20, జూన్ 2023, మంగళవారం

రాజ్యేన కిమ్

 

శుభోదయం🙏

ఉద్దండ  కవితా విహారం!

      
          ఉ:  భోజుఁడు  మంకు ,  ధర్మజుఁడు బొంకు ,  శచీపతి రంకు ,  కల్వపూ

                రాజు  కళంకు ,  దైవత ధరాజము  డొంకు , పయోధియింకు ,   అం

               భోజ భవుండు పంకు,  ఫణి భూషణ దేవుడు  సంకు ,      పద్మినీ

               రాజ హితుండు  గ్రుంకు ,  సరిరారు  గుణంబుల   నీకు  ధారుణిన్; 

                 చాటు పద్యము---  వేముల వాడ భీమకవి ; 

                                 ఇది  యొక  చాటుపద్యం. వేములవాడ  భీమకవిపేర  చెలామణీలో  ఉంది. నాకైతే  రచయిత విషయంలో అనుమానమే!  ఎందుకంటే  ఇంత సౌమ్యంగా వేములవాడ  కవిత్వం చెప్పిన దెప్పుడు? ఆ ఉద్దండత్వం  అంతగా యిందులో కాన
రాకపోవటం,  ఇలాంటిపద్యాలే  అడిదము సూరకవి  చెప్పటం  కారణాలు. పూసపాటివారి దగ్గరకు అడిదము సూరకవి బోయినప్పుడు ఆరాజుగారిని పొగడుతూ-

                      "రాజు కళంకమూర్తి,  రతిరాజు శరీర విహీను డంబికా
                       రాజు దిగంబరుండు'--- ఇలా పద్యం చెప్పాడు. మాటలతేడా తప్ప దాని శైలికీ  దీనిశైలికీ  భేదం అంతగా నాకు
కనిపించదు. ఆవిషయాలు అటుంచితే  -పద్యం మంచి భావనా పుష్ఠితో సాగింది. భావం వినండి!

             కవి పండిత పోషకుడు భోజుడున్నాడే  వట్టి మంకుపట్టుదల కలవాడు. పోనీ దేవేంద్రుడా? వాడు వ్యభిచారి. చంద్రుడా  కళంకుడు. మేరుపర్వతమా  వట్టిడొల్ల. రాముడు విరచిపారేశాడు అవలీలగా. ఇకసముద్రమా  దానికి  యింకిపోయే స్వభావం గలది.
( ఆటు పోటు లున్నాయని భావం) బ్రహ్మగారా  యెప్పుడూ బురద లోనే ఉంటాడు. (ఆయన కూర్చుండే పద్మం బురదలోనే ఉంటుందని భావం)  శంకరుడా  యెల్లవేళలా శంఖమూదుకొని తిరిగే బిచ్చగాడాయె. సూర్యని చెపుదామా ఆయన సాయంత్రానికి
అస్తమిస్తాడాయె. కాబట్టి సుగుణాలలో  నీకు  వీరెవ్వరూ సాటిరారు. అనిభావం.

వివరణము:విద్యా పోషణలో భోజుడు ప్రసిధ్ధుడు. ఈరాజుగారు అంతకన్నాగొప్పవారని చెప్పటం. ధర్మజుడు ఆడితప్పాడు. సత్యసంథతలో అతడు సరిగాడనటం. శచీపతి పరదారాభిలాషి  నీవు  వ్యభిచార దోషాతీతుడవు. ఉత్తమ శీల సంపదకలవాడవనుట. చంద్రునియందైనా కళంకం ఉందేమోకాని  నీయందు దోషములెన్ను నవకాెశములేదనుట. బ్రహ్మ పంకంలో ఉంటాడంటే ,బురద పాపానికి చిహ్నం . నీవు పాపాలు చేయనివాడవనటం. ఫణిభూషణదేవుడు శంఖధారి . జగందేవరలను  నడిచే శివునిగా భావిస్తారు. వాళ్ళు శంఖమూదుతో యింటింటా భిక్షమెత్తుతుంటారు. నీవు నీచమైన భిక్షాటనాది కృత్యరహితుడవు శంకరునికన్న మిన్న వనుట.  ఇంక తేజంలో సూర్యని పోలుచుటకు గూడా  అవకాశంలేదు. సాయంత్రమయ్యేసరకల్లా ఆయన  అస్త
మిస్తాడు. నీపరాక్రమం రేయింబవళ్ళు( యెల్లవేళలా)నీయందు కనిపిస్తుంది.

                             ఇలా  యెవరిని చూచినా యేవో  కొరతలు కనిపిస్తాయి ,కానీ  , నీయందుమాత్రం  యేకొరతా కనిపించదయ్యా!  ఉత్తమ గుణగరిష్ఠుడవు. నిన్నుబోలువారులేరని చెప్పుట ఫలితార్ధం. పొగడ్తలకు లొంగనివారుందురా? యీపద్యమును వినినరాజెవరో గాని యాకవిని  ఘనముగా సత్కరించియే యుండును.

                       " సుకవితా యద్యస్తి  రాజ్యేన కిమ్"- అన్నారుగదా పెద్దలు!

                                                        స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👌

కామెంట్‌లు లేవు: