20, ఫిబ్రవరి 2023, సోమవారం

ఆహార సేవన విధి -

 ఆహార సేవన విధి  - 


    ప్రాణుల చేత ఆహారణము చేయబడును కావున ఆహారము అనబడును . సృష్టి యందలి ప్రతి ద్రవ్యము పంచభూతముల నుండియే ఏర్పడుచుండును . ఆకాశము నుండి వాయువు , వాయువు నుండి అగ్ని , అగ్ని నుండి జలము , జలము నుండి పృథ్వి , పృథ్వి నుండి ఔషధాలు , ఔషధముల నుండి అన్నము , అన్నము నుండి మనుష్యులు మొదలగు జీవకోటి ఏర్పడినట్లుగా ఉపనిషత్తుల యందు చెప్పబడినది . అందువలనే ఈ శరీరము ఆహారం నుండి ఏర్పడినదిగాను అటులనే రోగములు కూడా మనం తినే అహితములు ( మంచివి కానట్టి ) అయిన , అధిక ప్రమాణములో భుజించుచుండు , చెడిపోయిన ఆహారసేవన వలన కలుగును అని ఆయుర్వేదం నందు చెప్పబడినది. 


         ఈ విధమైన కారణముల వలెనే మన ప్రాచీనులు మనం తినే ఆహారం మితముగా , హితముగా ఉండాలని నిర్ణయం చేశారు . ఆహారము శరీరముకు పుష్టిని , బలమును , ధారణశక్తిని , ఆయుష్షును , ఉత్సాహమును , సుఖమును , తృప్తిని ఇచ్చును . శాస్త్రవిరుద్ధముగా భుజించు ఆహారం మానవులకు వివిధ వ్యాధులను చివరికి మరణాన్ని కూడా కలుగచేయును . మానవులు రోజూ 2 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి . ఈ నియమం బాలురకు , రోగులకు వర్తించదు .  ఉదయము మరియు సాయంత్రం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం లోపునే ఆహారం  తీసుకోవాలి . 


        వేడిగా ఉండు , తాజాగా ఉండు ఆహారాన్ని సేవించాలి . ఆయా ఋతువులకు మరియు ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహారాన్ని సేవించాలి . ఉదాహరణకు ఉత్తర ప్రాంతం వారు గోధుమను , దక్షిణ ప్రాంతం వారు వరి ఆహారంలో భాగంగా తీసుకోవాలి . త్వరపడి ఆహారాన్ని తినరాదు . 


               భోజన ప్రారంభమున తియ్యని పదార్దాలు తరువాత పుల్లని పదార్దాలు తరువాత కారము గల పదార్ధాలను తినాలి . చివర మజ్జిగతో తినవలెను . భోజనం చివర అరటిపండు గాని ఆయా ఋతువులలో దొరుకు పండు కాని తినవలెను . ప్రతిపూటా భోజనం చేసే ముందు 5 అల్లం ముక్కలను ఉప్పు అద్దుకొని తినాలి దీనివలన ఆకలి పుట్టును మరియు రుచిని కలిగించును . 


     మనం నిత్యం వాడే ఆహారాలలో ధాన్యాలైన బియ్యం , గోధుమలలో బియ్యం పథ్యకరమైనవి అనగా తినదగినవి త్వరగా జీర్ణం అగును . గోధుమలు తేలికగా జీర్ణం అవ్వవు . 


     పప్పు ధాన్యములను శింబీ ధాన్యములు అనెదరు . పప్పులు అన్నియు బలకరములైనను తేలికగా జీర్ణం కావు . అపానవాయువును  కలుగచేయును . మలమూత్రాలను బంధించును . బాగా జీర్ణశక్తి కలిగినవారు మాత్రమే ఎక్కువుగా వాడాలి . ముద్దపప్పుగా వాడుట కంటే వానిలో దోషములు పోగొట్టుటకై దాని యందు పులుపు , పోపు వస్తువులు కలిపి పప్పుచారు మొదలగునవి చేసివాడుట మంచిది . పప్పు ధాన్యాలలో పెసర్లు అన్నిటికంటే మంచిది . 



     మరింత విలువైన సమాచారం , ఆహారం మరియు జలపాన నియమాలు , ఔషధ నియమాల గురించి సమస్త సమాచారం , సంపూర్ణముగా నేను రచించిన గ్రంథాలలో వివరించాను . 


    


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కామెంట్‌లు లేవు: