11, మే 2024, శనివారం

పింగళి నాగేంద్ర రావు గారి వర్ధంతి*

 *పింగళి నాగేంద్ర రావు గారి వర్ధంతి*



మీరు బ్రహ్మచారి కదా! శృంగార గీతాలు, రొమాంటిక్ గీతాలు ఇంత బాగా ఎట్లా వ్రాస్తున్నారు కవి గారూ?....


అని మన రేలంగోడు, మాటల మాంత్రికుడు పింగళి గారిని అడిగితే....


యుధ్ధం సీన్లు రాయాలంటే.....యుధ్ధం చేయాలా!? 


శృంగారం గురించి వ్రాయాలంటే....శృంగార అనుభవం ఉండాల్సిందేనా! 


వాత్సాయనుడు అస్కలిత బ్రహ్మచారట తెలుసా!


రవి కాంచనిది కూడా కవి కాంచును కదా! అదే నీకు, నాకు ఉన్న వ్యత్యాసం!.... అని నవ్వుతున్న పింగళి వారిని, 


నోరు తెరచి..చూస్తుండిపోయాడట రేలంగి గారు.


ఎంతైనా...బ్రహ్మచారులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే ఉంటుంది కదా!


ఆయన మాటల్లోని పాటలు....పాటల్లోని మాటలు....


సినిమా టైటిల్స్ గా వచ్చాయంటే...ఇక వారి ప్రతిభకు వేరే నిదర్శనం కావాలా!


ఆహ నా పెళ్ళంట, 

చూపులు కలసిన శుభ వేళ, 

వివాహ భోజనంబు, 

హై హై నాయకా, 

రావోయి చందమామ, 

ఎంత ఘాటు ప్రేమయో.....


ఇవన్నీ...సినిమాలకు పేర్లయ్యాయి!


                              @@@@


మాటలతో ప్రయోగాలు చేసి...క్రొత్త పదాలను సృష్టించడంలో...


ఆయన సర్వ స్వతంత్రుడు.


తస్మదీయులు, హలా, డింగరీ, గిడిగిడి, వాలతుల్యుడు, నిక్షేప రాయుడు, హంవీరుడు హరమతి, కాలమతి, ఘాటు ప్రేమ, జగజగాలు, ఉర్రూగించిన.........


అసలా పదాలు భలే క్రొత్తగాను, వింతగానూ...తమాషాగానూ...ఉన్నా,.... 

ఆమోదయోగ్యంగా ఉండేవి!


ఎవ్వరూ పుట్టించకుండా....పదాలెట్లా పుడ్తాయి?! వెయ్యండి వీర తాళ్ళు...రెండు!...


అంటాడు ఘటోత్కచుడు...మాయాబజార్ లో.


                              @@@@                           


పాతాళ భైరవి, పెళ్ళి చేసి చూడు, మిస్సమ్మ, మాయాబజార్, జగదేకవీరుని కథ, అప్పు చేసి పప్పు కూడు...మరచిపోలేని మాణిక్యాలు.


నాటక సమాజానికి కార్యదర్శిగా ఉండి...తన వింధ్య రాణి, నా రాజు డ్రామాలు వేస్తున్న కాలం లోనే...ప్రేక్షకుల నాడి పట్టేశారు పింగళి! 


ఏ కథైనా వినోద ప్రధానం గా ఉండి..చమత్కారాలతో ఉంటే....ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని. 


సరదాగా..హాయిగా సాగిపోవాలి కథనం. అదే విజయ సూత్రం అంటారాయన. 


వారు వ్రాసిన సాంఘీక చిత్రం పెళ్ళినాటి ప్రమాణాలు కూడా అదే ఋజువు చేసింది.


                           @@@@


నాటక రచయిత, కథకుడు, స్క్రిప్ట్ రైటర్, మాటలు, పాటల రచయితగా...పింగళి నాగేంద్రరావు గారి శైలి మరెవ్వరికీ అందనిదని చెప్పడం అతిశయోక్తి కాదు.


ఈ కాలం రచయితల సంపాదన లా ఉండేది కాదప్పటి రచయితల ఆర్థిక పరిస్థితి. 


మద్రాస్ లో కొన్న ఇల్లు కూడా అమ్ముకోవలసి వచ్చింది. అదీ ఘంటసాల వారికే! 


అదే ఇంటిలో మిద్దె మీద ఓ గది అద్దె కు తీసుకున్నారు! చివరి రోజుల్లో గొంతు కాన్సర్ చికిత్స కోసం షీల్డులతో సహా అమ్మేయవలసి వచ్చింది!


అయినా విజయా మూవీస్ చూస్తూన్నప్పుడు....

పాతాళభైరవి లో ఓ తోట రాముడు....

మిస్సమ్మ లో డేవిడ్ పాత్ర.....

పెళ్ళి చేసి చూడులో ధూపాటి వియ్యన్న...


ఇలా ఎన్నో చక్కటి పాత్రల ద్వారా....పింగళి వారి రచనా చమత్కృతులు గుర్తొస్తూనే ఉంటాయి. 


ఒక్క మాయా బజార్ చాలదా!


6-5-1971.....పింగళి నాగేంద్ర రావు గారి వర్ధంతి.

నివాళులర్పిస్తూ...🌹


From one WhatsUp group

కామెంట్‌లు లేవు: