుంది. దీనికి మరొక పాఠాంతరమును చూస్తున్నాం. అది “దురితాహరణోద్యతాని” వ్యాకరణ యుక్తంగా హరణ, ఆహారణ రెండూ ఒక్కటే. హరణ అంటే పోగొట్టుట, ఆహరణ అంటే తీసుకొని వచ్చుట అనే అర్థం కూడా ఉంది. అపుడు దురితములను తీసుకొని వస్తుందనే అపార్థం ఔతుంది. అందుచేత “దురితోద్ధరణోద్యతాని” అనేదే సరియైన పాఠం. ఆమె మన నమస్కార క్రియ చేత దురితములను వ్రేళ్ళతో పెకలించగలదు.
మామేవ అన్న పదప్రయోగంలోని ‘ఏవ’ అను పదమును – వందనాని అనే పదముతో కలిపి చదువుకోవాలి. వందనాని ఏవమామ్ మాత అనిశం కలయంతు – నాన్యే – అనగా ఈ వందనం మాత్రం, వేరే ఏదీ కాదు – నన్ను వచ్చి చేరుగాక అని ఆచార్యుల భావం.
ఆచార్యుల వారు ప్రశ్నోత్తర రత్నమాలికను వ్రాశారు. అందులో ప్రశ్నలు, వానికి ఉత్తరాలు వుంటాయి. అందులో ఒక ప్రశ్న; కింవిషం? విషము ఏది? అని ప్రశ్న దానికి జవాబు – “అవధీరణా గురువు” – గురువును అవమర్యాద చేయడమే విషం అని ఉత్తరం. అందులోనే మరొక్క ప్రశ్న ఉంది. పాతుం కర్ణాంజలిభిః “కిం అమృతం?” శ్రవణామృతము వుండేదేది? దానికి బదులు –“సదుపదేశం”, “కిం ఉపాదేయం?” దేనిని మనం గ్రహించ వలసినది? – “గురు వచనం. ఉపాదేయము గురువచనమే. వారి ఉపదేశములే మనకు శిరోధార్యములు. “కో గురుః? – గురువెవ్వరు?” – “యో అధిగతతత్త్వః శిష్యహి తాయోద్యతః సతతం” – గురువు తత్త్వాన్వేషణ చేసి తత్త్వజ్ఞుడై ఉండాలి. అతడు అనుభవశాలిగా ఉండవలె. అట్టి గురువు, అన్ని కాలములలోనూ శిష్యుని హితాన్ని ఉద్దేశించి పాటుపడుతూ ఉంటాడు. “శిష్యహి తాయోద్యతః సతతం”.
శిష్యుని హితమేది? అతనిని కర్మ బంధం నుండి తప్పించి, సంసార విమోచనతో అతనికి మోక్ష సౌఖ్యం కల్గించడమే గురువు చేసే హితచర్య. గురువుకు చేసే నమస్కార క్రియ శిష్యునికి ఆ హితాన్ని చేకూరుస్తుంది. గురువు యొక్క కృపాధార అనే కనకధార అతనిపై వర్షిస్తుంది. అందుచేత మనకు ఆ ఒక్క నమస్కారమనే సంపద ఉంటే చాలు. వేరే ఏదీ అక్కరలేదు.
“తస్మై శ్రీ గురవే నమః”
--- శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి గారి ‘ఆచార్యవాణి’ ప్రథమ సంపుటం నుండి
#KanchiParamacharyaVaibhavam #Paramacharya
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి