11, మే 2024, శనివారం

*శంకర జయంతి

 *శంకర జయంతి*

*(రేపు)*

🌿🌼🌿🌼🌿🌼🌿🌼

 భరత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య.

జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి నాడు కర్కాటక లగ్నమందు) కేరళ రాష్ట్రం, కాలడి లో శివగురు, ఆర్యాంబ దంపతులకు జన్మించారు. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ, కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం, ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది. ( *క్రీస్తు పూర్వం అని రాసుకోడానికి చింతిస్తున్నాను, శంకరుల శకం శంకరుల పూర్వం అని రాసుకోగలిగే రోజు వస్తే బాగుండు* )

ఆయన తన రెండవ ఏటనే రాయడం, చదవడం మొదలుపెట్టారు. మూడవ ఏటనే గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు.కారణజన్ములైన శంకరాచార్యులవారు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.


హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన, ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ, అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు, ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. 


శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే, ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 

శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. 


👉 ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 


👉 ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా, ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ “ *కనకధారా స్తవం* ” ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.

👉 శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు. 

👉 ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. ఒకసారి శంకరులు నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని, అనుమతినివ్వమనీ ప్రార్థించారు.తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ, ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు.

ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి, శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.

ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ *మనీషా పంచకం* చదివారు.

ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ, అనేక, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం మొదలైనవి.

ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ,ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు.

ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం


చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు, మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు,పద్మపాదుడు, సురేశ్వరుడు, పృధ్వీవరుడు మొదలైన వారు.

ధర్మసంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం, దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం, పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ, ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.

ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు, తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.


అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి. పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి. వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి. ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ, దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. 


*నామాట*

*శంకరుల వారసునిగా నువ్వేమి చేయాలి?*

శంకరుల అవతరణకు ముందు దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే ఉన్నాయి. ఇప్పటి పరిస్థితులు చక్కబడాలి అంటే మళ్ళీ శంకరులు అవతరించాల్సిందే. అయితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడడం కన్నా లక్ష్మీ హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న శంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడు అవ్వాలి, ఆయనే మనకు స్పూర్తి అవ్వాలి. ప్రతి తల్లి తన కుమారుని ఒక శంకరునిలా పెంచాలి. మనం మన మాత్రు ఋణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మమే మన తల్లి. మన గ్రంధాలమీద వేరే వాడు పెత్తనం చెలాయించడం ఏంటి ? మన గురించి ఎవడో పిచ్చిరాతలు రాయడం ఏదో టీవీ లో కూర్చొని పిచ్చికూతలు కూయడం ఏమిటి ? 

ఓ హిందువా మేలుకో ! అంతర్ముఖమై నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను. 

ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి, శక్తిని సంపాదించి, స్పూర్తిని పొంది నీమీద ధర్మం మీద స్పష్టత పొంది మరో శంకరుడివై నీ ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. అలా చేసినప్పుడే శంకరులకు మనం సంపూర్ణ మర్యాదతో కూడుకున్న గౌరవం ఇచ్చినట్టు.

*సనాతన ధర్మం వర్ధిల్లాలి*


*సనాతన ధర్మ రక్షకుడు అది శంకరుడు..* 




'ఎవరు తప్పుకోవాలి?.. తప్పుకోమన్నది నన్నా?.. నాలోని ఆత్మనా?....


 అన్నమయమైన ఇరువురి శరీరాల్లోని ఆత్మ ఒకటే కదా?....

 ఒక ఆత్మ మరొక ఆత్మకు చెప్పు మాటలా ఇవి?..'..


కాశీలో గంగానదిలో స్నానం చేసి శిష్యులతో కలిసి విశ్వనాథుని దర్శనానికి వెళుతున్న శంకరాచార్యులకు దారిలో కుక్కలతో వస్తున్న చండాలుడు ఎదురయ్యాడు.. శిష్యులు అతన్ని తప్పుకొమ్మన్నారు.. 


అప్పుడు చండాలుడు వేసిన ప్రశ్నలు ఇవి.. చండాలుని ప్రశ్నలతో శంకరునికికి జ్ఞానోదయమైంది.. తన ఎదుట ఉన్నది సాక్షాత్తు పరమ శివుడే అని, ఆ కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీక తెలుసుకున్నాడు.. వెంటనే ప్రణమిల్లాడు....


కేరళలో జన్మించిన శంకరుడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి సకల శాస్త్రాభ్యాసం చేశారు.. కాలి నడకన భారత దేశం నలుమూలలా పర్యటించి పీఠాలను నెలకొల్పారు.. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు భాష్యం రాశారు.. అద్వైతాన్ని బోధించి, బ్రహ్మం ఒక్కటే జ్ఞానమని చాటి చెప్పారు.. శాస్త్ర చర్చలో ఎందరో పండితులను ఓడించారు.. సనాతన ధర్మాన్ని చాటి చెప్పారు.....



శంకర భగవత్పాదుల కృషి కారణంగా ఈనాడు హైందవ ధర్మం సగర్వంగా తలెత్తుకొని కాల పరీక్షలో నిలబడింది. కానీ మనలో అంటరానితనం, మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి... మనకు ఈనాటికీ జ్ఞానోదయం కాలేదు.. వీటిని అంతమొందించడమే శంకరుడు బోధించిన నిజమైన బ్రహ్మ జ్ఞాన పరమార్థం..🙏

కామెంట్‌లు లేవు: