శు భోదయం🙏
అనువాద చాతుర్యం!!
అనువాదంకూడా ఒక కళే! మూలంలో ఉన్నదానికి సొగసులద్దుతూ మనభాషకు నుడికారానికి ప్రాణపోస్తూ
అను వాదం చేయటం మాటలుకాదు. దానికెంతో నేర్పుండాలి. మనసాహిత్యం అనువాదంతోనే ప్రారంభం.ఆదికవి నన్నయభట్టారకుడు. జయేతిహాసానికి తెలుగులో భావానువాదాన్ని నిర్వహించాడు. ఆమార్గమే ఆగామికవులందరకు మర్గదర్శకంగాఃమారింది. భావానువాద పధ్ధతిలోనే తెలుగున అనేక కావ్య నాటకాదులు అనువదింపబడి సాహిత్యానికి పుష్టినికలిగించాయి.
ఆధునిక యుగంలో పుంఖానుపుంఖంగా సంస్కృత నాటకానువాదాలు వెలుగును చూశాయి . ఆమార్గంలో వెలువడినదే " ఉత్తర రామచరితం" నాటకానువాదం.బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు దీనియనువాదాన్నెలా నిర్వహించారో స్థాలీపులాకంగా పరశీలనచేద్దాం.
సంస్కృతంలో దీవిని భవభూతి వ్రాశాడని వేరే చెప్పేపనిలేదు. ఆపేరువినగానే ఆయనేగుర్తుకు రాకమానడు.
ఇకఅనువాదకర్త బ్ర:శ్రీ:మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారిగురించి రెండుమాటలు.వీరు మహాపండితులు.కందుకూరి సమకాలికులు. తూ:గో: ధవళేశ్వరము(కాటన్ బేరేజీ) వీరినివాసం.అనేక కావ్యాలు వ్రాసిన ఉద్దండ పండితులు.
ఉత్తర రామచరితం ప్రథమాంకంలో చిత్రపట ప్రదర్శనమనే ఘట్టంఉంది. అందులో ఒకశ్లోకాన్ని పరిశీలిద్దాం.
సందర్భం:రావణ వధానంతరం రాముడు పట్టాభిషక్తుడై అయోధ్యనేలుచుండ,సీత గర్భవతియౌతుంది. ఆమెకు వినోదార్ధమై చిత్రపట సందర్శవమేర్పాటయినది. చూచుటకు సీతాలక్ష్మణ సమేతుడై రాముడేగినాడు. సీతా వివాహానంతరము రామాదులు అయోధ్యలో హాయిగా కాలమును గడుపుచున్న దృశ్యములు కనబడినవి.వానిని చూడగనే రాముడు స్పందించి లక్ష్మణునితో నిట్లనినాడు." లక్ష్మణా!
శ్లో: జీవత్సు తాతపాదేషు, నూతనే దారసంగ్రహే /
మాతృభిః చిత్యమానాయాః, తేహి నో దివసాః గతాః//
భావం: నాన్నగారుజీవించి యుండగా, కొత్తగా పెండ్లియాడినవారమై,తల్లులుసౌకర్యములను
జూచుచుండ,(సుఖముగానున్నాము.) ఆరోజులు వెళ్ళిపోయాయిగదా! - అని;
దీనికి శాస్త్రి గారి యనువాదం చూడండి!!
ఉ: నాయన గారు పాలన మొనర్చుచు హాయిగ నుండ, యింట లే
బ్రాయపు కొత్తభార్య లలరారుచు నుండగ ,మువ్వురమ్మ లెం
తేయనురక్తి బ్రోవ , సుఖియించితి మన్నివిధాల , నాసుధా
ప్రాయములైన రోజు లిక రావికరావిక రావు,తమ్ముడా!!!
నాల్గవ పాదమంతా అనువాద కర్త ప్రతిభే! మూలంలో లేదు.కానీ యికరావికరావు అంటూ ఆమ్రేడితంగా చెప్పటం యెంతబాగుంది? యీపద్యమీద యెన్నోతర్జనృభర్జనలు. మూలానికి మెఱుగు పెట్టినందుకు శాస్త్రిగారిని కొందరు దూషిస్తే,మరికొందరు భూషించారు. అయితే మల్లాది వారి యనువాదం బాగుంది అనికందుకూరి మెచ్చటం కొసమెరుపు!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి