28, మే 2024, మంగళవారం

తేడా ఏమిటి?

 తేడా ఏమిటి?


కర్తవ్యం, బాధ్యత- అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరు. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు. కాబట్టే కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్ మెంటు) ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు (అటాచ్మెంట్) ఉంటుంది. వివేక వంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు. తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు. రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీ లిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. రాముణ్ని ఓ ఇంటి వాణ్ని చేసింది- కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు. జాగ్ర త్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామి త్రుడు. అది ఆయనకు విధి నిర్దేశిం చిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోకకల్యాణం, సీతారామకల్యాణం అనేవి రెండూ ప్రధాన లక్ష్యాలు. వీటిలో మొదటిది- రాముడి అవతార పరమార్ధంతో ముడివ డినది. రెండోది- ఆ పరమార్థం నెర వేరేందుకు కావలసిన శక్తిని సమ కూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ. విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణ మనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్ప డిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమ కూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం

సీతారామకల్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం. అది రాముడి పని. రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్ర శస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్మెంటు అనే భావానికి అసలైన అర్థం అదే!


రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు. తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్ర శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని. కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!


పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిర పడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. దాని కొనసా గింపు. కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి. ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి.


ఎర్రాప్రగడ రామకృష్ణ

కామెంట్‌లు లేవు: