కాఫీ విత్ మధు ☕️
విజయవాడ ఆకాశవాణి కేంద్రం
డిసెంబర్ 1న వజ్రోత్రోత్సవ సంవత్సరంలోకి ప్రవేశించింది
'రేడియో జంక్షన్'లో శబ్దమాంత్రికులు
ఇప్పుడవన్నీ జ్ఞాపకాలు. కానీ అప్పుడవి విద్వత్ జ్వలిత క్షణాలు. ఒక్కసారి ఇ కాదు, చాలాసార్లు గుర్తుకొస్తూ ఉంటాయి.
నా చిన్నతనంలో విజయవాడ
రేడియోలో బందా కనకలింగేశ్వరరావు, పింగళి లక్ష్మీకాంతం, బాలమురళీ కృష్ణ, తెన్నేటి హేమలత, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, ప్రయాగ నరసింహశాస్త్రి, వింజమూరి శివరామారావు, కందుకూరి రామభద్రరావు, ఆమంచర్ల గోపాలరావు, జి.వి.కృష్ణారావు, కూచిమంచి కుటుంబరావు, అన్నవరపు రామస్వామి, దండమూడి రామ్మోహనరావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి. కనకదుర్గ, నండూరి సుబ్బారావు, సి. రామ్మోహనరావు, ఎ.బి. ఆనంద్, లింగరాజు శర్మ మొదలైనవారి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి.
వీళ్ళలో చాలామందిని చూడను కూడా చూశాను. ఎక్కువమంది సూర్యారావు పేటలో మా మేనమామగారి ఇంటికి చుట్టుపక్కల ఉండేవారు. బందాగారు గొప్పనటులు. పౌరాణిక నాటకాలలో అనేక పాత్రలు పోషించారు. కృష్ణుడు, కర్ణుడు, బిల్వమంగళుడు ఇంకా ఎన్నెన్నో..! వారి మహత్తర నటనా జీవితం ఒక ఎత్తయితే; కూచిపూడి యక్షగానాలను, నాట్య సంప్రదాయాలను ఉద్ధరించడం మరోఎత్తు. కూచిపూడిలో 'కళాక్షేత్రం' నాట్య పాఠశాలను స్థాపించారు. కూచిపూడి నాట్య బృందాలను దేశ మంతటా తిప్పుతూ ప్రదర్శనలు ఇప్పించి కూచిపూడి నాట్యాన్ని జగద్విదితం చేశారు.
ప్రయాగ నరసింహశాస్త్రి వినోదాల వీరయ్యగా, మొద్దబ్బాయిగా రకరకాల పేర్లతో శ్రోతల్లోకి చొచ్చుకు పోయి వినోదాన్ని పంచారు. జానపద గీతాలను చక్కని చతురోక్తులతో శ్రావ్యంగా పాడి రక్తికట్టించేవారు.
ఇక గానగంధర్వుడు బాలమురళి గురించి ఎంత చెప్పినా తనివితీరదు. సంగీతమే బాలమురళిగా ఈ భూమి మీద అవతరించింది. వాళ్ల వల్ల రేడియోకి పేరు వచ్చిందా, రేడియో వల్ల వాళ్లకు పేరు వచ్చిందా? ఏమో! చెప్పలేను.
విత్తు ముందా, చెట్టుముందా లాంటి ప్రశ్న అది. ఏది ఏమైనా వాళ్ళందరూ సంగీత సాహిత్య స్రష్టలు, ద్రష్టలు. వారి వారి రంగాలలో వెలుగులు ప్రసరింపచేసినవారు.
తరువాత కాలంలో మరికొన్ని పేర్లు వినబడుతూ వచ్చాయి. వారు కూడా సంగీత సాహిత్యాది కళలను ఆపోసన పట్టిన అగస్త్యులే!. విద్యలకన్నిటికీ వెన్నెల మెరుగుగా, మెరుగు వెన్నెలగా రజని;
కర్ణాటక సంగీత విద్వాంసులు ఓలేటి, అమరావతికథల సృష్టికర్త సత్యం శంకరమంచి; తన గంభీర స్వరంతో రేడియోలో రామాయణ, భారత, భాగవతాలు వినిపించి ప్రతీ ఇంటినీ నైమిశారణ్యం చేసిన ఉషశ్రీ, ఒక్క పాటేమిటి, ఒక్క పద్యమేమిటి, నాటకమేమిటి, ఏదైనా అలవోకగా రాయగల సరస్వతీ పుత్రుడు, సంస్కృతాంధ్ర పండితుడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ;
హాస్యానికి రంగూ రుచీ వాసనలు అద్ది, తమలపాకుతో హాస్యం కానీ తలుపు చెక్కతో కాదు అని, రేడియో కోసం ప్రత్యేకంగా రెండు మూడు నిముషాలు నిడివి ఉండే సౌండ్ కార్టూన్స్ చెళుకులను గుప్పించిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు....
ఇలా ఎందరో సంగీత, సాహిత్య ప్రక్రియల ద్వారా ఆనందాన్ని కలిగించారు.
విజయవాడ ఆకాశవాణి ప్రస్థానం 1948 డిసెంబర్ 1న ప్రారంభమై అద్వితీయంగా 74 ఏళ్లపాటు సాగి వత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఆ మరపురాని మనీషులందరినీ తలుచు కోవడం మహదానందంగా ఉంది.
1972లో అంటే విజయవాడ ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమైన 28 ఏళ్ల తర్వాత రేడియోలో చేరిన నవతరం మరొకటి ఉంది. మేలిమి బంగారం లాంటి ఆ సృజనకారులలో అగ్రగణ్యుడు 'మా రాముడు'. అదేనండి! రేడియో రామం! ఇల్లలికిన ఈగలాంటివాడు. వాడి ఇంటి పేరు వాడికే గుర్తులేదు. రేడియో రామంగానే ప్రసిద్ధుడు.
స్వరాన్ని, శబ్దాన్ని ఎంత కావాలో అంతవరకే తూకం వేసి ఒడిసి పట్టుకుంటాడు. గొప్ప శబ్దమాంత్రికుడు. ఆకాశవాణి ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే నాటక, రూపక పోటీల్లో మొదటి బహుమతి వాడిదే.
రేడియో నాటకాలకు, రూపకాలకు, పిక్చర్ అండ్ సౌండ్ అనే నూతన శబ్ద ప్రక్రియకు తలుపులు, కిటికీలు తెరిచినవాడు రామం. చాలామంది సినిమా యాక్టర్లు మేము
డాక్టర్లు కాబోయీ యాక్టర్లమయ్యామంటుంటారు.
రాముడు రేడియోలో సౌండ్ ఇంజనీరు కావాలనుకుని వచ్చి మన అదృష్టం కొద్దీ ఎనౌన్సరయ్యాడు. మరో ఘనాపాటి మల్లాది సూరిబాబు. సుస్వర సంగీతలోలుడు. పాటల ఊట. రసికులు మెచ్చే పాటలు రేడియో కోసం ఎన్ని స్వరపరిచాడో లెక్కలేదు.
కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నాడు. కలగా కృష్ణమోహన్ గురించి, సుధామ గురించి కూడా మాట్లాడుకోవాలి.
కృష్ణమోహన క్కు పాటంటే ప్రాణం. స్వరాలతో ఆడుకోవడం సరదా. అతనో పాటల పూవుల వంతెన. సుధామ ఒక సాహితీ భాండాగారం, కవి విమర్శక పండితులు. ఇద్దరూ విజయవాడలో పనిచేశారు.
మా తరువాత విజయవాడ రేడియోలో చేరిన బహుముఖ ప్రజ్ఞాశాలి జయప్రకాష్. శబ్ద నాటక శిఖర మతను. రామం తరువాత ఆ వారసత్వాన్ని నిలబెడుతూ ఆకాశవాణి వార్షిక బహుమతులు ఎనిమిది గెల్చుకున్నాడు. విజయవాడ రేడియోను తలుచుకున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుచేసుకుని శిరస్సు వంచి సభక్తికంగా, సగౌరవంగా నమస్కరించ వలసిన వాచికాభినయ ప్రతిభామూర్తులు, నట దిగ్గజాలు, స్వరకర్తలు మరి కొందరున్నారు. స్వర
సామ్రాజ్ఞి శారదా శ్రీనివాసన్, నండూరి విఠల్, అద్దంకి మన్నార్, ఎన్.సి.బి జగన్నాథాచార్యులు, ఎం.వీరభద్రరావు (సినిమాల్లోకి వెళ్ళాక సుత్తి వీరభద్రరావు), గొల్లపూడి మారుతీరావు, మల్లిక్... వీళ్ళంతా విజయవాడ ఆకాశవాణి ప్రాంగణంలో నిలిచి ఎదిగిన వెలుగు దీపాలు.
విజయవాడలో 'రజని' డైరెక్టరుగా ఉన్నకాలం స్వర్ణయుగం. అప్పుడు ఆయన చుట్టూరా కవులు, గాయకులు, పండితులు ఉండేవారు. ఏదో ఒక మాట పుచ్చుకుని, పాట అందుకుని పాడుతూ ఉండేవారు.
అక్కడి చెట్లు కూడా ఆపాటకు తలలూపుతూ ఉండేవి. ఏనాటి ముచ్చట్లివన్నీ! 40 ఏళ్ళ క్రితం మాటలు. ఇటీవల వరకు పనిచేసి విజయవాడ రేడియోకు వన్నెతెచ్చిన వాళ్ళలో సి.ఎస్. రాంబాబు, మల్లేశ్వరరావు కూడా ఉన్నారు.
చిక్కని కవితలు, కథలు అల్లుతారు. ఏ సమస్యనీ, ఏ సందర్భాన్నీ వదిలిపెట్టరు. దేనినైనా చిత్రిక పట్టగలరు. నేను వార్తల మనిషిని. నాకు సహచరులుగా, సహోద్యోగులుగా, పెద్దలుగా పనిచేసిన వారిలో అతి ముఖ్యులు కొందరున్నారు. ఆర్.వి.వి.కృష్ణారావు, బి.నారాయణరావు, భండారు శ్రీనివాసరావు, కొప్పుల సుబ్బారావు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, తిరుమలశెట్టి శ్రీరాములు, డి.వెంకట్రామయ్య... వాళ్ళందరూ హృదయులు, సంస్కారవంతులు, మంచితనం మూర్తీభవించిన మూర్తిమత్వం వాళ్ళది.
ఇంకా ఏవరినైనా స్మరించకుండా వదిలిస్తే మన్నించండి! రేడియోకు అనిర్వచనీయమైన ఆకర్షణ ఉండేది. ఇందులో పనిచేసిన మాకంటే బయటనున్న వారికి సంగతి బాగా తెలుసు.
విశ్వనాథ సత్య రాయణ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, పీసపాటి నరసింహమూర్తి, విన్నకోట రామన్నపంతులు, రామచంద్ర కాశ్యప, పుచ్చా పూర్ణానందం, తుమ్మల కారామమూర్తి, ఆచంట వెంకటరత్నం నాయుడు,
గోపాలకృష్ణ, సి. రాఘవాచారి, నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ,తు ర్లపాటి కుటుంబరావు, వావిలాల గోపాల కృష్ణయ్య, చలనచిత్ర దర్శకులు జంధ్యాల, సినీనటి అన్నపూర్ణ (ఒకప్పుడు ఉమ), ఎ.వి.ఎస్. పొట్టి ప్రసాద్, గుండు హనుమంతరావు.. ఒకరా ఇద్దరా...!
విజయవాడ రైల్వేజంక్షన్ ఎలాగో రేడియో జంక్షన్ అలా!. ఇలా అందర్నీ దర్శించే భాగ్యం కలిగింది. దొరకునా ఇటువంటి సేవ!
ప్రయాగ రామకృష్ణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి