🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *పురాణ పఠనం*
. *🪐శ్రీ కృష్ణావతారం🪐*
. *101వ అధ్యాయం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*విష్ణు సేవా ప్రాశస్త్యంబు*
“ఓ శుక మహర్షి! శివుడిని సేవించే దేవతలు, మానవులు సుఖసంపదలతో జీవిస్తారు; విష్ణువును నిండు భక్తితో సేవించే మునీశ్వరులు నిరుపేదలుగా జీవిస్తారు; దీనికి కారణం ఏమిటో వివరించు.”
అలా అడిగిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “అలా ఉండటానికి కారణం చెప్తాను. ఓ పుణ్యపురుషుడా! శ్రద్ధగా విను. నీలకంఠుడు అయిన శివుడు మహాశక్తి సంపన్నుడు. సత్త్వ రజస్తమో గుణ సమేతుడు. కనుక పరమశివుడిని సేవించేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. అచ్యుతుడు, పరమాత్మ, అనంతుడు, పురుషోత్తముడు, ఆదిపురుషుడు అయిన శ్రీహరి త్రిగుణాతీతుడు. అతడిని కొలిచేవారు కూడా రాగరహితులే. వారు సంపదలను కోరరు. ధర్మరాజు రాజసూయయాగం చేసిన తర్వాత కోరి నారదాది మహర్షుల వలన ఎన్నో పుణ్యకధలు విన్నాడు. అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం, నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను, పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. “మహారాజా! ధర్మరాజా! ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో ఆ ఉత్తముడి సంపదలు సమస్తము నేను హరిస్తాను. అతడు ధనహీనుడై దుఃఖిస్తాడు. బంధువులు అతడిని వదలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది, తుదకు అవ్యయానందచిత్తుడై, సారూప్యాన్ని పొందుతాడు. అందుచేత కొందరు నన్ను సేవించటం చాలా కష్టమని అనుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు. అలా ఆరాధించి ఆ దేవతలు అనుగ్రహించిన ఐశ్వర్యాలను సత్యమైనవని అనుకుంటారు. పిమ్మట కృతఘ్నులై వారు తమకు శుభాలను అనుగ్రహించిన ఆ దేవతలనే మరచిపోతారు. దీనికి తార్కాణంగా ఒక కథ ఉంది. అది నీకు చెప్తాను. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం దానితోతెలుస్తుంది.
వృకాసురుండు మడియుట
శకుని అనే రాక్షసుని కొడుకు వృకాసురుడు. వాడు దుర్మార్గుడు. సుజనులను దారికాచి బాధించేవాడు. అలా ఒకనాడు రాక్షసుడు ఒక దారిలో దాగి ఉండి అటు వెళ్తున్న నారద మహర్షిని చూసాడు. అలా ఆ మార్గమున వస్తున్న నారదుడిని చూసి....వృకాసురుడు నారదమహర్షికి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అడిగాడు “ఓ నారద మహర్షి! నీవు అన్నీ తెలిసిన మహా ఙ్ఞానివి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందున ....తమను సేవించే భక్తులకు ఆ త్రిమూర్తులలో ఎవరు శీఘ్రంగా కోరిన వరాలిస్తారు.” అలా అడిగిన వృకాసురుని ప్రశ్నకు నారదుడు సంతోషంగా ఇలా సమాధానం చెప్పాడు.
“అయితే శ్రద్ధగా విను. దుర్గుణాలు కలవారిమీద ఆగ్రహము చూపాలన్నా, సుగుణవంతులమీద అనుగ్రహము చూపాలన్నా, వెనువెంటనే చూపే దైవం త్రిమూర్తులలో ఒక్క పరమశివుడే. ఈ సంగతి తెలుసుకున్న బాణసురుడు, రావణాసురుడు మున్నగు దానవులు పరమశివుడిని భక్తితో సేవించి మహా సామ్రాజ్య వైభవాలను పొందారు. కనుక, నీవు కూడ శివుడిని భక్తితో పూజించు. నీ అభిమతం వేగంగా ఈడేరుతుంది.” అని చెప్పాడు. వెంటనే....
వృకాసురుడు బయలుదేరి కేదారతీర్థానికి వెళ్ళాడు. అక్కడ సాహసోపేతమైన నియమాలతో నీలకంఠుని, వరదుడిని, మహేశ్వరుడిని గురించి ఘోరతపస్సు చేసాడు. ఆ తీవ్రతపస్సు చూసి లోకాలన్నీ అచ్చెరువొందాయి. తన శరీరం లోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించి అగ్నికి ఆహుతి కావించాడు. అప్పటికి కూడ మదనాంతకుడు పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. వృకాసురుడు పట్టువదలక కేదారతీర్ధంలో స్నానం చేసి మృత్యుకోరవంటి భయంకరమైన గండ్రగొడ్డలితో తన తలని నఱకుకొనుటకు సిద్ధమయ్యాడు. అంతట ఆ అగ్నికుండంలో...పరమశివుడు ఆ అగ్ని గుండంలో నుండి వెలువడి దయతో ప్రత్యక్షము అయ్యాడు. వృకాసురుని చేతిని పట్టుకుని, “సాహసించకు. నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నీ మనసులో ఎట్టి కోరికలున్నా కోరుకో. వెంటనే నెరవేరుస్తాను.” అని శివుడు అనగా, వృకాసురుడు ఎంతో సంతోషపడి, శంకరుని పాదాలపై పడ్డాడు....దానవుడు పరమశివుని పాదాలకు నమస్కరించి, “ఓ చంద్రమౌళీ! నుదుట కన్నుగల స్వామీ! నా చెయ్యి ఎవరి తల మీద పెడితే, వారు తల నూరుముక్కలు అయి చనిపోయేలా అనుగ్రహించు.” అలా అని ఆ రాక్షసుడు ప్రార్థించాడు. అది విని శివుడు చిరునవ్వు నవ్వుతూ అతడు కోరిన వరము వెంటనే ఇచ్చాడు. ఆ రాక్షసుడు పార్వతీపతి తనకు అనుగ్రహించిన వరాన్ని పరీక్షించాలనుకున్నాడు. తత్క్షణమే వరగర్వంతోవాడు అహంకరించాడు. ఆ వరం పరీక్షించడానికి సిద్ధపడి ముందుకు వచ్చి. తన చేతిని పరమశివుడి తలమీద పెట్టడానికి ఆ రాక్షుసుడు తెగించాడు. “అయ్యయ్యో నేనిచ్చిన వరం నామీదకే అపాయం తెచ్చిపెట్టిందే” అని శివుడు భయపడి పరుగెత్తాడు. వృకాసురుడు శివుడిని తరుముకుంటూ వెళ్ళాడు. ముల్లోకాలూ భీతిల్లాయి. మునులు దేవతలు కర్తవ్యం తెలియక భయకంపితులై తల్లడిల్లిపోయారు. శివుడు అలా పరగెత్తుకు వెళ్ళి......వైకుంఠపురం చూసాడు. ఆ వైకుంఠాన్ని నిరుపమాన ఆనందనిలయము అమృతపదం, పరమపదం అని ప్రసిద్ధమై నిఖిలలోకాలకూ అవతల సూర్యచంద్ర కిరణాలుసైతం ప్రవేశించటానికి వీలులేని విధంగా ఉండి, మనోఙ్ఞమైన సహజసిద్ధ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది. యోగులకూ భాగవతశ్రేష్ఠులకూ నివాసస్థలంగా అది ప్రకాశిస్తూ ఉంటుంది.
మిక్కిలి నిర్మలమైన అనంత తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. దివ్యమైన రత్నాలు, బంగారుమయమై ప్రకాశించే భవనాలు, మండపాలు, తోరణాలు, స్తంభాలు, విస్తారమైన గోపురాలుతో భాసిస్తూ ఉంటుంది ఆ వైకుంఠపురము. అలా దివ్యమైన వైకుంఠం ప్రవేశించిన శంకరుడు శ్రీమహావిష్ణువును దర్శించాడు. ఆ సమయంలో పుండరీకాక్షుడు అయిన శ్రీహరి మహా వైభవంతో ఆదిశేషుడిపై పవళించి ఉన్నాడు. తన మందహాసం అనే వెన్నెలతో లక్ష్మీదేవి కన్నులు అనే చకోరాలను అలరిస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో వినోదాలలో తేలియాడుతూ ఉండి కూడ, పరమశివుడు ఆ రాక్షసుడికి వరము ప్రసాదించి, ఆపదలపాలైన విషయాన్ని విష్ణువు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. నీలకంఠునికి వాటిల్లిన ఉపద్రవాన్ని పోగొట్టాలని హరి నిశ్చయించుకుని, లక్ష్మీదేవితో సాగిస్తున్న వినోదాలను ఆపాడు. విష్ణువు వటువు వేషం ధరించాడు. చీకటిమాను వంటి నల్లని ఛాయ గల నెమ్మేనిపై చంద్రకిరణం లాంటి తెల్లని జందెపుపోగు, బంగారు మొలత్రాడు, పసుపువన్నె గోచీ ధరించాడు. దండ కమండలాలతో, పట్టెవర్ధనంతో, పట్టుగొడుగుతో, జింకచర్మంతో, హోమం బొట్టుతో, పిలక వ్రేలాడుతుండగా, వ్రేళ్ళ మధ్యన దర్భలతో అచ్చమైన బ్రహ్మచారి అయి ముచ్చటగా దానవుడిని సమీపించాడు. అలా పరమ అద్భుతంగా అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఉన్న ఆ బాల వటువు వేషంలో ఆ వృకాసురుని దగ్గరకు వెళ్ళాడు.
బ్రహ్మచారి వేషంలో వెళ్ళిన విష్ణువు, దానవుడు వృకాసురుడికి కపట నమస్కారం చేసాడు. తియ్యని మృదు భాషణాలతో రాక్షసునితో ఇలా స్వాంతన వచనాలు పలికాడు. “అన్నా! ఇంత అలసిపోతు ఎందుకింత దూరం వచ్చావు? ఏ సుఖాలకైనా మూలమైనది ఈ శరీరమే కదా. ఊరక దానిని ఇలా ఎందుకు దుఃఖపెడుతున్నావు? ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో. ఇంతటి నీ ప్రయాసకు కారణము ఏమిటి?” అని వాడిని ప్రశ్నించాడు. ఆ వటురూపి తీయనిమాటలకు సంతోషించి, ఆ రాక్షసుడు తాను తలపెట్టిన కార్యాన్ని వివరించాడు. విష్ణుమూర్తి మందహాసంచేస్తూ ఆ రాక్షసుడితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసరాజ! మునుపు దక్షుడి శాపం వలన పిశాచాలకు అధిపతి అయ్యాడు. కనుక, శంకరుడు నిజాలు మానేసి అబద్ధాలే చెప్తున్నాడు. ఆయన గారి చేష్టలు మాకేమీ కొత్తకాదులే. శివుని విషయం తెలియక అతని వెంట అనవసరంగా పడుతున్నావు.
దానవోత్తమా! పరమేశ్వరుడు సత్యం పలికేవాడే అయితే నీ చేయ్యి తన శిరస్సుకు తగలనీయకుండా భయంతో ఎందుకు పారిపోతాడు? ఇంతకీ శివుడి విషయంలో నమ్మదగినది ఏమైనా ఉన్నదా? అదీగాక దైత్యేంద్రా! నీవు అశుచిగా ఉండి మహేశుడిని తాకడం తగదు. అందుచేత, వెళ్ళి కాళ్ళుచేతులూ కడుగుకుని, ఆచమనం చెయ్యి. అప్పుడు శివుడిని వెంబడించి అతడిని తాకావచ్చు, నీ సందేహం తీర్చుకోనూవచ్చు. అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకు. వెంటనే బయలుదేరు.” అంటూ దానవాంతకుడు అయిన విష్ణువు హెచ్చరించాడు. వృకాసురుడు విష్ణుమాయవలన తనను తాను మరచి, తామసంతో తన చేతిని తన నెత్తి మీదే పెట్టుకుని మరణించాడు. వృకాసురుడు ప్రసిద్ధమైన వజ్రాయుధం దెబ్బకు కూలిన మహా పర్వతంలా నేలకూలాడు. అలా తన చెయ్యి తన నెత్తిన పెట్టుకోడం వలన, తల నూరు ముక్కలై నేలగూలిన వృకాసురుడిని చూసి దేవతలు, అప్పుడు....దానవవైరి హరి మీద దేవతలు మందార పూల వాన కురిపించారు. ఆకాశంలో దేవ దుందుభులు మున్నగు దివ్య వాయిద్యాలు మ్రోగాయి. గంధర్వులు పాటలు పాడారు. అప్సరసలు సంతోషంతో నాట్యాలు చేశారు, ఆకాశంలో గ్రహాలన్నీ కూటములు కట్టాయి. మునుల భీతిని విడిచారు. అప్పుడు...మురాసురసంహారి శ్రీహరి చిరునవ్వుతో పరమ శివుడితో ఇలా అన్నాడు “భూతేశ్వరా! ఈ దానవుడు నీకు అపకారం తలపెట్టి తనకు తానే మరణించాడు. అలాగే అవుతుంది కదా. లోకంలో మహాత్ములకు కీడు చేసిన వాడికి శుభాలు దక్కవు కదా. అలాంటిది లోకేశ్వరుడవు అయిన నీకు అపకారం తలపెట్టిన దుష్టుడు చావక తప్పదు. ఇలాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వడం తగదు.” అని ఈ రీతిగా పలికిన విష్ణువు శంకరుడికి వీడ్కోలు చెప్పాడు. హరుడు హరిని అనేక విధాలుగా స్తుతిస్తూ తన నివాసానికి వెళ్ళిపోయాడు.” అని చెప్పి మరల ఇలా అన్నాడు.
ఈ వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు. ఇలా ఈ ఉపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఇంకా ఇలా అన్నాడు. “మహారాజా! నీకు ఇంకొక పురాతనగాథ చెబుతాను విను. పూర్వం తపోధనులైన మునులు ఎందరో సరస్వతీనదీ తీరంలో ఉండేవారు.
సశేషం🙏
*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి