11, మే 2024, శనివారం

వైశాఖ పురాణం - 3

 వైశాఖ పురాణం - 3


3వ అధ్యాయము


వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు


నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.


నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.


శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో యివి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి భక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. ఆ వ్రతములన్నియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును.


అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.


బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారులు, సర్వ దేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమటపట్టినవాడు విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును(నీరుకల చెంబును), గొడుగును, విసనకఱ్ఱను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై(చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బునుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు) జన్మించును.


దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకుడస్సిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును అట్లు జలము నీయనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు. ఎండకుడస్సినవానికి విసురుటకు విసనకఱ్ఱ లేనిచో పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నందును. పరిసుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకఱ్ఱనీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.


గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక, ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగుదానమీయనివాడు, నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులులేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిధిగ వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును.


అంబరీషమహారాజా! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని వినయమధురముగ కుశలమడిగి యాదరించినవానిని పుణ్యము అనంతము. ఆకలిగలవానికి, భార్యసంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి యిష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమిన దానము యింతకు ముందులేదు, ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము, చత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగునవానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగువానిని యధాశక్తిగ చేయవలయును. రాజా! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రులకంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగునని బావము.


వైశాఖ పురాణము మూడవ అధ్యాయము సంపూర్ణం

కామెంట్‌లు లేవు: