శ్రీనాధ కవితా వైభవం!
ఉ: ఎక్కడ లేరె వేల్పులు సమీప్సిత దాతలు, ముద్దుకూన ! నీ
వెక్కడ ? ఘోర వీర తపమెక్కడ ? యీపటు సాహసిక్యమున్
తక్కు ,'శిరీషపుష్ప మవధాన పరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో? విహగ మెక్కిన నోర్చునొ ? నిశ్చయింపుమా?
హరవిలాసం-- 4: ఆ: శ్రీనాధ మహాకవి!
ఓముద్దుకూనా!పార్వతీ !కోరిన కోర్కెలు దీర్చుటకు, దేవత లెందరోగలరుగదా! పరమేశ్వరుని గూర్చియే తపమేల? సుకుమారివి నీవిక్కెడ? ఘోర మైన యీకఠోర తపమెక్కడ? ఈదుస్సాహసమును వీడుము, దిరిసెనపూవుపై తుమ్మెద వ్రాలిన నోర్చునుగాని, గ్రద్దవ్రాలిన నోర్వ నేరదుగదా! యని దీనిభావము.
పార్వతి పరమేశ్వరుని భర్తగా బడయఁ గోరి తపమాచరింపఁ బోవుచు ,తండ్రి హిమవంతుని యనుజ్ఙ బడయుటకేగ, గిరిజ నిశ్చయమును విని, సుకుమారివి నీవు తపమొనరింపలేవు. ఈదుస్సాహసమున వీడుమని హిమవంతుడామెకు నచ్చజెప్పు సందర్భము.
"దిరిసెన పూవు మిగుల మృదువైనది. అది తుమ్మెద సోకు నోర్చునుగాని, బలమైన పక్షి సోకు నోర్వజాలదని చెప్పుచు, అన్యాపదేశముగా శంకరునితో నీకు పొందు అనుచితము. అనిసూచించెను.
పార్వతిని శిరీషపుష్పముతో బోల్చి యామె సుకుమార ప్రకృతిని, శంకరుని యందు విహంగోపమమును, జెప్పి యతని మొఱటుతనమును కవి నిరూపించెను.
ఈరీతిని శ్రీనాధుని కవిత్వము వ్యంగ్య వైభవ విలసితమై యొప్పారును!
నిదర్శనాలంకారము.
స్వస్తి!🙏🙏🌷🌷👌
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి