28, మే 2024, మంగళవారం

అమర్‌నాథ్‌

 *అమర్‌నాథ్‌ గుహ,అమర్నథ్ యాత్ర (Amaranath Cave,Amaranath yatra )- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుదాం..*



మంచు కొండ మీద ఓ గుహ... భారత దేశంలోనే పెద్దది ఉన్నది 12,000 అడుగుల ఎత్తున... అక్కడికి వెళ్లడమే ఎంతో కష్టం... అయినా లక్షలాది మంది దర్శిస్తారు... అదే అమర్‌నాథ్‌!


ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుడిని అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే అమర్‌నాథ్‌ గుహ! జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని మంచు కొండపై, సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ గురించిన పురాణ కథ ఇది. దేశంలోనే అతి పెద్ద గుహగా 75 అడుగుల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో ఉండే ఇందులో ఏటా జూన్‌, ఆగస్టుల మధ్య కాలంలో మంచు శివలింగాకారంలో ఏర్పడడం ఓ భౌగోళిక అద్భుతం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన ఇక్కడికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.


అమర్‌నాథ్‌ గుహ బుటామాలిక్‌ అనే ఓ ముస్లిం బాలుడి వల్ల బయటపడడం ఒక విశేషం. తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ మంచు కొండ ఎక్కినప్పుడు తొలిసారిగా దీన్ని చూశాడని చెబుతారు. ఇప్పటికీ ఆ బాలుడి వంశస్థులు అక్కడే ఉంటారు. అమర్‌నాథ్‌ సంబంధించిన ప్రస్తావన క్రీస్తుపూర్వం 34 నుంచి అనేక గ్రంథాలు, చారిత్రక ఆధారాలలో కనిపిస్తుంది. భక్తులు పహల్గామ్‌ అనే ఊరి నుంచి 42 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచు కొండ ఎక్కుతారు.


జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు, పహల్గామ్‌లో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్‌వరి వద్ద నెలవంకని, శేష్‌నాగ్‌ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్‌ పర్వతం వద్ద గణేశుడిని, పంజితర్ణి వద్ద పంచ భూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడి చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్‌నాథ్‌ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు.


అమర్‌నాథ్‌ గుహకి పైభాగంలో ఉండే రామకుండం అనే సరస్సు నుంచి బొట్టు బొట్టుగా పడే నీరు గడ్డకడుగూ ఏడడుగుల ఎత్తయిన శివలింగంగా ఏర్పడుతుంది. దీని ఎత్తు చంద్రుని హెచ్చుతగ్గులను బట్టి మారుతుందని చెబుతారు.🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: