ద్వాపరయుగపు చివరి రోజులు, కలియుగపు ప్రారంభపు రోజుల్లోని ఒక చిన్న కథను *వివేకానందులవారు* వారి శిష్యులకు చెప్పేవారు -
మత్స్యదేశపు రాజుల్లో ధర్మానికి ప్రతిరూపంగా కొనియాడబడిన ధర్మసేన మహారాజు తాను సుభిక్షంగా పరిపాలిస్తున్నానని, తానెంత ధర్మనిరతుడో తన ప్రజలు కూడా అంతే ధర్మాన్ని పాటిస్తారని, తన మాట జవదాటరని పొంగిపోతూ పరిపాలన చేయసాగాడు.
ఇది గమనించిన వరుణదేవుడు ఈ రాజుకు ప్రజల ధర్మబుద్ధిని, రాజభక్తిని తెలియచేయాలని ఒక మహర్షి వేషం ధరించి భూమి మీదకు, ఆ రాజ్యానికి వచ్చి వరిణ్యేన మహర్షుల వారు వస్తున్నారని తన శిష్యులతో రాజుగారికి కబురు పంపించాడు.
ధర్మసేన మహారాజు ఆ మహర్షి పేరు ఇంతకు ముందెన్నడూ వినకపోయినా, ఋషిపుంగవులు అనేసరికి సంతోషంతో ఎదురెళ్ళి తన అంతపురానికి సాదరముగా ఆహ్వానించి సకల మర్యాదలూ చేసి కుశలమడిగాడు.
మహర్షి కూడా రాజు యొక్క పరిపాలన, రాజు యొక్క, ప్రజల యోగక్షేమాల గురించి పలు ప్రశ్నలడిగాడు. అంత మహారాజు - తన పరిపాలన సర్వోన్నతంగా ఉన్నదనియూ, ప్రజలు కూడా ధర్మాచరణను, రాజుగా తన మాటను జవదాటరని జవాబిచ్చాడు.
రాజు మాటలకు నవ్వి, ఆ మహర్షి నీ ప్రజల నిబద్దత నీకు తెలియచేస్తాను, నేనూ పరీక్షిస్తాను అని చెప్పి రాజ్యంలో ఈ విధంగా చాటింపు వేయించమన్నాడు - "ప్రజల యోగక్షేమాలు, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రేపు ఉదయం దేవునికి అభిషేకములు, హోమములు చేయబోతున్నాము. దానికి కొన్ని వేల శేర్లు పాలు అవసరమవుతాయి కాబట్టి రాజ్యంలో ప్రతీ కూడలిలో పెద్ద పెద్ద గిన్నెలు ఉంచుతాము, మీ స్థోమతను బట్టి ప్రతీ ఇంటి నుండీ కనీసం ఒక్క శేరు పాల చొప్పున ఈనాటి రాత్రి మొదటి జాము దాటాక తీసుకొచ్చి ఆ కూడలిలో ఉంచిన పెద్ద గిన్నెలో పోయాలి" ఇది చాటింపు సారము.
రాజు మహర్షితో - "స్వామీ! నా రాజ్యంలో ప్రజలు పాడిపంటలతో తులతూగే మహా ఐశ్వర్యవంతులు. అందునా రాజుగా నా మాట జవదాటరు. అందువలన రేపటి ఉదయానికి అన్ని కూడళ్ళ కడవలూ చక్కటి, చిక్కటి పాలతో పొంగిపొర్లుతూ ఉంటాయి." అన్నాడు. దానికి సమాధానంగా మహర్షి నవ్వి ఊరుకున్నాడు.
తెల్లవారుతూనే సభ తీరిన మహారాజు, మహర్షి కూడా సభకు వేంచేసి రాగా తన మనుషులను రాజ్యామంతా పంపి కూడళ్ళలో ఉంచిన పెద్ద గిన్నెలను సభకు తీసుకురమ్మన్నాడు. వారు ఒక మూహూర్త కాలంలో కొన్ని గిన్నెలను సభకు తీసుకొచ్చి రాజు ముందు ఉంచి, మిగిలిన అన్ని గిన్నెలలోనూ ఇదే పరిస్థితి అని చెప్పారు. ఏ గిన్నెలోనూ ఒకటి, రెండు గ్లాసుల నీరు మించి లేదు. అది చూసిన రాజు నిట్టనిలువునా కుప్పకూలిపోయాడు. ఆ గాబులను చూసి ఎంతో హతాశయుడయ్యాడు.
జరిగింది చెప్పడం మాత్రమే కాదు, మనసులను కూడా చదవగలిగే ఆ మహర్షి రాజుతో రాత్రి ఏమిజరిగిందో, ప్రజల మనోభావలను ఇట్లు చెప్పడం ప్రారంభించాడు.
"రాజా! నీ రాజ్యంలో ప్రజలు రాత్రి ముఖ్యంగా ఇలా రెండు రకాలుగా ఆలోచన చేసారు -
1) మనం ఒక్కరిమే మొదటి జాము వరకు మెలకువగా ఉండి కూడలి వద్దకు వెళ్ళి గాబులో పాలు పొయ్యకపోయనంత మాత్రాన రాజుగారు చేసే రేపటి పూజలు ఆగిపోవు. ఇంకా ఎంతో మంది ఉన్నారు, వేరేవాళ్ళు పాలు పట్టుకునివెళ్ళి పోస్తారు - అని హాయిగా నిద్రపోయారు.
2) అందరూ పాలు పోస్తారు, మనం నీళ్ళు పోసినా ఆ పాలలో కలిసిపోతాయి. మనం నీళ్ళు పోసినట్టు ఎవ్వరూ గుర్తించలేరు. మనకు పాలు మిగులు - అని కొందరు నీళ్ళు పోసివచ్చారు."
రాజుకు సత్యం తెలిసివచ్చింది.
సుపరిపాలన అందుకున్న ఆనాటి ప్రజలు ఆవిధంగా ఆలోచించారు. మరి పాలన బాగోలేదని బాధపపడ్తున్న మనం కూడా ఆ రాజ్యంలో ప్రజల వలెనే ఆలోచిస్తున్నామా?
1) మనం ఒక్కరిమే మొదటి జాము వరకు మెలకువగా ఉండి కూడలి వద్దకు వెళ్ళి గాబులో పాలు పొయ్యకపోయనంత మాత్రాన రాజుగారు చేసే రేపటి పూజలు ఆగిపోవు. ఇంకా ఎంతో మంది ఉన్నారు, వేరేవాళ్ళు పాలు పట్టుకునివెళ్ళి పోస్తారు. -
మనం ఒక్కరం ఓటు వెయ్యకపోతే ఎలక్షన్స్ ఆగిపోతాయా? ఇంత ఎండల్లో అంతంత దూరాలు వెళ్ళి ఓటు వెయ్యకపోతే గెలిచేవాడు గెలవకపోతాడా? ఎవ్వరొస్తే మనకు ఒరిగేదేముంది?
ఒక్కటి గుర్తు పెట్టుకోండి - *ఒకేఒక్క నిజాయితీపరుడు ఓటుహక్కును వినియోగించుకోకపోయినా కూడా అవినీతిపరుడు, దుర్మార్గుడు రేపు ఎలక్షన్స్ లో గెలిచి నాయకుడై మనమీద ఐదు సంవత్సరాలు పెత్తనం చెలాయిస్తాడు.. నిలువు దోపిడీ చేస్తాడు. జరుగుతున్నదదే..*
నిజమైన మంచి నాయకుడు గెలవడం గొప్పకాదు. గెలుపులో మనమంతా భారీ మెజార్టీ చేకూర్చిపెడితే నైతిక మద్దతు అందించినట్టు. ప్రతీఒక్కరి ఓటూ విలువైనదే.
2) అందరూ పాలు పోస్తారు, మనం నీళ్ళు పోసినా ఆ పాలలో కలిసిపోతాయి. మనం నీళ్ళు పోసినట్టు ఎవ్వరూ గుర్తించలేరు. మనకు పాలు మిగులు. -
*మనకి ముట్టేది ముట్టింది, మనకు మిగిలేది మిగిలింది అనుకుంటే - చివరికి నట్టేట మునిగేది మనమే.* ప్రలోభాలు, తాయిలాలు తాత్కాలిక ఆనందాన్నిస్తాయి. అవి శాశ్వతంగా నిలిచిపోవు. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించకండి. మార్పు రావాలి. పోటీకి నిల్చున్న నాయకులలో దార్శినికతను చూడండి. వారి దార్శినికతలో మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్, పరిరక్షింపబడే సమాజ శ్రేయస్సు, సనాతనవిజయం కనబడాలి.
మన దేశం, మన రాష్ట్రం, మనం సంథి సమయంలో ఉన్నాము ప్రస్తుతం. అందువలన ఆలోచించి ఓటు వెయ్యండి. ఓటు వెయ్యడం మానకండి. అందరిచేత ఓటువెయ్యిచండి. సమాజానికి ఒక మంచి నాయకుడ్నివ్వండి.
నలుగురికీ ఈ సందేశాన్ని దయచేసి మీవంతుగా పంపండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి