నాచన సోమనాథుని
కవితాశిల్పం!
‘ఉత్తర హరివంశం’లోని ఈ పద్యశిల్పంఅనల్పం. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకపోయినవారు ప్రబంధక కవులు!
మొల్ల తెనాలి రామకృష్ణులు ఈ చమత్కారాన్ని అందిపుచ్చుకున్నారు
తెనాలి రామకృష్ణకవి పేరడి
ఆతుకూరిమొల్ల శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన తెలుగు కవయిత్రి. ఆమె కృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించినప్పుడు రాయలవారిని ఈ క్రిందిపద్యం తో ప్రస్తుతించింది.
"అతడు గోపాలకుం డితడు భూపాలకుం, డెలమినాతని కన్న నితడు ఘనుడు,
అతడు పాండవ పక్షు డితడు పండితరక్షు, డెలమినాతని కన్న నితడు ఘనుడు,
అతడు యాదవపోషి ఇతడు యాచకతోషి, డెలమినాతని కన్న నితడు ఘనుడు,
అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి, డెలమినాతని కన్న నితడు ఘనుడు,
పల్లెకాతండు పుట్టణ ప్రభువీతండు
స్త్రీల కాతండు పద్మినీ స్త్రీల కితడు
సురలకాతండు తలప భూసురులకితడు
కృష్ణుడతండు శ్రీమహాకృష్ణుడితడు"
మొల్ల;
శ్రీకృష్ణునకు - కృష్ణరాయలకు మధ్య ఉండే తేడాలను చూపిస్తు శ్రీకృష్ణునికన్నా కృష్ణదేవరాయలే మిన్న అని నిరూపిస్తున్న చాటుపద్యం ఇది.
మొల్ల పద్యాన్ని విన్న వికటకవి తెనాలిరామకృష్ణుడు తనసహజధోరణిలో దానిని అనుకరిస్తూ ఈ క్రిందిపద్యం చెప్పాడని అంటారు.
బహుశః ఇదే మొట్టమొదటి పేరడి పద్యమేమో.
ఈశ్వరునితో ఎద్దుని పోలుస్తూ చెప్పిన ఈ పద్యం చూడండి.
అతడంబకు మగం డితడమ్మకు మగండె, లమినాతని కన్న నితడు ఘనుడు,
అతడు శూలము ద్రిప్పు నితడు వాలము ద్రిప్పు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,
అతడమ్మున నేయు నితడు కొమ్మున డాయు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,
అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు, నెలమినాతని కన్న నితడు ఘనుడు,
దాతయాతండు గోనెల మోత యితడు
దక్షుడాతండు ప్రజల సంరక్షుడితడు
దేవుడాతండు కుడితికి దేవుడితడు
పశుపతి యతండు శ్రీమహ పశువితండు
బాగుంది కదా!మొల్లపద్యాన్ని హేళనచేద్దామనుకున్నాడు.కానీ,
మొల్లపరిమళం దీనికి వచ్చిందా?
అభ్రంకషంబైన యాలపోతునీతండు
త్రుంచినాడీతండు పెంచినాడు
సాధు సమ్మతముగా సామజంబునితండు
గాచినాడీతండు త్రోచినాడు
బహిర్ముఖార్థమై పర్వతేశునీతండు
దాల్చినాడీతండు వ్రాల్చినాడు
ఫణపరంపరతోడి పన్నగంబు నీతండు
మెట్టినాడీతండు సుట్టినాడు
నేడు నాడును నాడును నేడు మనకు
జూప జెప్పంగ జెప్పంగ జూప గలిగె
ననుచు కొనియాడు సంయమి జనులకొదవె
రజితగిరిమీద హరిహరారాధనంబు
వర్ణించింది హరిహరనాథుణ్ని కదా! అతనెలా ఉన్నాడనుకున్నారు?
ఒకవైపు భాగమేమో బాగా ఏపుగా ఉన్న- అభ్రంకషం అంటే చాలా ఎత్తయిన- ఆలపోతును చంపిందట, ఇంకో వైపున్న రూపమేమో ఆలపోతును పెంచుకుందట. కృష్ణావతారంలో అరిష్టాసురుడనే- ఎద్దు రూపంలో వచ్చిన రాక్షసుణ్ని సంహరించింది- హరి, ఇక ఎద్దును పెంచుకునేవాడు అంటే- నంది వాహనుడైన హరుడే. అదే రూపంలో ఒకవైపు భాగమేమో సామజాన్ని, అంటే ఏనుగును కాచిందట- రక్షించాడట! ఇది గజేంద్రమోక్ష ఘట్టం. అంటే శ్రీహరి రూపం. మరోవైపు ఏనుగును తోసేశాడట- గజాసురుణ్ని చంపటం. ఈ తలనే వినాయకుడికి అతికించారు. ఇది శివరూపం. ఆ మూర్తిలో ఒకభాగం పర్వతేశుణ్ని దాల్చిన రూపమట! ఇది గోవర్ధనోద్ధరణం చేసిన కృష్ణుడిది. ఇంకోవైపు పర్వతాన్ని- అది మేరుపర్వతం, చేతిలోకి విల్లుగా చేసుకున్న శివుడిది. పడగల వరుసతో ఉన్న పన్నగాన్ని ఒకాయనేమో మెట్టాడట- ఆయన శేషతల్పం మీద పవళించిన హరి, ఇంకొకాయనేమో భుజంగాన్ని చుట్టుకున్నాడట- ఆయన కైలాసాధీశుడైన హరుడు! ఇద్దరూ కలిసిందే హరిహర రూపం. ఈవిధంగా రజతగిరి మీద హరిహరారాధనం చేసే భాగ్యం మనకు దక్కించాడు సోమన.
రెండు మూర్తులు కలిసిన రూపాన్ని, రెండు అవతారాలకు సమానంగా ఉండే అంశాలతో పోలికపెట్టాడు నాచన సోమన. అంతేనా సంస్కృత మణులు, తెలుగు పగడాలను ఒడుపుగా ప్రయోగించి మణిప్రవాళంలో రచించాడు. శివకేశవులకు ఇలా అభేదం చెప్పడంలో సోమన చూపిన ప్రతిభ అసామాన్యం కదూ!రసజ్ఞభారతి సౌజన్యంతో-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి