హాస్యం పరమౌషధం:
హాస్యం అనేది ఇష్టపడని వారుండరు. అందుకే అప్పటిలో రాజాస్థానాలలో కూడా విదూషకులు ఉండేవారు. మన రాయలవారి ఆస్థానములో విదూషకుల సంగతి తెలియదు గానీ మన తెనాలి రామలింగ కవి గూర్చి ఇప్పటికీ ఆబాలగోపాలం కథలు కథలుగా చెప్పుకుంటారు.సీరియస్ గా దు:ఖమయమై సాగే కథలో కూడా కాస్త హాస్యం ఉండాలని అంటారు మన వాళ్లు.నవ్వు నవ్వించు నవ్వలేని వారికి నీ నవ్వులు పంచు అన్నారో సినీకవి భాగస్తులు 1974 సినిమా కోసం. ఇంక నవ్వడం ఓ భోగం , నవ్వక పోవడం ఓ రోగమే అని అనేశారు మన హాస్య రచయితా దర్శక చక్రవర్తి జంధ్యాల గారు.
ఇంక మన ముళ్లపూడి వారి గూర్చి చెప్పేదేముంది .. సునిశిత పదాలతో కిసుక్కున నవ్వించడం లో అందె వేసిన చేయి.. చతురోక్తులు విసరడములో వారిదో విభిన్న శైలి.ఎన్నో ఉన్నతమైన చిత్రాలలో ఆయన పండించిన హాస్యం అద్భుతంగా పండింది. సీరియస్ గా సాగే అన్నా చెల్లెళ్ల బంధాలతో తీసిన రక్త సంబంధములో రేలంగి లవ్ కామెడీ ట్రాక్ , నిరాహార దీక్షలు పెట్టించి హాస్యం కురిపించడం ముళ్ళపూడి వారికే చెల్లింది. సీరియస్ గా సాగే సన్నివేశాలలో కూడా కాస్త సమయస్పూరకంగా హాస్యాన్ని ప్రవేశ పెట్టడం ముళ్లపుడి వారి ప్రత్యేకత. అంతెందుకు మాయబజార్ చిత్రం అంతగా ఆడిందంటే , ఇప్పటికీ జనాలు చూస్తున్నారంటే అందులోని సంగీత దర్శకత్వ, నటనా ప్రతిభలే కాదు.. అందులోని సునిశిత హాస్యం కూడా.
అందరూ వ్రాయగలరు గానీ గిలిగింతలు పెట్టేట్టు చక్కని చమక్కులతో వ్రాయగలడం ఓ ప్రత్యేకత . అంతెందుకు విశ్వనాథ వారు తమ స్వర్ణకమలం చిత్రం కోసం ప్రత్యేకంగా హాస్య సన్నివేశాలు జంధ్యాల వారి చేత వ్రాయించుకున్నారంటే అర్థం అవుతుంది. ఇంకా తోలుబొమ్మలాట లో కూడా బంగారక్క, జుట్టు పోలిగాడు , కేతిగాడు ఇలా ప్రత్యేక పాత్రలు ఉండేవి హాస్యం పండించేవి . కొంత హాస్యం మోటుగా ఉండేది , మరికొంత హాస్యం అందరు చక్కగా మళ్ళీ కుటుంబ సభ్యులతో చెప్పుకుని మరీ నవ్వుకోగలిగేవిగా ఉండేవి .
ఇంక అరవై నాలుగు ఏళ్ళ క్రితం వచ్చిన మన బుడుగ్గాడు లాంటి వాడే పంతొమ్మిది వందలాది యాభై తొమ్మిదిలో డెన్నిస్ ది మెనేస్ గా అనేక భాషల్లో వచ్చి కిత కితలు పెట్టింది . అంతెందుకు నేను బుడుగు ని పదమూడు సార్లు కొన్నాను . పండ్రెండు సార్లు మాయామయ్యాడంటే వాడు అందరికీ ఎంత నచ్చునుండాలి . వాడు వెళితే వారింటిలో ఒకడై పోతాడు గానీ మళ్ళీ తిరిగి రాడు.ముళ్ళపూడి వారి చతురోక్తులు ఇప్పటికీ మన అందరినీ హాస్యం లో ముంచెత్తుతున్నాయి. ఓ ఫైవ్ అంటూ అప్పడిగే ఋణానందలహరి నాయకుడు అప్పారావు , చిచ్చుల పిడుగు బుడుగు ఇలాంటి వన్నీ మన ముళ్ళపూడి వారి మానస పుత్రులే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి