20, ఫిబ్రవరి 2023, సోమవారం

శ్రీ వెంకయ్యస్వామి వారి జీవితం

 🙏నమస్కారం అండి 🙏

🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ* 🙏

               *అవధూత లీల*


      శ్రీ వెంకయ్యస్వామి వారి జీవితం


                 అధ్యాయం 5

                 సర్వ సమర్థుడు

                  భాగము 04


1982లో శ్రీస్వామివారు మహాసమాధి చెందారు. 1986 ఏప్రిల్ నెలలో ఆ రెడ్డి గారింట్లో వున్న ముసలాయన పరమపదించారు. ఆ ముసలాయనకు 15వ రోజు పెద్దకర్మ చేస్తూ బంధువులను, బీడ సాదలను భోజనాలకు పిలిచారు. 170 కిలోల బియ్యంతో సుమారు ఐదు వందల (170 × 3 = 510) మందికి భోజనాలు సిద్ధం చేయించారు. స్వామి పటానికి కర్పూరహారతిచ్చి వడ్డన సాగించబోయే సమయంలో వారి గ్రామంలోని ఒక సాధువు వారింటికి వచ్చారు. వెంటనే రెడ్డిగారు కర్పూరహారతి పనిని నిలిపివేసి శ్రీస్వామివారు వచ్చారు అన్నం పెట్టండి ముందు అని హారతికి ముందే వారికి భోజనము పెట్టి పంపించారు. అటు తర్వాత శ్రీస్వామివారి పటానికి హారతిచ్చి అందరికీ వడ్డన సాగించారు.


అనుకున్న దానికంటే రెట్టింపు జనం రావడంతో అన్నం, కూరలు చాలవేమోనని, అప్పుడు వండితే అకాలమౌతుందని రెడ్డిగారు చాలా గాబరా పడ్డారు. పనిబాటల వాళ్ళ ఇండ్లకు కూడా అన్నం ఇవ్వకుండా నిలిపేశారు.


కానీ 500 మందికి తయారు చేసిన భోజనాలు వెయ్యి మందికి పైగా భోంచేసారు. పోగా పదిగంపల అన్నం, దానికి తగ్గ కూరలు 400 మందికి సరిపోయే విధంగా మిగిలిపోయాయి. ఈ అద్భుతం చూచిన క్రిష్ణారెడ్డిగార్కి వాస్తవం మెరుపులా స్ఫురించింది. పూర్వం శ్రీస్వామివారు 'ఏ పొద్దయినా వస్తుండ్లయ్యా!' అన్నమాటను ఈనాడు ఈ సాధువు రూపంలో వచ్చి భోంచేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని తెలుసుకున్నాడు.


క్రిష్ణారెడ్డిగారు శ్రీస్వామివారిని హృదయ పూర్వకంగా సేవించేందుకు, ఏ ముసలాయన ఐతే అడ్డంగా వున్నారో, ఆయన మరణించాకనే శ్రీస్వామివారు వచ్చి వారి సేవలందుకొని సకల సాధు సత్పురుషులూ తన రూపమేనని నిరూపించారు.


అలనాడు ఏసుక్రీస్తు 7 చేపలతో 7 వేల మందికి భోజనం పెట్టగా ఇంకా ఏడు గంపల కూర మిగిలినట్లుంది గదా ఈ లీల!


మనం శ్రీస్వామివారిని హృదయ పూర్వకంగా సేవిస్తూ మన సర్వభారములు ఆయన పై పడవేసి విశ్రాంతిగా వుంటే వారే మన బాధ్యతలన్నీ ఎలా వహిస్తారో ఈ క్రింది లీలల ద్వారా తెలుస్తుంది. వారు 15 మనలనే కాకుండా మన వారందరి బాధ్యతలు సర్వజ్ఞుడుగా, సర్వ వ్యాపిగా, సర్వ సమర్ధుడుగా వారే నెరవేర్చడం చూస్తాము. '


చాలా కాలంగా శ్రీస్వామివారి సేవలో వున్నారు రోశిరెడ్డిగారు. ఒకనాడు శ్రీస్వామివారు 'మీ చిన్న కుమారుని పేర చీటీ వ్రాసి ఇవ్వు' అని రోశిరెడ్డిని తొందర చేశారు. ఆయన వ్రాసి ఇచ్చిన చీటీని శ్రీస్వామివారు తన తొడ క్రింద పెట్టుకొని కూర్చున్నారు. తన కుమారుని ఏదో ఆపద నుండి రక్షిస్తున్నారని అనుకున్నాడేగానీ ఏమైనదీ తెలియలేదు. మూడవనాడు ఎవరి పిలుపు లేకుండా రాజంపేట తాలూకా నుండి తన కుమారుడు శ్రీస్వామివారి దర్శనార్థం వచ్చాడు. నిండు బరువు బండి, రాజంపేట దగ్గర, కొండ నెక్కుచూ ఎద్దులు అనికేసుకొని బండి నిలిపే వీలులేక వెనుకకు దొర్లుతూ 40 అడుగుల లోతు నిట్టనిలువు కొండచరియ వెంబడి వాగులో పడిపోయింది. బండి, ఎద్దులు, మనిషికీ ఏ మాత్రం దెబ్బ తగులలేదు. ఇది కేవలం శ్రీస్వామివారి కృపయని శ్రీస్వామివారికి కృతజ్ఞతలు తెల్పి వెళ్ళడానికే తాను వచ్చానని చెప్పాడు. శ్రీస్వామివారు చీటి వ్రాయించిన సమయంలోనే. అచ్చట ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యపరచటమే గాక శ్రీస్వామివారు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వ సమర్థుడు అని అందరికీ నిరూపణ అయింది.!.... మిగిలిన భాగము రేపటికి...

*గ్రంథం:* : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర

అనధూత లీల

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 

🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ* 🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః*

*శ్రీ సాయి లీలామృతము: అధ్యాయము 27*



అట్టి స్థితి పొందినవారిని 'ఆప్తకాములు' (కోరదగినదంతా పొందినవారు) అని, 'కృతకృత్యులు' (చేయవలసినదంతా చేసివేసినవారు, ఇక చేయవలసినదంటూ ఏమీ లేనివారు) అని అంటారు. అట్టి జ్ఞానులకు, భగవంతునికి భేదమేలేదని శ్రీ కృష్ణుడు చెప్పాడు. "నేను ఈ ముల్లోకాలలోనూ ప్రయత్నం చేత చేయవలసినది, పొందవలసినదీ ఏదీ లేదు" అని గూడ చెప్పాడు. కాని పైన చెప్పినట్లు, ఎక్కువమంది ఈ లక్ష్యంతో గాక, ఆశ వల్లనో లేక భయం వల్లనో భగవంతుణ్ణి, మహాత్ములను ఆశ్రయిస్తారు. శ్రీసాయివంటి మహనీయుల కీర్తి చూచాక దానిని కోరి ఆయనను సేవిస్తారు. సాధన చేస్తారు. బ్రహ్మర్షి అనిపించుకోవాలనే విశ్వామిత్రుడు తపస్సు చేసింది - అట్టి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడం కోసంగాదు. అందువలన పతనమే కలుగుతుంది. కేవలం తాను బ్రహ్మర్షియని అంగీకరించనందుకు వశిష్టుని నూర్గురు కొడుకులనూ చంపాడు. ఇది కూడా రాక్షసుల తపస్సును పోలినదే. ఎన్ని నెరవేరినా, ఏమీ కోరనక్కరలేని స్థితి కలుగదు. కనుక వాటిని పొందడంవలన ప్రయోజనముండదని గుర్తించిన వారెవరో కొద్దిమంది మాత్రమే. యిలాంటి పొంగు క్రుంగులు లేక సృష్టియొక్క పరమ రహస్యాన్ని మాత్రమే అన్వేషిస్తారు. వారే ముముక్షువులు.

*రచన: ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు*

కామెంట్‌లు లేవు: