8, జూన్ 2023, గురువారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 84*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 84*


విడదిలో పర్వతకుడిని కలుసుకున్నాడు చాణక్యుడు. పరామర్శలూ, కుశల ప్రశ్నల అనంతరం "మా అర్ధరాజ్యం విషయం ఏం చేశారు ?" అని సూటిగా అడిగేశాడు పర్వతకుడు. 


చాణక్యుడు నవ్వి "ఆ విషయమే మనవి చెయ్యడానికి వచ్చాను. పట్టాభిషేకం మహోత్సవానికి రెండు మూడు రోజులదాకా శుభముహూర్తాలు లేవట... ముహూర్తం నిర్ణయం కాగానే అధికారికంగా పట్టాభిషేకం గురించి ప్రకటిస్తాం. ఒకే ముహూర్తంలో మీరూ, చంద్రుడూ మగధ సింహాసనంపై అభిషిక్తులవుతారు. అంతవరకూ మీరు మా విశిష్ట అతిధులు" అని చెప్పాడు వినయంగా. 


రెండు మూడు రోజుల్లోనే ముహుర్తమన్న మాట విన్నాక పర్వతకుడు శాంతించాడు. ముందు అధికారికంగా చంద్రునితో పాటు అర్థరాజ్యానికి అభిషిక్తుడైతే, ఆ తర్వాత వీలు చూసుకుని సింహాసనాన్ని పూర్తిగా ఆక్రమించుకోవచ్చు. అంతకుమించి ప్రస్తుతం చెయ్యగలిగిందేమీ లేదు. యుద్ధంలో తన వెంట తెచ్చిన సైన్యం యావత్తు తుడిచిపెట్టుకుపోయింది. కొద్ది మంది అంగరక్షకులు మాత్రమే వెంట ఉన్నారు. సామరస్యంగానే కార్యాన్ని సాధించుకోవడం మంచిది. 


"సరే ... రెండు మూడు రోజుల్లోనే అంటున్నారు గదా... అప్పటిదాకా వేచివుంటాంలెండి" చెప్పాడు పర్వతకుడు తన సోదరుడు, కుమారులను కనుసైగలతోనే సంప్రదించి. 


"శుభం..." అంటే చాణక్యుడు లేచి "అన్నట్లు, వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు మాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా మీ గౌరవార్థం ఈ రాత్రి విందు ఏర్పాటు చేశాం. సపరివార సమేతంగా తమరు తప్పక విచ్చేయాలి" అని ఆహ్వానించాడు. 


"అలాగే..." నంటూ తలవూపాడు పర్వతకుడు. 


ఆ రాత్రి విలాస మందిరంలో పర్వతకుని గౌరవార్థం ఏర్పాటైన విందుకు ఆ విజయానికి కారకులైన ప్రముఖులందరూ వచ్చారు. చాణక్యుడు విందులో ఏ పదార్థం వండించబోతున్నా "ముందు పర్వతకుల వారికి... వారే ఈ నాటి విశిష్ట అతిథి" అంటూ సేవకులను ఆదేశిస్తూ పర్వతకుని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ పొగడ్తలకు పొంగిపోతూ పర్వతకుడు పీకల దాక మద్యపానం చేశాడు. 


ఆ సమయంలో, ఆ విందుకి కాస్తంత ఆలస్యంగా వచ్చాడు రాక్షసామాత్యుడు. అతని వెంట అపురూప సౌందర్యరాశి అయినా పదహారు వత్సరాల సుందరాంగి వయ్యారాలు వలకబోస్తూ వచ్చింది. ఆ సుందరిని చూసీ చూడగానే అతిధులందరికీ మతులుపోయాయి. ఎవరికి వారే ఆ సుందరి తమది అయితే బాగుండునని ఆశపడ్డారు. అతిథులతో పాటు ఇటు చంద్రగుప్తుడూ, అటు పర్వతకుడూ మొహావేశంతో తదేకదీక్షతో ఆ సుందరాంగిని వీక్షించసాగాడు. 


చంద్రుని హావభావాలు గమనిస్తున్న రాక్షసుడు తన ఎత్తుపారనున్నందుకు లోలోపల సంతోషిస్తూ, ఆ సుందరిని చెయ్యిపట్టుకుని తీసుకువచ్చి చంద్రుని ముందు నిలిపి "కుమారా ! విందుకు ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలి. నా ఆలస్యానికి కారణం ఈ మధుశాలిని..." అని సంజాయిషి యిచ్చుకుని "మీ విజయోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకొని మీకు నా ప్రత్యేక కానుకగా ఈ మధుశాలినిని సమర్పించుకుంటున్నాను. ఈ రాత్రి ఈ సుందరిపొందులో తమరు స్వర్గసుఖాలు చవిచూడాలని నా ఆకాంక్ష" అని చెప్పాడు. 


చంద్రగుప్తుని ముఖం వికసించింది. పర్వతకుని ముఖంలో ఈర్ష్య, అసంతృప్తి వ్యక్తం అయింది. మిగతా వారంతా చంద్రుని అదృష్టానికి లోలోపలే ఈర్ష్య పడ్డారు. 


సరిగ్గా ఆ సమయంలో చాణక్యుడు కల్పించుకుంటూ "చంద్రా ! ఈనాటి ఈ విందుకు పర్వతకుల వారే మనకి విశిష్ట అతిధులు. విందులో లభించే కానుకైనా, కన్యకైనా వారికే చెందడం ధర్మం, న్యాయం" అని చెప్పాడు గంభీరంగా. 


చంద్రుని మొహం ముడుచుకుపోయింది. పర్వతకుని మొహం వికసించింది. అతడు మందహాసం చేస్తూ "చాణక్యుల వారు ధర్మస్వరూపులు. ధర్మనిర్ణయంలో వారికి వారే సాటి" ప్రశంసించాడు మద్యం మత్తులో. 


రాక్షసుడు కల్పించుకుంటూ "కావచ్చు. కానీ ఈ కానుక ప్రత్యేకంగా ప్రభువుల వారి కోసం" అంటూ నిరసన వ్యక్తం చేశాడు. 


చాణక్యుడు నవ్వి "పర్వతకుల వారు కూడా ప్రభువులే... పైగా వయస్సులో, అనుభవంలో చంద్రుని కన్నా అధికులు. అందుకే ఈ కన్య ఆ మహాపురుషునికే అనుభవొక్తం" అని స్పష్టంచేశాడు. 


ఇక అంతమందిలో మరేం మాట్లాడలేక వెర్రి మొహం వేశాడు రాక్షసుడు. కానీ ఎలాగైనా పర్వతకుని ప్రాణాలు కాపాడాలన్న దుగ్ధతో అతడిని ఎలా నిరోధించాలా అన్న ఆలోచనలో పడ్డాడు. 


"భేష్... భేష్... చాణక్యుల వారి ఆజ్ఞ శిరసావహిస్తాం.... ఈ కన్యామణిని అనుభవిస్తాం" అంటూ పర్వతకుడు లేచి మధుశాలిని భుజం మీద చెయ్యివేసి తూలుతూ ఆమెతో శయ్యామందిరానికి వెళ్లిపోయాడు. అతిథులంతా పత్వతకుని అదృష్టానికి లోలోపలే ఈర్ష్య చెందుతూ తమ తమ వసతులకి వెళ్ళిపోయారు. రాక్షసుడు కూడా చేసేదేమీ లేక తన నివాసగృహానికి బయలుదేరాడు. అక్కడ చాణక్య చంద్రగుప్తులు మాత్రమే మిగిలారు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: